Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 20:26PM

లోకేష్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడంపై తమ్ముళ్ల రియాక్షన్ ఏంటి ?

టీడీపీ తెలంగాణ శాఖ వ్యవహారాల పై నారా లోకేష్ సమీక్షలు నిర్వహించడాన్ని ఆ పార్టీ నేతలు ఎలా భావిస్తున్నారు? లోకేష్ రాక పై వారు సంతృప్తిగానే ఉన్నారా? యువ నేత అందుబాటులో ఉంటే తమకి మేలు జరుగుతుందని వారు ఆశిస్తున్నారా? ఇంతకీ వారు కోరుకుంటోన్న మేలు ఏమిటి? విజయవాడకు చంద్రబాబు తరలివెళ్లాక టీ టీడీపీలో నైరాశ్యానికి కారణం ఏమిటి ?
తెలంగాణ తెలుగుదేశం పార్టీపై నారా లోకేశ్‌ దృష్టి పెట్టారు. ప్రతి శనివారం సమీక్షలు మొదలు పెట్టారు. పార్టీ పరుగులు పెట్టాలని లక్ష్యం నిర్దేశిస్తున్నారు. అయితే, లోకేశ్‌ రాకను తెలుగుదేశం పార్టీలోని తెలంగాణ నేతలు రెండు కోణాలలో విశ్లేషిస్తున్నారు. లోకేశ్‌ రాక పార్టీకి మేలు చేస్తుందని ఒక వర్గం భావిస్తోంది. ఆ వర్గం వాదన ప్రకారం...పార్టీ సంస్థాగత నిర్మాణం పై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. ఆయన రాక సాధ్యం కాదు కనుక కనీసం లోకేశ్‌ రావడం కొంతైనా మేలు చేస్తుందంటున్నారు. గత ఏడాది కాలంగా సంస్థాగత విషయాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఒకటి, అర మినహాయిస్తే మెజారిటీ పార్టీ కమిటీలు, పదవులు భర్తీ కాలేదు. వాటి పై రమణ, రేవంత్ దృష్టి పెట్టినా ఓ కొలిక్కి రాలేదు. తమ ప్రమేయం లేకుండా కమిటీలు, పదవులు భర్తీ చేయడం పై కొందరు నేతలు సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఆ ఇద్దరు కూడా వారిని కాదని అడుగు వేయలేని పరిస్థితి.
 
చంద్రబాబు దగ్గరకు వెళ్లిన ప్రతిసారి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పడం... ఆ నిర్ణయం తీసుకోవడానికి పార్టీలో నేతలందరి మధ్య సమన్వయం లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో చేసేది లేక మిన్నకుండి పోవడం తెలంగాణ నాయకత్వం వంతైంది. లోకేశ్‌ రాకతో ఈ పరిస్థితిని అధిగమించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లు, జిల్లా ఇన్ ఛార్జ్ లు, కొత్త జిల్లాలకు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం పై తొలి సమీక్షలోనే దాదాపు కసరత్తు పూర్తయింది. లోకేశ్‌ స్వయంగా రంగంలోకి దిగడంతో ఎవరూ అడ్డుపుల్ల వేయడం, వేలు పెట్టి అభ్యంతర పెట్టడం లాంటి పరిస్థితి లేదు. దీంతో సంస్థాగత వ్యవహారాలు త్వరలో ఓ కొలిక్కి వస్తాయన్న ఆశాభావం కనిపిస్తోంది. రమణ, రేవంత్ సైతం ఈ పరిణామం పై సంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.
ప్రతి శనివారం సమీక్ష ఉంటుంది కనుక... ప్రతిపాదనలు...వాటి పై నిర్ణయాలు ఇక చకచకా జరిగిపోతాయని వారు భావిస్తున్నారు. ఇక లోకేశ్‌ రాకను మరో కోణంలో విశ్లేషించే నేతలు ఉన్నారు. వారు కూడా ఈ పరిణామం పట్ల సంతృప్తి గానే ఉన్నారు. 12 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తమకు కొన్ని అవసరాలు ఉంటాయని... గత ఏడాది కాలంగా వాటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందిపడ్డామని వారు చెబుతున్నారు. కొన్ని ఆర్థిక పరమైన వ్యవహారాలలో సైతం అధిష్టానం అందుబాటులో లేక ఇబ్బందిపడ్డామని వాపోతున్నారు. ఆర్థికంగా తమను కొంత ఆదుకుంటే నియోజకవర్గాలలో పార్టీని పరుగులు పెట్టిస్తామని... తమలాంటి వారిని అధిష్టానం గుర్తించి ఆదుకోవాలని జిల్లా స్థాయి నేతలు పలువురు కోరుకుంటున్నారు.
 
ఇక రాజకీయ పదవుల విషయంలో సైతం చాలా మంది నేతలు చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఏదైనా నామినేటెడ్ పోస్టు అవకాశం ఉంటుందా? ఢిల్లీలో ఏవైనా పదవులు వచ్చే అవకాశం ఉందా? అసలు అవి వస్తాయా... రావా? లాంటి సందేహాలలో కొందరు నేతలు ఉన్నారు. పదవులు వచ్చినా రాకున్నా అసలు తమ గోడు చెప్పుకోవడానికి అధిష్టానం తరఫున ఒకరు ఉండాలని ఇన్నాళ్లు వారు కోరుకున్నారు. ఇక పై లోకేశ్‌ అందుబాటులో ఉంటారు కనుక... ఆర్జీలైతే పెడతాం... అదృష్టం ఉంటే అవకాశం దక్కుతుంది... లేదంటే అధిష్టానం దృష్టిలో తమ ప్రతిపాదన పెట్టామన్న సంతృప్తైనా మిగులుతుందని ఈ వర్గం భావిస్తోంది.