Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 15 2016 @ 17:59PM

గోదావరి తీర ప్రాంత ప్రజలకు వ్యాధుల భయం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గోదావరి తీర ప్రాంత ప్రజలకు ఇప్పుడు వ్యాధుల భయం పట్టుకుంది. గత ఐదు రోజులుగా గోదావరి వరదల్లో చిక్కుకుపోయిన గ్రామాల ప్రజలు అంటురోగాల బారిన పడే ప్రమాదముంది. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో గోదావరి వరదలు వస్తుంటాయి. అయితే... ఈ ఏడాది జూలైలోనే వరదలు వచ్చాయి. గోదావరి ఎగువ ప్రాంతాలైన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడం, అంతేగాక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే 51 అడుగుల మేరకు గోదావరి ప్రవహించిననంతరం వరద తగ్గుముఖం పట్టింది. దీంతో తెలంగాణలోని వాజేడు, చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాల్లోనేగాక ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో విలీనమైన నెల్లిపాక, వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు తదితర మండలాల్లోని కొన్ని గ్రామాలు నీట మునిగాయి. అంతేగాక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు కూడా నీట మునిగాయి. అయితే... గత నాలుగు రోజులుగా నీళ్లల్లో మునిగి బిక్కుబిక్కుమన్న ప్రజలను ఇప్పుడు కొత్త భయం వెంటాడుతోంది. గోదావరి వరదల వల్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఒండ్రు మట్టితో కూడిన నీరు నిల్వ ఉండడమేగాక చెత్తా, చెదారం మొత్తం కొట్టుకు వచ్చింది. అంతేగాక విషసర్పాలు, క్రిమికీటకాలు ఇళ్లల్లోకి చేరడంతో దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. దీని వల్ల ప్రజలు అంటు రోగాల బారిన పడే అవకాశముంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మేల్కొని ముంపు గ్రామాల్లో వెంటనే క్లోరినేషన్ పనులేగాక వైద్య శిబిరాలు వంటివి నిర్వహించకపోతే అంటు రోగాలే ప్రభలే అవకాశముంది. ప్రభుత్వాలు ఈ దిశగా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.