Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 01:47AM

మృతుల సంఖ్య 31 ..28 మృతదేహాలు స్వాధీనం

  •  రిజర్వాయర్లో మరో ముగ్గురు గల్లంతు 
  •  బుజింగి గుట్టపైనే మరో నాలుగు మృతదేహాలు..
  • మృతుల్లో స్థానిక గిరిజనులు!? 
విశాఖపట్నం, ముంచంగిపుట్టు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా ఒడిసా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతుల సంఖ్య 31కి చేరింది. కాల్పుల తర్వాత సోమవారం 24 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యం కాగా, మంగళవారం మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఎన్‌కౌంటర్‌ స్థలంలో ముమ్మరంగా గాలింపు చేపట్టిన స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ బలగాలు మంగళవారం బెజింగి గుట్టపైనే బుల్లెట్‌ గాయాలతో విగత జీవులుగా పడి ఉన్న మరో నలుగురు మావోయిస్టులను గుర్తించాయి. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. కాగా, మరో ముగ్గురు మావోయిస్టులు బలిమెల రిజర్వాయరులో పడి గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. మొత్తంగా చూసుకుంటే పోలీసుల దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది. పోలీస్‌ ఉన్నతాధికారులు మాత్రం 28గానే ప్రకటించారు. వీరిలో పురుషులు 16 మంది కాగా, మహిళలు 12 మంది. 15 మందిని మాత్రమే పోలీసులు ఇప్పటి వరకు గుర్తించారు. మృతుల్లో ఆర్కే అంగరక్షకుడు, విశాఖజిల్లా జీకే వీధి మండలం గరికిబందకు చెందిన గెమ్మెలి కేశవరావు అలియాస్‌ బిర్సు ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులతోపాటు వారికి సహకరించేందుకు వచ్చిన స్థానిక గిరిజనులు మృతి చెందారనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఎన్‌కౌంటర్‌ జరిగిన 24 గంటల తర్వాత కూడా పోలీసులు, మృతుల వివరాలను కచ్చితంగా వెల్లడించలేకపోతున్నారని అంటున్నారు. మృతదేహాలను భద్రపరుస్తున్నామని, బంధువులు, మాజీ మావోల సాయంతో వారు ఎవరనేది గుర్తించి, వెల్లడిస్తామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. కుటుంబ సభ్యులకు మురళీ మృతదేహం చింతపల్లి ఎన్‌కౌంటర్లో మరణించిన సింహాచలం అలియాస్‌ మురళీ మృతదేహాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విజయనగరం జిల్లాకు చెందిన మురళీ కోరాపుట్‌ డివిజన్‌లో ఏసీఎంగా పనిచేస్తున్నాడు. కాగా, విరసం నేతలు వరవరరావు, కల్యాణరావు, ఆర్కే భార్య పద్మ చింతపల్లి, సీలేరు మీదుగా రాత్రి పది గంటలకు మల్కన్‌గిరి చేరుకున్నారు.

ఇంతవరకు గుర్తించిన వారి పేర్లు
1. దయా, ఎస్‌జెడ్‌సీఎం, తెలంగాణ
2. గణేశ, ఎస్‌జెడ్‌సీఎం, విశాఖపట్నం
3. బిరుసు డీసీఎస్‌, విశాఖపట్నం
4. రైనో అలియాస్‌ సునిల్‌ డీసీఎం, ఈస్ట్‌
5. దాసు, డీసీఎం, పశ్చిమ గోదావరి
6. మున్నా, డీసీఎం, ప్రకాశం జిల్లా
7. రాజేశ, డీసీఎం, తూర్పు గోదావరి
8. హరి, డీసీఎం, విజయనగరం
9. రైనో, డీసీఎం, తూర్పుగోదావరి
10. ప్రభాకర్‌, డీసీఎం, ప్రకాశం
11. శ్వేత, ఏసీఎం
12. లత అలియాస్‌ పద్మ, డీసీఎం
13. రుప్పి, డీఎం, కోరాపుట్‌
14. బుద్రి, డీఎం
15. దినేష్‌, ఏసీఎం