desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 00:22AM

శృంగార కావ్యాలు

చంద్రరేఖా విలాపం’ అనే కావ్యాన్ని చదువుదామన్న కుతూహలం చాలామందికి ఉండవచ్చు. కానీ ఇది ఒట్టి బూతుల బుంగ. ధారళమైన కవిత్వమే ఉన్నా అడుగడుగునా అశ్లీలం కూడా ఉంది. కాబట్టి బహిరంగంగా ఈ కావ్యం కొనుక్కోవడానికి లభించదు. గ్రంథాలయాలలో ఉండదు. కూచిమంచి జగ్గకవి దీని రచయిత. పిఠాపురం దగ్గర చంద్రపాలెం ఈ కవి స్వస్థలం. జగ్గకవిగారు గొప్ప ప్రతిభావంతులు. సందేహం లేదు. చంద్రరేఖావిలాపంలో కవితాధార కూడా సొగసుగానే ఉంటుంది. క్లిష్టౌస్వాయం, గొట్టు మాటలు, అర్థంకాని సమాసాలు ఏమీలేవు. అసలు జగ్గకవి ఈ కావ్యాన్ని చంద్రరేఖావిలాసంగా రాద్దామనుకున్నాడుట. అట్లా రాసి ఉంటే ఈ కావ్యం ప్రాణంలేని మరొక తెలుగు ప్రబంధం అయి ఉండేది. బూతులున్నా ఈ రచన ఎంతగానో నవ్విస్తుంది. సమాజంలోని లోపాలన్నీ బట్ట బయలు చేస్తుంది. వికటకవిత్వం ఇది. ఒక విధంగా ప్రబంధ సాహిత్య పరిహాస విమర్శ కూడా ఈ కావ్యం నిర్వహిస్తున్నదేమోనని చెప్పాలి.
 
                  అవే విరహాలు, అవే సన్నివేశాలు, అవే వర్ణనలు బూతులతో కూర్చడం బట్టి అనుకరణ పరాయణులైన కవులను వెటకారం చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది ఈ మూడాశ్వాసాల ప్రబంధం చదువుతుంటే. ఈ కావ్యం 265 ఏళ్ళ కిందట రచితమైంది. ఇప్పటివరకూ సురక్షితమైంది అంటే తాటాకులలో కూడా నిలిచి అచ్చుకి కూడా ఎక్కిందంటే దీనికి అభిమానులు ఉన్నారన్న మాటే కదా! చింతలపాటి నీలాద్రిరాజు అనే విజయనగరం రాజబంధువు, కవిగారిని తనను తన వేశ్యనూ నాయికా నాయకులుగా చేసి కవిగారిని ఒక కావ్యం రచించి తనకు అంకితం చేయాల్సిందిగా అర్థించినట్లూ కవిగారా కావ్యం రాసి నీలాద్రిరాజుగారి దగ్గరకు తీసుకొని పోగా ఈ లోపున ఆణిమళ్ళ వెంకట శాస్త్రి  అనే ఒక సంస్కృత విద్వాంసుడు, కవీ అయినవారు నీలాద్రిరాజును తన సంస్కృత అలంకార గ్రంథం అంకితం తీసుకోవటానికి ప్రోత్సహించి జగ్గకవి కావ్యాన్ని నిరాకరింపజేసినట్లూ దానికి జగ్గకవికి చాలా కోపం వచ్చి విలాస కావ్యాన్ని నశింపజేపి విలాప కావ్యరచనకు పూనుకున్నట్లూ ఒక కథ ప్రచారంలో ఉంది. నీలాద్రి రాజు చదువుకోవడానికి ఈ విలాప ప్రబంధాన్ని ఆయనకు జగ్గకవి పంపి కృతకృత్యుడైనట్లు కూడా పరంపరగా జనుల నోళ్ళ ద్వారా ప్రచారమైంది.
 
                  చంద్రరేఖా విలాపం చదివిన వారికి జగ్గకవి గొప్ప పండితుడనీ, అంతకన్నా గొప్ప కవీ అని స్పష్టపడుతుంది తెలుగు కవుల చరిత్రలు రాసిన వారందరూ కూచిమంచి జగ్గకవి ఇతర రచనలైన సుభద్రా పరిణయం, జానకీ పరిణయం, నర్మదా పరిణయం, ఇంకా ఇతర శతకాల గూర్చి వాటి కవితా స్వారస్యాన్ని గూర్చి చెపుతారే కాని చంద్రరేఖావిలాపాన్ని సమీక్షించే అవకాశం లేదు కదా! ఎందుకంటే పచ్చి బూతు పద్యాలు ఉదాహరించాలి. అది ఔచిత్యం కాదు. మర్యాదకాదు. అందువల్ల రహస్యంగా దీన్ని సంపాదించాలి. చదవాలి. ఇందులో మొత్తం 418 గద్య పద్యాలున్నాయి.
 
                  ఆశ్వాసాంత పద్యాలలో విశేష వృత్తాలైన భుజంగప్రయాతం, మాలిని, ప్రగ్విణీ వంటి ఛందాలు కూడా కవి ఉపయోగించారు. అయితే ఈ కావ్యంలో బూతు స్పర్శ సోకని కొన్ని మంచి పద్యాలు కూడా ఉన్నాయి. అవి ఎంతో బాగున్నాయి, కథానాయకుడైన నీలాద్రిరాజుకు, ఆయన ఆశ్రితుడైన ప్రయాగ బాపన్న అనే విప్రుడు వేశ్యాగమనం అపకీర్తికరం అని హితవు బోధించగా, ఇంకొక మిత్రుడు, సచివసత్తముడీయన పాదుర్తి భీమన్న గారు బాపన్నగారి నిట్లా ఆక్షేపించారు. ‘వశ్యయయి కులికి పైబడు, వేశ్యారతి సుఖము వేదవేద్యుకేలా!’ వేద పండితులకు శృంగార రాచకార్యాలలో పనేముంది అని బాపన్నగారి మందలింపు అన్న మాట. కూచిమంచి జగ్గకవిపై కందపద్యపు రెండు పాదాల ద్వారా అల్లసాని పెద్దన్న గారి వరూధినీ ప్రవరాఖ్యుల శృంగార ఘట్టాన్ని ప్రస్తావిస్తున్నారేమోననిపిస్తుంది. ఆనాటి సమాజంలోని దుర్లక్షణాలనెన్నిటినో జగ్గకవి తీవ్రంగా దుయ్య బట్టారు. తన యీ చంద్రరేఖా విలాపం హాస్య ప్రబంధం అని చెప్పుకున్నరాయన. తనకు నచ్చిన కవులు వేములవాడ భీమకవి, తెనాలి రామలింగడు, శ్రీనాథుడు, తురగా రామకవి అని ఆయన సుకవి స్తుతిలో చెప్పుకున్నారు. పదే పదే ఈ రచనను హాస్య ప్రబంధంగానే జగ్గకవి ప్రసక్తంచేశారు.
 
                  చంద్రరేఖా విలాపంలో ఉన్నబూతు శృంగారం కన్నకూడా ముదురుపాకంలో పడిన శృంగార వర్ణనలు తెలుగు కవులు చేశారు. కాని ఆ వర్ణనలకు సంస్కృత పదాల పంచదారపూత పూశారు. అందుకని మర్యాదస్తులకవి చేదు, వెగటనిపించలేదు. మరి చంద్రరేఖావిలాపంలో అచ్చ తెలుగు మాటలున్నాయి కదా! ఎట్లా భరించ గలం అని అనుకుంటారేమో నాగరకులు. విజయనగర సంస్థానాధిపతి, విద్యలను, కళలను గొప్పగా ఆదరించిన నిన్నమొన్నటి ఆనందగజపతి ఆస్థానంలో నవరత్నాలని తొమ్మిది మంది గొప్ప కవులు, పండితులు, శాస్త్రవేత్తలు, సంగీతవిద్వాంసులు ఉండేవారు. అందులో ముదుంబ నరసింహాచార్లు వారొకరు. ఈయనకు భగవత్కవి అని బిరుదు. ఆనందగజపతికి వీరు ఆచార్య స్వాములు. ఈయనకు మహాపండితుడని ఖ్యాతి. అయితేనేం ఆనందగజపతి ఉల్లాసం కోసమో, ఉత్సాహంకోసమో, మెప్పు కోసమో భగవత్కవి గారు ప్రౌఢ శృంగారం పేరుతో చిన్న ఖండకావ్యం రచించారు. ఎటువంటి సంకోచం, సంయమనం లేకుండా పడకగది శృంగార మంతా స్వాముల వారిందులో ప్రౌఢాతి ప్రౌఢంగా వర్ణించారు. కాకపోతే పరిభాష మాత్రం సంస్కృతం. ఇదే విధంగా వెంకటగిరి రాజాస్థాన కవీశ్వరుడైన గోపీనాథం వెంకయ్య శాస్త్రి గారు తమ ప్రభువు వారి ఉల్లాసం కోసం ‘బ్రహ్మానంద శతకం’ రచించారు. గోపీనాథం వెంకటకవిగారు వాల్మీకి రామాయణాన్ని చక్కగా తెలుగుజేసిన మహాకవి. మాఘకవి శిశుపాల వధ కావ్యాన్ని అనువదించిన వారు. అయినా బ్రహ్మానందాన్ని కూడా రచించారు. సంస్థానాధిపతులను సంతోషపెట్టడం సామాన్యమా మరి! కూచిమంచి జగ్గకవి తన కృతిపతిని సంతోష పెట్ట లేదు. ఏడ్పించాడు. అదీ భేదం.
  అక్కిరాజు రమాపతిరావు 
- 040- 27423352 
(ఈ శీర్షిక ఇంతటితో ముగిసింది)