Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 28 2016 @ 00:19AM

డైలెమా కాదు, అసహనం!

చట్టంలో తమకి నచ్చని అంశాలని ఎన్నుకున్న ప్రతినిధుల చేత మార్పు చేయించాలి తప్పితే చట్టాలు నినాదాలతో మారేవి కావు. ఇంత పెద్ద వ్యాసాన్ని రాసిన హెచ్చార్కెకి రాజ్యాంగం గూర్చి ఈ మాత్రం కూడా తెలియదు అని అనుకోవడానికి మనస్కరించడం లేదెందుకని?

మార్చి 14న ‘అన్న ద్వేషం - బ్రహ్మ ద్వేషం’ శీర్షికన వివిధలో వెలువడిన హెచ్చార్కె గారి వ్యాసం చదివిన వాళ్లు, ఆలోచించగలిగిన వాళ్లలో కూడా ఆ ఆలోచనని తప్పుడు మార్గాన్ని పట్టించగల శక్తుల గూర్చి అచ్చెరువందక తప్పదు. ఈ వ్యాసం ఆత్మ, పరమాత్మలతో మొదలుపెట్టి, ఎక్కడెక్కడికో పోయి చివరికి వేలవేల ఎకరాల్లో ఆశ్రమాలను పెట్టి గల్లిబుల్‌ జనాలని తమ చుట్టూ తిప్పుకుంటున్న బ్రాహ్మణ వ్యక్తుల వద్ద ఆగింది. అందువల్ల, రచయితకి బెనెఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ ఇవ్వా లంటే ఈ వ్యాసం అంతా అలాంటి వ్యక్తులకే పరి మిత మయిందని అనుకోవాలి. అయితే, వాళ్లకోస మయితే ఇంత పెద్ద వ్యాసం అవసరమా అన్న సందేహం వచ్చి, ‘‘కాదు’’ అని పాఠకుడు నిర్ధారణ చేసేలా చేస్తుంది. ఎందుకంటే, అలాంటి వాళ్ల సంఖ్యని తెలుగు మాట్లాడే రాష్ర్టాల్లో ఒకచేతి వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
 
మరి, ఆ రెండు రాష్ర్టాల్లోని శాసనసభల్లో కలిపి ప్రజాప్రతినిధులుగా వున్న బ్రాహ్మణుల సంఖ్యని లెక్కపెట్టడానికి? ఒక చేతి లోని వేళ్లలో ఎన్ని ఎక్కువో అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో రిప్రెజెంటేషన లేనివాళ్లు పాత చీకటి శక్తు లని ముందుకు తెచ్చేలా ప్రభావితంచేసే ఎన్ని శాసనాలని చెయ్యగలర్లే అన్న ఆలోచనకి రచయిత తన మదిలో చోటివ్వకపోవడం అత్యంత ఆశ్చర్యకరం. కాకపోతే, భారతదేశంలో ఏ చట్టానికీ విలువలేదన్నది రచయిత అభిప్రాయమని అనుకోవల్సి వస్తుంది. ‘‘మన దారి మనం కనుక్కోవాలి’’ అంటూనే, ‘‘మళ్లీ పడిపోతామని భయ్యం. పాత చీకటి శక్తులు పడదోస్తాయని భయం’’ అంటారు వ్యాస రచయిత. దానికి తనదైన అనుభవాన్ని పంచుకుంటారు.
 
అది, ఊళ్లో వున్న నాలుగు బ్రాహ్మణ కుటుంబాల్లో అత నికి ప్రేమానుబంధం కలిగిన ఒక కుటుంబంలో కూడా ఆ పండితుడు అతణ్ణి మంచి శూద్రునిగా చూడకుండా ‘‘ఏ తప్పిపోయిన బ్రాహ్మణ పిల్లాడో’’ నని అన్న మాటలు శూలాల్లా గుచ్చుకోవడం. ‘‘వాడి ప్రశ్నకి జవాబు ఆ తరువాత కూడా దొరకలేదు’’ అంటారు. వెంటనే, ‘‘దరిమిలా వాడిలో బ్రహ్మ అన్నా బ్రాహ్మణుడన్నా వ్యతిరేకత మొలకెత్తితే అది వట్టి ద్వేషమని అంటారా?’’ అని ప్రశ్నిస్తారు. ‘‘అనలేము’’ అని మిగతా వ్యాసంలో అంటారు గానీ, దానికి కావ లసిన నిరూపణ మాత్రం అక్కడ కనిపించలేదు. పైగా, బ్రాహ్మణ ద్వేషమే గాక హిందూమత ద్వేషం కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఇంజనీరింగ్‌ చది విన తన కొడుకు అమెరికా వెడుతున్నాడు అని మా అమ్మగారు ఒక బంధువుకు చెబితే, ‘‘పూజలు చేయించడానికా?’’ (మాది పూజారుల కుటుంబం కాకపోయినా) అని ఆయన చేసిన అవహేళనకి గురయిన వ్యక్తిగా ఆ ములుకుల పదునుని అర్థం చేసుకోగలను. అలాగని ఆయన కుటుంబం మొత్తం మీద ద్వేషాన్ని పెంచుకోలేను.
రచనలో కనిపించినదంతా ఆందోళన Paranoia. అది మహర్షుల కాలంతో మొదలు పెట్టింది. అయితే, హెచ్చార్కె గారు గానీ ఈ వ్యాసాన్ని చదివినవాళ్లు గానీ ఆ కాలంలో జీవించి లేరు. అమెరికాలో వున్న హెచ్చార్కె గారు ఆ కాలానికీ ఇప్పటికీ - అంతెందుకూ, వారి చిన్నతనం కాలం నుంచీ ఇప్పటిదాకా భారతదేశంలో వచ్చిన మార్పులని ఒప్పుకోరెందుకు? నలభయ్యేళ్ల క్రితం రిజర్వేషన్లు 20 శాతం మాత్రం వుండేవి. ఇప్పుడవి 80 శాతాన్ని చేరాయి. అంటే, మిగిలిన ఇరవై శాతం అన్ని అగ్రవర్ణాలూ కలిసి పంచుకోవాలి! పాత శక్తులు పాముల్లా పడగలెత్తగలిగిన పరిస్థితా ఇది?
ఎవరికి కావలసిన వాళ్లని వాళ్లు దేవుళ్లుగా భావించి కొలిచే అలవాటు ప్రపంచమంతా వుంది. తమ దేవుడు మాత్రమే గొప్ప అని అనడం కూడా. ప్రతి మతంలోనూ దుష్టశక్తులకు దూరంగా వుండా లని గూర్చి కూడా చెప్పారు. ఆ కొలిచేవాళ్లు ఇప్పుడు మహిషాసురుడు దేవుడు అని కొలవడం మొదలు పెట్టడం వేరు, ఎన్నో శతాబ్దాల బాటు వాడు రాక్ష సుడు అని మనుతున్న సమాజంలో వాణ్ణి దేవుడిగా కొలుస్తున్నాం అని చెప్పడంతో మాత్రం ఆగకుండా ఎదుటివాళ్ల కంట్లో వేలుపెట్టి పొడుస్తున్నట్లుగా దుర్గాదేవిని వేశ్య అని అనడం వేరు.
 
మా దుర్గా దేవిని అలా కించపరచడం ‘‘డిప్రెవిటీ’’ అనడం అని ఎవరయినా అనగలిగితే అది వాక్స్వాతంత్య్రం. దాన్ని హేళన చెయ్యవలసిన అవసరమేమిటి? హెచ్చార్కె గారూ! హైదరాబాద్‌లో పాత బస్తీకెళ్లి సైతాన్ని, అలాగే ఒక చర్చ్‌కి వెళ్లి లూసిఫర్ని దేవునిగా కొలు స్తాను అని చాటి చెప్పడానికి మీ వాక్స్వాతంత్ర్యాన్ని నిర్భయంగా ఉపయోగించుకోండి. ఇంకొక అడుగు ముందుకేసి- ఎలాగో అమెరికాలో వున్నారు కాబట్టి- న్యూయార్క్‌ సిటీలోకి వెళ్ళి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ దగ్గర నిలబడి కానీ, లేకపోతే, వాషింగ్టన డీసీలో పెంటగాన దగ్గర కానీ నిలబడి, ‘‘ఒసామా బిన లాడెన దేవుడు, 9/11తో మీకు బాగా బుద్ధి చెప్పాడు,’’ అని ఎలుగెత్తి చెప్పండి. ఫ్రీడం ఆఫ్‌ స్పీచ క్రింద మిమ్మల్ని డిఫెండ్‌ చెయ్యడానికి లాయ ర్లు, సివిల్‌ రైట్స్‌ సంఘాలూ రెడీగా వున్నా కూడా మీకీ దేశంలో రక్షణ దొరకుతుందో లేదో తెలుస్తుంది.
.
హైస్కూల్లో మాకు సోషల్‌ స్టడీస్‌ బోధించిన పంతులుగారు ‘‘యువర్‌ ఫ్రీడం ఎండ్స్‌ వేర్‌ మై నోస్‌ బిగిన్స!’’ అనిచెప్పేవారు. మీ వ్యాసాన్ని చదివిన పాఠకులకి, ఇంకొకళ్ల దేవుళ్లని కించపరచడం, వాళ్లని ఆరాధించేవాళ్ల కంట్లో వేలుపెట్టి పొడవడం కూడా చేస్తున్న వాళ్లకి వున్న విలువలేమిటి, తోటి మను షులని కావాలని ఎందుకింత అగౌరవ పరుసు ్తన్నారు అన్న ప్రశ్నలు మదిలోకి చొరబడకపోతే ఆశ్చర్యపోవాలి.
చట్టంలోనే గోవుకు రక్షణ కల్పించారని ఎద్దేవా చెయ్యడం కాదు దాని గూర్చి కన్సర్న్‌ వున్న వాళ్లు చెయ్యవలసింది. మొదటగా చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గోవుకి కల్పించిన రక్షణ రాజ్యాంగంలో దశాబ్దాల క్రితమే పొందుపరచి వున్నది. అలాగే చట్టంలో తమకి నచ్చని అంశాలని మార్చడానికి కూడా రాజ్యాంగం వీలుని కల్పించింది. ఎన్నుకున్న ప్రతినిధుల చేత ఆ మార్పు చేయించాలి తప్పితే చట్టాలు నినాదాలతో మారేవి కావు. ఇంత పెద్ద వ్యాసాన్ని రాసిన రచయితకి రాజ్యాంగం గూర్చి ఈ మాత్రం కూడా తెలియదు అని అనుకోవడానికి మనస్కరించడం లేదెందుకని? లేకపోతే, రాజ్యాంగం గూర్చి ఏమాత్రమూ తెలియకుండానే ఇంత విశ దంగా రాసిన వ్యాసకర్త అట్టర్‌ ప్లాప్‌ అయిన భారత దేశపు విద్యావిధానాలకి పోస్టర్‌ చైల్డ్‌ అని విచార పడవలసి వస్తుంది - బహుశా అందుకని అయివుంటుంది.
రచయిత అమెరికాలో వుండి ఈ వ్యాసాన్ని రాశారు కాబట్టి వారికి మూడు ప్రశ్నలు : (1) నా పేరులో నా వర్ణం వుంది. అందుకని హెచ్చార్కెగారు నన్ను చూడకుండానే, నాతో మాట్లాడకుండానే, నా అభిప్రాయాలేవో తెలుసుకోకుండానే నన్ను ద్వేషించ డం ఎంత సమంజసం? (2) అమెరికాలో వుంటున్న తన కొడుకులకో, కూతుళ్లకో, మనవళ్లకో, లేక మనవ రాళ్లకో ఈ బ్రాహ్మణ ద్వేషాన్ని నేర్పుతున్నారా? (3) హిందూమత సారమయిన ‘‘అహం బ్రహ్మాస్మి’’ని నేను నమ్ముతాను. అలాంటి సారమే ‘‘తత్త్వమసి’’ - తత త్వం అసి - ‘‘అది (ఆ బ్రహ్మమే) నీవు అయివున్నావు’’ అని మీతో అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా వున్నారా?
తాడికొండ కె. శివకుమార శర్మ