Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 29 2016 @ 03:24AM

కష్టపడేవారికే దేవుడి సాయం: చిన జీయర్‌ స్వామి

  • గుడికెళ్లి మొక్కితే పరీక్ష పాస్‌ కాలేం
  • రూ.వెయ్యి కోట్ల ‘మైహోమ్‌ అవతార్‌’ ప్రాజెక్టుకు శ్రీకారం 
నార్సింగ్‌/హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పరీక్షలు రాగానే గుడికెళ్లి మొక్కితే పాస్‌ కాలేమని, పూజలు చేస్తే ప్రమోషన్లు రావని.. కష్టపడి చదివేవాళ్లకు, పనిచేసే వారికే దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడని ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. అలాంటి వారికే దేవుడు సాయం చేస్తాడని ఆయన వివరించారు. ఆదివారం ఇక్కడ.. రాజేంద్రనగర్‌ మండలం పుప్పాల్‌గూడ ఔటర్‌ రింగురోడ్డు పక్కన మైహోం కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ‘మైహోం అవతార్‌’ పేరుతో రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన నూతన ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్టును చినజీయర్‌ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి మనకు క్రమశిక్షణ నేర్పిస్తుందని, అది ఉన్నవారు దేవుడిని, పెద్దలను గౌరవిస్తారని అలాంటి వారు అన్ని రంగాల్లో రాణిస్తారని వివరించారు. మైహోం వారి వ్యాపారం ధర్మబద్ధంగా ఉంటుందని కొనియాడారు. ఇక.. తాము చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్లో కస్టమర్ల విశ్వాసం చూరగొని వారికి సంతోషకరమైన ఇళ్లను ఇచ్చామని మైహోం కంపెనీ చైర్మన్‌ రామేశ్వర్‌రావు అన్నారు. మైహోమ్‌ అవతార్‌లో.. పది టవర్లు జి+30 అంతస్తులుగా నిర్మిస్తున్నామని వెల్లడించారు. మొత్తం స్థలంలో 16 శాతం నిర్మాణాలు వస్తాయని.. 84 శాతం ఓపెన్‌ ఏరియాగా ఉంటుందని, అన్ని సౌకర్యాలూ ఇందులో ఉంటాయని వివరించారు. 23 ఏకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందని.. అపార్ట్‌మెంట్‌ కనీస ధర రూ.60 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ఈడీ జె.శ్యామ్‌రావు చెప్పారు. ఇక.. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ‘మైహోం విహంగ’ ఈ ఏడాదిలో పూర్తవుతుందని ఆయన వివరించారు. అందులో ఇప్పటివరకూ 60 లక్షల చదరపుటడుగుల నిర్మాణం పూర్తయిందని.. మిగతా 40 లక్షల చదరపుటడుగుల పని జరుగుతోందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌, కంపెనీ ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.