Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 00:56AM

మూడు రోజులు భారీ వర్షాలు

  • విస్తరించిన ఉపరితల ఆవర్తనం
  • నేడు అల్పపీడనంగా మారే చాన్స్‌
  • పలుచోట్ల వర్షం.. ఖమ్మం జిల్లాలో పిడుగుపడి మహిళ మృతి
హైదరాబాద్‌ సిటీ, జూన్ 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆదివారం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా ఓ మోస్తరునుంచి భారీవర్షాలు కురుస్తాయన్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ముఖ్రా(కె) వాగు బ్రిడ్జిపై నుంచి నీరు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. తానూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షానికి 40 ఇళ్లు కూలిపోగా, రహదారులు కొట్టుకుపోయాయి. వర్షపునీరు ఇళ్లల్లోకి చేరడంతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుభీర్‌లో విద్యావనరుల కేంద్రం భవనం వెనుకవైపు గోడ పూర్తిగా కూలింది. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల మార్కెట్‌లో భారీగా వర్షపునీరు రావడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. ఖమ్మంజిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో పిడుగుపడి పత్తిచేలో పనిచేస్తున్న వరలక్ష్మి మృతిచెందింది. భద్రాచలంలో కొన్నిచోట్ల చెట్లు విరిగి రహదారిపై పడ్డా యి. ఇక ముంబై నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. సబర్బన్‌ రైళ్లుసహా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. కాగా, వర్షాలు సమృద్ధిగా పడుతుండటంతో దేశవ్యాప్తంగా 27కోట్ల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి రావచ్చునని భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌ టి.మహాపాత్ర శనివారం హైదరాబాద్‌లో విలేకరు లతో మాట్లాడుతూ చెప్పారు.