Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 01:04AM

ఉపాధి హామీ పనులపై ఉపగ్రహ నిఘా

  • ‘ఇస్రో’ సహకారంతో కేంద్రం పర్యవేక్షణ
న్యూఢిల్లీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘ఉపాధి హామీ పనులు అంటే.. ఏదో నాలుగు తట్టల మట్టి ఎత్తిపోయడం.. ఓ రెండు గంటలు టైమ్‌ పాస్‌ చేయడం..’ అన్నది ఇక కుదరదు. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా, పక్కాగా అమలు చేయడానికి అడుగు ముందుకు పడింది. పథకంలో జవాబుదారీ పెంచడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇస్రో సహకారంతో శాటిలైట్‌ ద్వారా ఈ పథకంలో జరుగుతున్న ప్రతి పనిపై నిఘా వేయనుంది. పథకం అమలులో లోపాలు సవరించి, పక్కాగా, పారదర్శకంగా అమలు చేయాలన్న ప్రధాని ఆదేశం మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నిఘాపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ‘ఇస్రో’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు దేశంలోని ప్రతి గ్రామంలో ఉపాధి పనులను జియో ట్యాగింగ్‌ చేస్తారు. దీని వల్ల ఆ పనులకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నేరుగా సమీక్షించే వీలు కలుగుతుంది. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30లక్షల పనులు జరుగుతున్నాయి. వీటినే కాకుండా, పూర్తైన పనులను కూడా జియో ట్యాగింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ రోజ్‌గార్‌ సహాయక్‌ లేదా జూనియర్‌ ఇంజనీర్‌ ఫోటోను ‘భువన్‌’ అనే మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేస్తారు. వీటన్నింటి వల్ల గతంలో మాదిరి నివేదకల అవసరం ఉండదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇప్పటికే 7కోట్ల మంది ఉపాధి హామీ కార్మికుల ఆధార్‌ కార్డులను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేశామని, 95 శాతం కూలీల వేతనాలను బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జే.ఎస్‌.మాథుర్‌ తెలియజేశారు.
 
తెలంగాణలో నెమ్మదిగా ‘ఉపాధి’
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మనరేగా) పనులు నెమ్మదిగా సాగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో వెల్లడైంది. ఏప్రిల్‌ నెల పనులకు సంబంధించి జరిపిన సమీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. కాగా, ఈ ఏడాది (2016-17)కి దాదాపు రూ.3300 కోట్ల విలువ గల పనులపై లేబర్‌ బడ్జెట్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొందింది. 1064 అంగనవాడీ కేంద్రాల భవనాల నిర్మాణ లక్ష్యంలో ఏప్రిల్‌లో కనీసం ఒక్క భవన నిర్మాణం కూడా ప్రారంభించలేదు. ఆ నెలలో రహదారుల వెంట మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టలేదు. 40వేల వర్మీ కంపోస్ట్‌ ట్యాంకుల నిర్మాణ లక్ష్యంలో.. అసలు పనే మొదలుపెట్టలేదని కేంద్ర గ్రామీణాభివృద్శి శాఖ తేల్చింది.