Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Nov 22 2014 @ 00:35AM

‘కొత్తగూడెం’లో విద్యుత్‌ ప్రాజెక్ట్‌ వేగంగా ప్రతిపాదనలు

  భూములు గుర్తించిన అధికారులు ఫ సర్కారుకు నివేదిక
కొత్తగూడెం:రాష్ట్రంలో విద్యుత్‌ కొరత నివారణలో జిల్లా కీలకం కానుంది. రానున్న మూడేళ్లలో మరికొన్ని కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలోనూ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో గల కేటీపీఎస్‌ ద్వారా 1700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా చేస్తున్నారు. మరో 800 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కేటీపీఎస్‌లో కార్యాచరణ రూపొందిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. కొత్తగూడెం మండలంలో కూడా మరో విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. రెవెన్యూ అధికారులు భూ సర్వే చేసి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. మండలంలోని పునుకుడుచెలక వద్ద సుమారు ఎనిమిది వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతం విద్యుత్‌ ప్రాజెక్ట్‌కు అనువుగా ఉంటుందా.. లేదా ?అని అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటుగా అనిశెట్టిపల్లి, కూనారం, హేమచంద్రాపురం, కారుకొండ రామవరం ప్రాంతాల్లో సర్వే నెం. 1 నుంచి 144 వరకు, సర్వే నెం. 455 నుంచి 500 వరకు 13/2 సర్వేలో సుమారు 2,721 ఎకరాలకు చెందిన ప్రభుత్వ భూమితోపాటు అంబసత్ర భూములు కూడా ఉన్నాయి. మొత్తం ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 4,914ఎకరాలు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటిని కూడా పరిశీలన నిమిత్తం ప్రభుత్వానికి పంపారు. సుమారు 2,400మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను మూడు యూనిట్లుగా నెలకొల్పేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్ని ప్రతిపాదనలు పూర్తి అయిన అనంతరం ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.