Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 14:54PM

సభా సంప్రదాయాలు తెలుసుకోకుండా విపక్ష సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు : యనమల

హైదరాబాద్‌, మార్చి 19 : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో విపక్ష సభ్యులు సభా సంప్రదాయాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. గురువారం వైసీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్‌ అయిన ఆనంతరం ఆయన మాట్లాడుతూ సభాపతిని నిందించడం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని, తప్పనిసరి పరిస్థితిలో సస్పెండ్‌ చేయవలసి వచ్చిందని ఆయన అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని సభలో హుందాతనంగా మెలగాలని మంత్రి యనమల సూచించారు. సబ్జెట్‌పై మాట్లాడే హక్కు ప్రతిపక్షానికి ఉందని, దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. అయితే వినడానికి విపక్షం సిద్ధంగా లేదని ఆయన అన్నారు. అందుకే ఆ రోజున ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు యనమల చెప్పారు. దేశవ్యాప్తంగా ఎక్కడా లేకపోయినా టీడీపీ హయాంలో నేను స్పీకర్‌గా ఉన్నప్పుడు ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఇప్పుడు కూడా త్వరలో ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సభాపతిని మంత్రి యనమల కోరారు. అసెంబ్లీ నియమ నిబంధనలు పాటించకుండా, ఇష్టాను సారంగా వ్యవహరిస్తే సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని... అందుచేత త్వరగా ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు.