Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 23 2015 @ 04:10AM

ఆసీస్‌తో కంగారే..

ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని మెగా టోర్నీ ప్రారంభానికి రెండు నెలల ముందే ఆస్ర్టేలియా గడ్డపై అడుగిడింది టీమిండియా..! యువరక్తంతో తొణికిసలాడుతున్న ధోనీసేన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో బొక్కబోర్లాపడింది..! ఒకరిద్దరి వ్యక్తిగత ప్రదర్శనలు మినహా జట్టంతా సమష్టిగా విఫలమైంది..! ఆపై అచ్చొచ్చిన వన్డేల్లోనూ ఉసూరుమనిపించింది..! దీంతో మనోళ్లు ప్రపంచకప్‌లోనూ తెల్లమొఖం వేస్తారని అందరూ విమర్శించారు..! కానీ, అందరి అంచనాలూ తారుమారయ్యాయి...! ధోనీసేన బ్యాటింగ్‌లో అదరగొట్టి.. బౌలింగ్‌తోనూ ప్రత్యర్థులను పడగొట్టింది..! ఫలితం ఏడు విజయాలతో జైత్రయాత్ర చేసి దర్జాగా సెమీఫైనల్‌ బెర్తు దక్కించుకుంది. తడబడిన చోటే నిలబడిన టీమిండియా సెమీస్‌లో ఆస్ర్టేలియాకు సవాల్‌ విసరనుంది..! సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా గురువారం జరిగే సెమీస్‌లో కంగారూలను పడగొట్టి తుదిపోరుకు వెళ్లాలని ధోనీసేన భావిస్తోంది..! కానీ, గత రికార్డులు.. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఆసీస్‌ గండాన్ని దాటడం భారత్‌కు అంత ఈజీ కాదనిపిస్తోంది. ఎందుకంటే రెండు జట్లు అన్ని విభాగాల్లో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గొలుపోటముల చాన్స్‌లు ఇరు జట్లకూ సమానంగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే సొంతగడ్డపై ఆడడం ఆసీస్‌కు ప్లస్‌ పాయింట్‌. గత రికార్డులు కూడా కంగారూలకే అనుకూలంగా ఉన్నాయి. మరి భారత్‌, ఆసీస్‌ బలాబలాలు... రెండు జట్ల రికార్డులపై ఓ లుక్కేద్దామా...!
రికార్డులు ఆసీస్‌ వైపే: ఇప్పటిదాకా భారత్‌, ఆస్ర్టేలియా 113 వన్డేల్లో తలపడ్డాయి. వాటిలో ఆసీస్‌ 66, భారత్‌ 38 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. 9 వన్డేల్లో ఫలితం రాలేదు. వాటిలో ఆసీస్‌ గడ్డపై ఇరు జట్లు 40 వన్డేల్లో తలపడగా ఆసే్ట్రలియా 29, భారత్‌ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక భారత్‌లో ఆడిన 49 వన్డేల్లో ఆసీస్‌ 25, టీమిండియా 19 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. ఐదు వన్డేల్లో ఫలితం తేలలేదు. తటస్థ వేదికల్లో ఇరు జట్లు 24 సార్లు తలపడ్డాయి. వాటిలో ఆసే్ట్రలియా 12 మ్యాచ్‌ల్లో నెగ్గగా, భారత్‌ తొమ్మిది వన్డేల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
సెమీస్‌లో తొలిసారి...: ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌, ఆసే్ట్రలియా సెమీఫైనల్లో పోటీపడడం ఇదే తొలిసారి. ఇది వరకు లీగ్‌, సూపర్‌ సిక్స్‌, క్వార్టర్స్‌తో పాటు ఫైనల్లోనూ ఈ రెండు జట్లు ఢీకొన్నాయి.
రు జట్లు వరల్డ్‌కప్‌ల్లో పది మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ల్లో ఆసీస్‌ 7-3తో భారత్‌పై ఆధిక్యంతో ఉంది.
ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఆసే్ట్రలియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 1999లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ను టై చేసుకున్న కంగారూలు ఐదు (1975, 1987, 1996, 2003, 2007) సార్లు నెగ్గారు.
టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ నెగ్గగా, ఆసీస్‌ ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. ఒక మ్యాచ్‌ రద్దయింది.
ప్రపంచకప్‌లో ఆస్ర్టేలియాపై సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడు అజయ్‌ జడేజా. భారత్‌పై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రెండు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
త ప్రపంచకప్‌లో భారత్‌-ఆసీస్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఆడి ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎనిమిది మందే. (మైకేల్‌ క్లార్క్‌, షేన్‌ వాట్సన్‌, బ్రాడ్‌ హాడిన్‌, జాన్సన్‌, ధోనీ, కోహ్లీ, అశ్విన్‌, రైనా).
టోర్నీలో సిడ్నీ మైదానంలో ఆడడం భారత్‌కు ఇదే తొలిసారి. ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ర్టేలియా నెగ్గింది.
సెమీస్‌లో నెగ్గితే వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా ధోనీసేన రికార్డులకెక్కుతుంది. ఇది వరకు భారత్‌ 1983, 2003, 2011లో ఫైనల్‌ చేరింది. ఆస్ర్టేలియా ఆరు సార్లు (1975, 87, 96, 99, 2003, 07) తుదిపోరులో పోటీపడింది.
ఒకవేళ ఈ సెమీస్‌ రద్దయితే మాత్రం గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌ నేరుగా ఫైనల్‌గా చేరుకుంటుంది. గ్రూప్‌-ఎలో ఆసీస్‌ రెండో స్థానంలో నిలిచింది.
క్లార్క్‌సేన ఓటు ఫాస్ట్‌ పిచ్‌కే..!
సిడ్నీ: ఆస్ర్టేలియా, భారత్‌ మధ్య జరిగే సెమీస్‌కు మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయముంది. అయితే ఇరుజట్ల ఆటగాళ్లు నుంచి అభిమానుల వరకు అందరి దృష్టీ సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ) పిచ్‌పైనే ఉంది. ఈ పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తుందా? పేస్‌కు అనుకూలిస్తుందా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎస్‌సీజీ స్పిన్నర్లకు స్వర్గధామం. స్పిన్‌ పిచ్‌ కనుక ఎదురైతే భారత్‌ ఫైనల్‌ చేరడం కష్టమేమీ కాకపోవచ్చు. స్లో, టర్నింగ్‌ వికెట్ల మీద టీమిండియా అమోఘంగా రాణించగలదు. అయితే ఆసీస్‌ మాత్రం ఫాస్ట్‌ పిచ్‌ను కోరుకుంటోంది. ఎందుకంటే మిచెల్‌ జాన్సన్‌, మిచెల్‌ స్టార్క్‌, హాజెల్‌వుడ్‌ వంటి అత్యుత్తమ పేసర్లు ఆ జట్టులో ఉన్నారు. వాళ్లు కోరుకుంటున్నట్టు ఫాస్ట్‌ పిచ్‌ కనుక ఎదురైతే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఆతిథ్య దేశానికి అనుకూలంగానే పిచ్‌ను తయారుచేయాలని ఆసీస్‌ పేసర్‌ హాజెల్‌వుడ్‌ విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే ఎస్‌సీజీ సిబ్బంది, క్యూరేటర్‌ మాత్రం ఈ విషయంపై పెదవి విప్పడం లేదు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)