desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 21 2015 @ 01:34AM

సంక్షోభం చంద్రబాబుకు ఇష్టం!

అందుకే సంక్షోభంలో రాష్ట్ర ప్రజలు
బడ్జెట్లో అన్ని వర్గాలపైనా నిర్లక్ష్యం
2019లో వస్తా.. రాజధాని భూములు తిరిగి ఇస్తా
పార్టీ కార్యాలయంలో జగన్‌ సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం
హైదరాబాద్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంక్షోభం అంటే చాలా ఇష్టం. అందుకే రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. రుణాలు మాఫీ కాక రైతులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు సంక్షోభంలో ఉన్నారు. పింఛన్లు అందక వృద్ధులు, వితంతువులు సంక్షోభంలో ఉన్నారు. ఉపాధి లేక నిరుద్యోగ యువత సంక్షోభానికి గురవుతున్నారు. వెరసి, చంద్రబాబు ప్రభుత్వం 2015-16 వార్షిక బడ్జెట్లో అన్ని వర్గాలనూ నిర్లక్ష్యం చేసింది’’ అని వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. లోట్‌సపాండ్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులనే సభాపతులుగా భావించి దాదాపు రెండు గంటల 28 నిమిషాలపాటు సుదీర్ఘంగా బడ్జెట్‌ ప్రసంగం చేశారు. సహజంగా బడ్జెట్‌లోని అన్ని పద్దులపైనా మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతకు హక్కు ఉంటుందని, కానీ, రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అంశంపై మాట్లాడవద్దంటూ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ‘డిక్టమ్‌’ పాస్‌ చేశారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లోని అంకెలన్నీ బయటకు వస్తే ప్రజల్లో ప్రభుత్వం చులకన అవుతుందని, ఆ భయంతోనే మాట్లాడనీయకుండా తన గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. ‘‘రాష్ట్ర బడ్జెట్‌ అంతా అంకెల గారడీ. రూ.90 వేల కోట్లను దాటదు. అయినా, రూ.1.13 లక్షల కోట్లకు పెంచారు. ప్రణాళికేతర వ్యయం ఎటు చూసినా రూ.80 వేల కోట్లను దాటలేదు. ఇలాంటి గణాంకాలతో ఢిల్లీలో రాష్ట్ర పరువు ఏం కావాలి!? ఇలాంటి తప్పుడు లెక్కలను కేంద్రం గుర్తిస్తే రాష్ట్ర ప్రజల గురించి ఏమనుకుంటుంది!?’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను కేంద్రంపై ఒత్తిడి తెస్తానని, అవసరమైతే చంద్రబాబుతో కలిసి ఢిల్లీకి వెళతానని ప్రతిపాదించారు. రాష్ట్ర రాజధాని కోసం రైతుల నుంచి భూమి లాక్కొంటున్నారని, రైతులకు ఎకరాకు 1000 గజాలు ఇస్తున్నారని, ఇలాగే పరిహారం ఇస్తే టీడీపీ నాయకులు హైదరాబాద్‌, విజయవాడల్లోని తమ భూములను ఇస్తారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో తాను తప్పకుండా అధికారంలోకి వస్తానని, అప్పుడు తప్పకుండా రాజధాని ప్రాంత రైతులకు భూములు తిరిగి ఇస్తానని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఉన్నంతగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశంలో మరెక్కడా లేవని జగన్‌ విమర్శించారు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ అని అన్నారని, కానీ, అవేమీ చేయలేదని జగన్‌ ధ్వజమెత్తారు. కుల రాజకీయాలు చంద్రబాబుకు అలవాటేనని చెప్పారు.
రెండు గంటలు నిల్చున్న ఎమ్మెల్యేలు
దాదాపు రెండు గంటల 28 నిమిషాల రెండు సెకన్లపాటు సుదీర్ఘంగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన జగన్‌.. తన సహచర ఎమ్మెల్యేలకు కనీసం కుర్చీలు వేసి కూర్చోబెట్టకుండా నిలబెట్టారు. కొందరు నీరసమొచ్చి బయటకు వెళ్లిపోయారు.
ఉమా, బుచ్చయ్య అవమానించారు: రోజా
టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఎమ్మెల్యే రోజా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పట్టిసీమపై చర్చ జరుగుతుండగా ఉమ, రుణమాఫీపై చర్చ సందర్భంగా బుచ్చయ్య తనని అవమానిస్తూ, అసభ్యకర పదజాలంతో దూషించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శి కె.సత్యనారాయణ రావుకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. అలాగే, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ దృశ్యాలను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌, టీడీఎల్పీ ఆఫీసులో ఎలా విడుదల చేస్తారని, దీనికి స్పీకర్‌ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. పుటేజీని దొంగిలించిన కాల్వ శ్రీనివాసులుపై కేసు పెట్టాలన్నారు.