Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 3 2016 @ 22:19PM

వ్యర్థంతో పరమార్థం

ఇంట్లో అందరూ తినగా మిగిలిన ఆహారం వీధిపాలు అవుతుంది. అదే వీధి చివరనున్న గుడిసెలోనివారు ఆకలితో అలమటిస్తుంటారు. ఈ రెండిటికీ మధ్యనున్న దూరాన్ని చెరిపేస్తోంది ‘వైజాగ్‌ స్మైల్‌’. వృథాగా పడేస్తున్న ఆహారాన్ని అన్నార్థుల నోటికందిస్తోంది. ‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో తినడానికి తిండి మాత్రమే కాదు.. కట్టుకోవడానికి వసా్త్రలు.. చదువుకోవడానికి పుస్తకాలు.. ఇలా విశాఖలోని మురికివాడల్లో ఉండే నిరుపేదల్లో ఆనందాన్ని నింపుతోంది. సేవాపథంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోన్న ఈ సంస్థ విశేషాలను సీఈవో రఘు పోకల ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు. 

అమెరికాలో ఓ సంప్రదాయం ఉంది. ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను, వాడని వస్తువులను ఏవైనా సరే ఇంటి బయట పెట్టేస్తారు. అవసరం ఉన్నవారు వాటిని తీసుకోవచ్చు. ఈ వస్తువులు దుర్వినియోగం కాకుండా వాటిని సేకరించి నిరుపేదలకు పంచే సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. పదిహేనేళ్లుగా నేను అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఉంటున్నా. ‘ఎన్‌కోర్‌ ఇండియా’ అనే ఐటీ సంస్థను నిర్వహిస్తున్నా. ఇలా వ్యర్థం అనుకున్న వాటిని ఇతరులకు అర్థవంతంగా పంచిపెట్టడం నాకెంతో నచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను పుట్టి పెరిగిన విశాఖలో ఏదైనా చేయాలని అనిపించింది. ఆ ఆలోచనల్లో నుంచే ‘వైజాగ్‌ స్మైల్‌’ పుట్టుకొచ్చింది.

 
ఫోన్‌ చేస్తే చాలు
శ్రీమంతులు మాత్రమే కాదు ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆహార పధార్థాల్ని ఎక్కువగానే పడేస్తుంటారు. రోజు వందలాది మంది తినే అన్నం చెత్తకుండీల పాలవుతోంది. అదేసమయంలో పిడికెడు మెతుకుల కోసం ఎదురుచూసే వారు ఎందరో ఉంటున్నారు. ఈ ఆహారాన్ని వారికి చేర్చడమే లక్ష్యంగా ‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ కాన్సె్‌ప్టతో ముందుకొచ్చాం. అన్నం మాత్రమే కాదు.. ‘ఇవి ఇక ఉపయోగం లేదు’ అనుకున్న ఏ వస్తువునైనా మేం తీసుకుంటాం. వాటిని అవసరం ఉన్నవారికి చేరవేస్తాం. ఇందుకోసం ‘306 700 700’ అనే ఫోన్‌ నంబర్‌ కేటాయించాం. దాతలు ఎవరైనా ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు.. మా వ్యాన్‌ వారింటికి చేరుకుంటుంది. వారిచ్చిన వస్తువులు సేకరిస్తుంది. వీటిలో అన్నం, పప్పు మొదలు స్కూల్‌ పుస్తకాలు, బట్టలు, కుర్చీలు, ఎలకి్ట్రక్‌ గూడ్స్‌.. అన్నీ ఉంటాయి. వాటిని క్రమపద్ధతిలో విభజించి.. ప్యాక్‌ చేసి పేదలకు పంచుతాం. డ్యామేజ్‌ అయిన వస్తువులను రిపేర్‌ చేసి మరీ ఇస్తుంటాం. చినిగిపోయిన దుస్తులుంటే వాటిని బాగు చేసి పంచుతాం. పనికిరాని వసా్త్రలను బొంతలుగా కుట్టి అమ్మేస్తాం. ఇలా వచ్చిన డబ్బుతో పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నాం.
 
రీ సైక్లింగ్‌.. రీ డొనేషన్‌..
పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలన్నదే మా ఆలోచన. అందరి ఇళ్లలో సేకరించిన అన్నపదార్థాలే కాకుండా.. మా సంస్థ తరఫున కూడా తరచూ అన్నదానం చేస్తున్నాం. అన్నదానం చేయదలచిన దాతలు మమల్ని సంప్రదిస్తుంటారు. ఒక్కో భోజనానికి అరవై రూపాయల చొప్పున చార్జ్‌ చేస్తాం. ఆ మొత్తంతో నాణ్యమైన ఆహారాన్ని వండించి అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి పెడుతుంటాం. కొన్ని రోజుల కిందట ఓ కుటుంబం 230 మందికి ఒకేసారి అన్నదానం చేయడానికి ముందుకొచ్చింది. అన్నదాన కార్యక్రమాన్ని ‘ఫేస్‌బుక్‌’ ద్వారా అన్‌లైన్‌ టెలికాస్ట్‌ చేశాం. ఎందుకంటే.. దీన్ని వీక్షించడం ద్వారా నలుగురు శ్రీమంతులైనా ముందుకు వస్తే.. వెయ్యి మంది పేదల ఆకలి తీరుతుంది కదా! మా కార్యక్రమాలన్నీ పారదర్శకంగా ఉంటాయి. దాతల వివరాలను ‘ఐ డొనేటెడ్‌ టు వైజాగ్‌ స్మైల్స్‌’ పేరుతో వాట్స్‌పలో షేర్‌ చేస్తాం. ఆయా వస్తువులు ఎవరికి దానం చేశామో కూడా ఫొటోలతో సహా తెలియజేస్తాం. దాతలు కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మా విధానంతో రీసైక్లింగ్‌, రీ డొనేషన్‌ విధానం ఇప్పుడిప్పుడే వైజాగ్‌వాసులకు చేరువవుతోంది.
 
మనసున్న మనుషులతో..
ఒక్కరితో ఏ సంస్థ నడవదు. సమష్టి కృషి కావాలి. ముఖ్యంగా సేవాపథంలో ముందుకు సాగాలంటే మనసున్న మనుషులు మనకు అండగా నిలవాలి. నాకు అలాంటి టీమ్‌ దొరికింది. నేనే లాస్‌ఏంజిల్స్‌లో ఉంటూ వైజాగ్‌లో సేవ చేస్తున్నానంటే అందుకు కారణం వారి కృషే. మా సంస్థ ‘ఎన్‌కోర్‌ ఇండియా’లో 75 మంది ఉద్యోగం చేస్తున్నారు. వీరంతా కష్టపడుతున్నారు. ఈ ఉద్యోగులను బృందాలుగా విభజించి పనులు అప్పగించాను. ఒక బృందం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్‌కాల్స్‌ రిసీవ్‌ చేసుకుంటారు. దాతలు ఏం ఇస్తామన్నారో నోట్‌ చేసుకుంటారు. వారు కోరిన సమయానికి వ్యాన్‌ పంపిస్తారు. వాటిని మా కేంద్రానికి పంపించి వస్తువుల వారీగా విభజిస్తాం. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా ప్యాకింగ్‌ చేసి మళ్లీ పంపిస్తాం.
 
టోకెన్ల ద్వారా..
ఈ ప్రయాణంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. నిజమైన అవసరార్థులు ఎవరో తెలియక ఫుట్‌పాతపై ఉన్న వారికి భోజనాలు పెట్టేశాం. ఏ పనీ చేయకుండా సోమరులుగా ఉండే వాళ్లను ఇవ్వడం అపాత్ర దానమే అవుతుంది. నిజమైన నిరుపేదలు ఎవరో తెలుసుకోవడానికి మా ఉద్యోగుల బృందం మురికివాడల్లో సర్వే చేపట్టింది. సాయం అవసరమైన కుటుంబాల వివరాల్ని సేకరించి టోకెన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. ఆ వివరాల ఆధారంగా వారికి అవసరమైన వస్తువులను ప్యాకింగ్‌ చేసి తీసుకెళ్లి టోకెన్ల వారీగా అందిస్తుంటాం. ఈ పనులన్నీ నేను ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తుంటా. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న క్రతువిది. నెలకు లక్ష రూపాయల వరకు ఖర్చవుతోంది. సొంత ఊరి కోసం ఈ మాత్రం చేయడం నా ధర్మంగా భావించాను. ‘వైజాగ్‌ స్మైల్స్‌’ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయడం వెనుక చిన్న స్వార్థం ఉంది. విదేశాల్లో ఉన్నవారు, ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారు.. మా ఫేస్‌బుక్‌ పేజ్‌ చూసినపుడు వారి ఊరి కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా చేయాలనే ఆలోచన కలుగుతుందని నా నమ్మకం.
- యర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం 
ఫొటోలు: వై.రామకృష్ణ 

అన్నదానం కోసం ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఒక్కో భోజనానికి రూ.60 తీసుకుంటాం. ప్రత్యేక అన్నదానం కోసం ఓ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నాం. అన్నం, సాంబార్‌, రెండు కూరలు, మజ్జిగ, అరటిపండు ఇస్తాం. పేదపిల్లల చదువు కోసం ఆర్థిక సాయం చేస్తున్నాం. అయితే రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్తూ, చదువుల్లో రాణిస్తున్నవారికి మాత్రమే ఈ సాయం అందుతుంది.