Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 07:56AM

తండ్రి స్ఫూర్తితో పేద విద్యార్థుల కోసం...

  • తండ్రే స్ఫూర్తిగా సేవ, సంస్కారం
  • నిరుపేద కుటుంబంలో జన్మించి..
  • ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం
  • కిరోసిన దీపం వెలుగులో చదివి..
  • ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి.
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. కేవలం తండ్రి కష్టంతో ఎనిమిది మంది కుటుంబ సభ్యుల జీవనం.. అలాంటి కుటుంబంలో చివరి బిడ్డగా జన్మించి, బిడ్డలను ప్రయోజకులను చేసేందుకు నాన్న పడ్డ కష్టాన్ని కళ్లారా చూశారాయన. ఆయన ఆశయాలు నెరవేర్చాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. చదువులో రాజీపడలేదు. విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగించారు. కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకున్నారు. నాన్న ఆశయాన్ని నెరవేర్చారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. కట్నకానుకలు ఆశించకుండా వివాహం చేసుకున్నారు. అధికార హోదా ఉన్నా తన ఇద్దరు పిల్లలను సామాన్య కుటుంబీకుల మాదిరే పెంచుతూ ఎలాంటి ఆర్భాటాలకు తావులేకుండా జాగ్రత్త పడుతున్నారు. తండ్రి స్ఫూర్తితో పేద విద్యార్థుల కోసం విద్యా సంబంధిత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇదంతా... తన ఉన్నతికి కారణమైన నాన్నకు ప్రేమతో.. అంటున్నారు జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ తానికొండ శ్రీనివాసరావు. ఆయనే ఈ వారం మన సెలబ్రిటీ. ఆంధ్రజ్యోతితో పంచుకున్న ఆయన జీవనయాన విశేషాలు ఆయన మాటల్లోనే...

‘‘మాది ప్రకాశం జిల్లా ఇంకొల్లు. నాన్న పేరు జగన్నాథం, అమ్మ రోశమ్మ. వారికి ఆరుగురు సంతానం. నలుగురు అన్నదమ్ముళ్లు, ఇద్దరు సోదరీమణులు. అందరికన్నా చిన్నవాడిని నేను. మాకు ఒకట్నిర ఎకరం పొలం ఉండేది. నాన్న దేవుడు మాన్యాలను కూడా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని చదివించారు. పుస్తకాలు కొనుక్కునేందుకు కూడా కష్టపడిన రోజులు. నాన్న గంజి అన్నం తిని డబ్బులు మిగిల్చి మా చదువులకు ఖర్చు పెట్టారు. భవిష్యత్తులో పిల్లలు తనలా కష్టపడకూడదని ఉన్నత చదువులు చదివి, ప్రయోజకులై పది మందికి సహాయపడాలని ఆయన ఆశ. నాన్న పెద్దగా చదువుకోకపోయినా మా కుటుంబంలో అందరినీ చదివించారు. అలాంటి నాన్న కడుపున పుట్టడం నా అదృష్టం. ఆయన పెద్దగా చదువుకోకపోయినా సాహి త్యం పట్ల మంచి మమకారం ఉండేది.
 
చదువు అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే.
ప్రైవేట్‌ పాఠశాలలో చదువుకునేందుకు ఆర్థిక స్థోమత లేక నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. పదో తరగతి వరకు కిరోసిన్‌ దీపం కింద చదువుకునున్నాను. ఇంటర్మీడియట్‌ వరకు ఇంకొల్లులోనే చది వాను. డిగ్రీ కర్నూలులోని సిల్వర్‌జూబ్లీలో. ఆంధ్రా యూనివర్సిటీలో ఇండసీ్ట్రయల్‌ రిలేషన్‌ అండ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. సెలవుల్లో నాన్నకు చేదోడువాదోడుగా పొలానికి వెళ్లి సహాయం చేసేవాడ్ని.
 
ఉద్యోగ ప్రస్థానం
కొద్ది రోజులు యునైటెడ్‌ ఇండియా ఇన్స్యూరెన్స్‌ కంపెనీలో పని చేశాను. సర్వీసు కమిషనర్‌ రాశాక ఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాను. 1996లో ఉద్యోగంలో చేరి కావలి, గూడూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో విధులు నిర్వహించాను. 2005లో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై తెనాలి, కడపలో పనిచేశాను. 2009లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పదోన్నతిపై శ్రీకాకుళం, అనంతపురం, విశాఖపట్నంలో పనిచేశాను. ప్రస్తుతం జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా నెల్లూరులో విధులు నిర్వహిస్తున్నా.
 
నా తండ్రే స్ఫూర్తి
మా నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నాన్న కష్టజీవే కాక నిప్పులాంటి మనిషి. ఎవరి వద్ద పైసా అప్పు తీసుకోరు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. డబ్బులు లేకుంటే పస్తులైనా ఉంటారు. మాది చిన్న పూరిల్లు. అయితే గ్రామంలో నాన్నకు మంచి పేరు ఉంది. గ్రామస్థులందరూ కలిసి చందాలు వేసుకుని ఓ పెద్ద హైస్కూల్‌ నిర్మించారు. ఓ సిమెంటు ఫ్యాక్టరీ యజమాని పాఠశాలకు కావాల్సిన సిమెంటు సరఫరా చేశారు. పాఠశాల నిర్మాణ పనులన్నీ నాన్నే దగ్గరుండి చూసేవారు. మా ఇంటి చుట్టూ తడికలు కట్టి ఉండేవి. కనీసం నాలుగు కట్టల సిమెంటు తెచ్చుకుని చుట్టూ గోడ కట్టుకున్నా అడిగేవారు లేరు. అయితే నాన్న నిజాయితీకి మారుపేరుగా మిగిలారు.
 
ఎంజీ రంగా సహాయంతో..
మా బావ సుందరయ్య ఢిల్లీలో మిలటరీలో పని చేసేవారు. ఆయనను చూసేందుకు మా నాన్న ఢిల్లీ వెళ్లారు. పెద్దల సభలో కూర్చుని ఆరి సంభాషణ వినాలని ఆయన కోరిక. అప్పట్లో పార్లమెంట్‌ సభ్యుడుగా ఉన్న ఎంజీ రంగా ద్వారా అనుమతి పత్రాన్ని బావ ద్వారా సంపాదించుకుని పార్లమెంట్‌ భవనలో కూర్చున్నారు. ఆయన పెద్దగా చదువుకోకపోయినా ఎప్పుడూ మంచి సాహిత్యం చదివేవారు. బలహీన వర్గాల వారు బాగా చదువుకుని పైకి వస్తే తప్ప లేకుంటే ఆర్థికంగా బలపడే అవకాశం లేదని ఆయన బలంగా చెప్పేవారు. పది మందికి సహాయ పడాలని మాకు పదే పదే చెబుతుంటారు. ఈ మేరకు మేము ఇప్పటికీ మా గ్రామంలో మా చేతనైన సహాయం చేస్తుంటాం. నెల్లూరులో డిప్యూటీ కమిషనర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు ముందుగా మదర్‌థెరిస్సా ఆశ్రమానికి వెళ్లి ఆ తరువాత కార్యాలయానికి వెళ్లా.
 
ఆప్యాయతలు, అభిమానాలు దూరం
ఒకప్పుడు పల్లెల్లో ఎంతో ఆప్యాయత, అభిమానంతో ఉండేవారు. కాలక్రమేణ అవి కనుమరుగై పోతున్నాయి. ఒకరిని నిందించడం కాదు. నేటి తరంలో ప్రతి ఒక్కరూ బిజీ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతోంది. ఒకప్పుడు పండగలంటే బంధువులు, స్నేహితులంతా కలిసి చేసుకునేవాళ్లం. ఇప్పుడు అంతా రెడీమేడ్‌ అయింది. దుస్తుల దగ్గర నుంచి తినుబండారాల వరకు రెడీమేడ్‌గా కొనుగోలు చేస్తున్నారు. రక్త సంబంధీకుల్లో, బంధువుల్లో కూడా ఆప్యాయత, అభిమానాలు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు.
 
కట్నం లేకుండా వివాహం
పైసా కట్నం లేకుండా వివాహం చేసుకున్నా. దానికి నాన్న నన్ను అభినందించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఉషారాణి (ఎంఎ్‌ససీ)ని వివాహం చేసుకున్నా. మాకు ఇద్దరు పిల్లలు. రోహిత్‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. జీవిత్‌ పదో తరగతి చదువుతున్నాడు. పది మందికి సహాయపడేలా ఉండాలని మా పిల్లలకు సైతం చెబుతుంటాం. ఉన్నత చదువులు చదువుకుని ఓ అధికారిగా ఉన్నా నా పిల్లలను మాత్రం సామాన్య కుటుంబంలో పెంచినట్లే పెంచుతున్నాను. రెండు నెలలకు ఒక సారి మా గ్రామానికి వెళ్లి తన శక్తికి తగినట్లు ఏదో ఒక సహాయ సహాకారాలు అందిస్తూ ఉంటాను. గ్రామంలో నిరుపేద పిల్లలు చదువుకునేందుకు నా వంతు కృషి చేస్తున్నా.’’
- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)
 
నా తండ్రే స్ఫూర్తి
మా నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నాన్న కష్టజీవే కాక నిప్పులాంటి మనిషి. ఎవరి వద్ద పైసా అప్పు తీసుకోరు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. డబ్బులు లేకుంటే పస్తులైనా ఉంటారు. మాది చిన్న పూరిల్లు. అయితే గ్రామంలో నాన్నకు మంచి పేరు ఉంది. గ్రామస్థులందరూ కలిసి చందాలు వేసుకుని ఓ పెద్ద హైస్కూల్‌ నిర్మించారు. ఓ సిమెంటు ఫ్యాక్టరీ యజమాని పాఠశాలకు కావాల్సిన సిమెంటు సరఫరా చేశారు. పాఠశాల నిర్మాణ పనులన్నీ నాన్నే దగ్గరుండి చూసేవారు. మా ఇంటి చుట్టూ తడికలు కట్టి ఉండేవి. కనీసం నాలుగు కట్టల సిమెంటు తెచ్చుకుని చుట్టూ గోడ కట్టుకున్నా అడిగేవారు లేరు. అయితే నాన్న నిజాయితీకి మారుపేరుగా మిగిలారు.