Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 19:38PM

చెన్నై: వేలాంగన్ని వద్ద మహిళా న్యాయమూర్తిపై దాడి

చెన్నై, మార్చి 19 : తమిళనాడులో రోజురోజుకు న్యాయమూర్తులపై దాడులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కోర్టులో న్యాయమూర్తిని బంధించి గదికి తలుపు వేయగా.. తాజాగా మరో మహిళా న్యాయమూర్తిపై గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. వివరాలిలా వున్నాయి... నాగపట్నంజిల్లా వేదారణ్యం మేజిస్ర్టేట్‌గా విధులు నిర్వహిస్తున్న లత నాగై న్యాయస్థానంలోని మొదటి, రెండవ మేజిస్ర్టేట్‌ కోర్టుల బాధ్యతలు కూడా అదనంగా నిర్వర్తిస్తున్నారు. ఆమె వేదారణ్యం న్యాయస్థానం ప్రాంగణంలో వున్న క్వార్టర్స్‌లోనే బస చేస్తున్నారు.
 
కాగా బుధవారం సాయంత్రం నాగపట్నం కోర్టులో విధులు ముగించుకున్న న్యాయమూర్తి లత వేలాంగన్ని ఆలయానికి కారులో బయలుదేరారు. మేజిస్ర్టేట్‌తో పాటు ఆమె కారులో సహాయకులు కూడా వున్నారు. కీలయూర్‌ సమీపంలోని ప్రథమపురం అనే ప్రాంతంలో వస్తున్న కారు ప్రయాణిస్తుండగా బైక్‌లపై వచ్చిన నలుగురు గుర్తుతెలియన వ్యక్తులు రాళ్లు రువ్వి వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం కారు డ్రైవర్‌, మహిళా న్యాయమూర్తి, ఆమె సహాయకుడు ధనపాల్‌పై ఆ ముఠా దాడికి పాల్పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడకి చేరుకునేటప్పటికీ ఆ దుండగులు పరారయ్యారు.
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ స్థానికులు వేలాంగన్నిలోని ఆరోగ్యమాత ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న జిల్లా న్యాయమూర్తి శివకుమార్‌ మేజిసే్ట్రట్‌ లతను పరామర్శించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అనంతరం ధ్వంసమైన కారును ఎస్పీ అభినవ్‌కుమార్‌ పరిశీలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. న్యాయమూర్తి కారు డ్రైవర్‌ సతీష్‌కుమార్‌పై పలు కేసులు పెండింగ్‌లో వున్నట్లు తెలిసింది. అతనిపై దాడి చేసేందుకు వచ్చిన వారే న్యాయమూర్తిపై దాడి చేసి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ నాగపట్నం జిల్లా న్యాయవాదుల అధ్యక్షుడు ఉదయకుమార్‌ నేతృత్వంలో 120 మంది న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. అలాగే తిరుత్తురైపూండిలో కూడా న్యాయవాదులు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.