desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 23:56PM

వైసీపీ ఆటవిడుపు... ఎమ్మెల్యేల విదేశీబాట

  • ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా.. జూలై 8న ‘గడప గడపకూ’ డౌటే!
  • 7లోగా వచ్చేయాలని పార్టీ ఆదేశం
  • కుదరదంటున్న ఎమ్మెల్యేలు.. తలపట్టుకుంటున్న ముఖ్య నేతలు
హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): యథా రాజా తథా ప్రజా.. అంటారు. వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా అచ్చు ఇదే పాటించబోతున్నారు. రాజకీయాల నుంచి ఆటవిడుపు కోసం తమ నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బ్రిటన్‌ పర్యటనకు వెళ్లినట్లే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఆటవిడుపు కోసం అమెరికా తరలుతున్నారు. వారమో.. పది రోజులో కాదు.. ఏకంగా నెలపాటు విహార యాత్రకు వెళ్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఎందుకంటారా..! జూలై 8న ‘గడప గడపకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అనే కార్యక్రమాన్ని జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఎరువుల సమస్య, ఉద్యోగుల తరలింపు వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించి ప్రజలకు చేరువ కావాలన్నది ఆయన ఉద్దేశం. వైసీపీ ప్రజాప్రతినిధులు సరిగ్గా జూలై మొదటివారంలోనే విహారయాత్ర తలపెట్టారు. వీరిలో 21 మంది ఎమ్మెల్యేలున్నారు. అమెరికాలో వచ్చే నెలలో జరిగే ఆటా మహాసభలకు వైసీపీ ప్రజాప్రతినిధులకూ ఆహ్వానాలు అందాయి. ఈ మహాసభలకు వెళ్లి పనిలోపనిగా నెల రోజులపాటు అమెరికాను చుట్టేయాలని వీరు ఉబలాటపడుతున్నారు. ఏ పరిస్థితుల్లోనూ 7వ తేదీలోపు వచ్చేయాలని, ప్రజాసమస్యలపై 8న పోరాడాల్సి ఉందని ముఖ్య నేతలు ఒత్తిడి తెస్తున్నారు. తామెప్పుడో ప్లాన్‌ చేసుకున్నామని.. వెంటనే వచ్చేది లేదని వారు తెగేసిచెబుతున్నారు. వారినెలా ఆపాలో తెలీక నేతలు తలలు పట్టుకుంటున్నారు. జగన్‌ ద్వారా చెప్పిద్దామంటే ఆయనేమో కుటుంబ సమేతంగా బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. ‘మేం విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడే ప్రజాసమస్యలు గుర్తుకొస్తాయా? ఇప్పుడు మాత్రం సమస్యలు లేవా? మరి జగన్‌ బ్రిటన్‌ ఎలా వెళ్లారు? ఆయన్నెందుకు ఆపలేదు’ అని ఎమ్మెల్యేలు వారిని నిలదీస్తున్నారు. పైగా పిల్లలతో జగన్‌ ఫుట్‌బాల్‌, చెస్‌ ఆడుకుంటున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజాప్రతినిధులు మరింత బిగుసుకున్నారు. తమకు మాత్రం తమ పిల్లలతో ఆడుకోవాలని ఉండదా అని నిలదీస్తున్నారు.
 
వైసీపీ ఎమ్మెల్యేల ధిక్కార ధోరణికి సరైన కారణమే ఉంది. పాపం.. వారు ఎప్పుడు విహార యాత్రలు తలపెట్టినా జగన్‌ అంగీకరించలేదు. గత నెలలోనే ఆటవిడుపు కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నారు. ఎవరినీ సంప్రదించకుండా జగన్‌ మే 16న కర్నూలులో జలదీక్ష ప్రకటించేశారు. అమెరికా టూరు గురించి కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తే.. ఆయన కస్సుమన్నారు. ఓపక్క రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే సీఎం చంద్రబాబు విదేశీ యాత్రకు వెళ్లడాన్ని జగన్‌ తప్పుబట్టారు. ఇదే విషయాన్ని వారి వద్ద ప్రస్తావించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై తాను దీక్ష చేస్తుంటే ఎమ్మెల్యేలు విహారయాత్రలకు ఎలా వెళ్తారని అడిగేటప్పటికి ఆశాభంగం చెందిన వారు నోరు మెదపలేదు. పోనీ.. జూన్‌ నెలలో వెళ్దామనుకున్నారు. కానీ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం.. 11న ఎన్నికల తేదీ ప్రకటించడంతో.. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకోవడానికి పార్టీ నాయకత్వం వారిని గోవా, కేరళ విహారానికి పంపించింది.
 
నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ముందుగా అనుకున్న ప్రకారం.. శ్రీలంక వెళ్లారు. ఎన్నికలు ఏకగ్రీవమని తెలిసేటప్పటికి అందరినీ తిరిగి రప్పించేశారు. ఇక లాభం లేదనుకుని.. జూలైలో ఎలాగైనా అమెరికా వెళ్లి తీరాలని వారు గట్టిగా నిర్ణయించుకున్నారు. అంతే.. వీసాలు కూడా సిద్ధం చేసేసుకున్నారు. ఇంకోవైపు... గడప గడపకూ వైఎస్సార్‌ కాంగ్రె్‌సను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుంటే.. దానిని ముందుండి నడపాల్సిన ప్రజాప్రతినిధులు విదేశాలకు వెళ్తే ఆ కార్యక్రమానికి ఎవరు హాజరవుతారని ముఖ్య నేతలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధుల ఆటవిడుపు తమ పీకలమీదకు వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. పోనీ కార్యక్రమాన్ని వాయిదా వేద్దామంటే పార్టీ పరువు దెబ్బతింటుందేమోనని కలవరపడుతున్నారు.