desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 01:27AM

హైదరాబాద్‌లో యు టూ టాక్సీలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : మొబైల్‌ యాప్‌ ఆధారంగా టాక్సీ ఆగ్రిగేటింగ్‌ సేవలందించే యు టూ హైదరాబాద్‌లో తమ సేవలను ప్రారంభించింది. తొలి దశలో 105 కార్లతో సేవలు ప్రారంభించిన ఈ సంస్థ డిసెంబరు చివరి నాటికి వాటి సంఖ్యను 750కి పెంచాలనుకుంటోంది. ఈ సందర్భంగా యు టూ సిఇఒ కెవిపి భాస్కరన్‌ విలేకరులతో మాట్లాడుతూ తమ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని తొలి రైడ్‌ బుక్‌ చేసుకుంటే కస్టమర్‌ చేసిన మొదటి ప్రయాణానికి సమానమైన రెండో రైడ్‌ 200 రూపాయల గరిష్ఠ పరిమితికి లోబడి ఉచితంగా అందిస్తామని చెప్పారు. తమ టాక్సీలన్నింటికీ పగలు, రాత్రి, పొడి వాతావరణం, భారీ వర్షం వంటి అంశాలతో తావు లేకుండా ఒకటే చార్జి వసూలు చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం యాప్‌ ఆధారంగానే బుకింగ్‌ అనుమతిస్తున్నామని, తదుపరి దశలో ఎస్‌ఎంఎస్‌ ఆధారిత బుకింగ్‌ కూడా ప్రవేశపెట్టే యోచన ఉన్నదని భాస్కరన్‌ అన్నారు. కాంపాక్ట్‌ విభాగంలో బేస్‌ ధర 40 రూపాయలు, సెడాన్‌ విభాగంలో బేస్‌ ధర 40 రూపాయలు వసూలు చేస్తామని ఆయన తెలిపారు.
అన్నీ కొత్త కార్లే
తాము 2015 తర్వాత తయారైన కార్లనే ఫ్లీట్‌లోకి తీసుకువస్తున్నట్టు భాస్కరన్‌ చెప్పారు. కార్లను తామే సొంతంగా కొనుగోలు చేసి డ్రైవర్లను నియమించుకుని సేవలందిస్తామని ఆయన అన్నారు. డ్రైవర్లకు నెలకి 15 వేల రూపాయల వేతనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలుంటాయని ఆయన చెప్పారు. అలాగే ఇతర ఆగ్రిగేటర్ల వలె రాబడిలో వాటా విధానంలో కూడా డ్రైవర్లను నియమించుకుంటామని, అలాంటి వారికి కూడా ఎన్ని కిలోమీటర్లు తిరిగారన్న దానితో సంబంధం లేకుండా రోజుకి కనీసం 500 రూపాయలు చెల్లిస్తామని, అధిక మొత్తంలో రైడ్‌లు తిరిగిన డ్రైవర్లకు వారి సంపాదనలో 35 శాతం మొత్తం పరిహారంగా చెల్లిస్తామని ఆయన తెలిపారు. అలాగే డ్రైవర్లందరికీ సొంత ఇల్లు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ఆయన చెప్పారు.