Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 4 2016 @ 02:24AM

అమరావతి అటవీ భూమిపై కేంద్రం మెలిక

  • ‘అటవీ భూముల వినియోగ ప్రణాళిక’ ఇవ్వాలని ఒత్తిడి
  • మినహాయింపు ఇవ్వాలన్న రాష్ట్ర అభ్యర్ధనను తోసిపుచ్చిన ఎఫ్‌ఏసీ
న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా కొంత మేరకు అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. సూత్రప్రాయంగా అమరావతిలో భవనాల నిర్మాణాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం.. అటవీ భూముల వినియోగ ప్రణాళిక, అటవీకరణ పరిహార ప్రణాళికలను సమర్పించాలని మెలిక పెట్టింది. గత ఏడాది జరిగిన అమరావతి శంకుస్థాపనకి ముందే కేంద్ర అటవీ, పర్యావరణశాఖ తొలిదశ అనుమతులను మంజూరు చేసింది. అయితే.. ఇప్పుడు మిగతా అనుమతుల కోసం కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా 13,267.12 హెక్టార్ల అటవీ భూముల డీనోటిఫైకి అనుమతి ఇవ్వాలని కేంద్రానికి సీఆర్‌డీఏ విజ్ఞప్తి చేసింది. ఏపీ విభజన బిల్లులో పేర్కొన్న విధంగా.. అటవీ భూముల్లో కూడా రాజధాని నిర్మాణం చేపట్టేలా.. ఆయా అటవీ భూముల మార్పిడికి అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే, రాజధాని నిర్మాణం కోసం కోరుతున్న అటవీ భూములను ఏవిధంగా ఉపయోగించుకోబోతున్నారు? ఆ భూముల్లో ఏయే ప్రాజెక్టులు చేపడుతున్నారు? ఏయే భవనాలు నిర్మిస్తారు? అంటూ కేంద్రం ప్రశ్నిస్తోంది. రాజధాని నిర్మాణానికి ఇంకా పక్కా ప్రణాళిక పూర్తికానందున ప్రస్తుతానికి అటవీ భూ వినియోగ ప్రణాళిక, అటవీకరణ పరిహార ప్రణాళిక, ఎఫ్‌ఆర్‌ఏ సర్టిపికెట్లు, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రామ సభల తీర్మానాల నుంచి మినహాయింపు ఇవ్వాలని, వీటిని భవిష్యత్తులో అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. కానీ, సమగ్ర అటవీ భూ వినియోగ ప్రణాళికతో పాటు అటవీకరణ పరిహార ప్రణాళికను అందజేస్తేనే రెండో దశ పర్యావరణ అనుమతులను మంజూరు చేస్తామని అటవీ సలహా కమిటీ(ఎ్‌పఏసీ) తేల్చి చెప్పింది. నిజానికి రెండో దశ అనుమతుల మంజూరు స్థాయిలోనే అటవీ భూముల వినియోగ ప్రణాళికను అందజేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో లే అవుట్‌ ప్లాన్‌ వచ్చిన తర్వాతే కేంద్రం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలావుంటే, అటవీ భూముల బదిలీకి అనుమతులు కోరుతూ గత ఏప్రిల్‌ 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ప్రతిపాదనలను పంపింది. అయితే, జూలై 12న జరిగిన అటవీ సలహా కమిటీ(ఎ్‌ఫఏసీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు కోరుతూ ఫైల్‌ను వెనక్కి పంపినట్లు సమాచారం.