Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 18 2015 @ 20:35PM

సీఎం చంద్రబాబు మమ్మల్ని బెదిరిస్తున్నారు : చెవిరెడ్డి

హైదరాబాద్‌, మార్చి 18 : ప్రతిపక్ష నాయకుడు అనే గౌరవం ఇవ్వకుండా... కనీసం సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అధికారపక్షం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాష్కరరెడ్డి విమర్శించారు. బుధవారం సాయంత్రం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సభలో మమ్మల్ని మాటాడనివ్వకుండా అధికారపక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారపార్టీ సభ్యులు మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కడ వారి అవినీతి బయటపడుతున్న భయంతో పట్టుసీమ ప్రాజెక్టుపై తమను మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సభలో అధికారపార్టీ తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ అంతుచూస్తా మిమ్మల్ని వదలనని భయపెడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని, ఇదేనా మన సంప్రదాయం అని చెవిరెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులను చంద్రబాబే రెచ్చగొడుతున్నారని, బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2-30 గంటల వరకు సభలో జరిగిన వ్యవహారమంతా... రికార్డయిన వీడియో క్లిప్పింగ్‌లను సభాపతి బయటపెట్టాలని, ఎవరు ఏం మాట్లాడారో... ఎవరిది తప్పో తేలుతుందని చెవిరెడ్డి సవాల్‌ చేశారు. అసలు అసెంబ్లీలో జరిగిన సంఘటనలు ఎలా భయటకు వచ్చాయో సభాపతి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సభలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వరా? పాలించే హక్కు మీకుందని, ప్రశ్నించే హక్కు మాకుందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు ఏడు పదాలు అన్‌ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేశారని చెవిరెడ్డి విమర్శించారు. అవి కూడా రికార్డులో ఉంటాయని, స్పీకర్‌ వాటిని రేపు బహిరంగ పరచాలని ఆయన డిమాండ్‌ చేశారు.