Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 23:52PM

8 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతి

  • శ్రీనగర్‌లో సిబ్బంది బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు
  • ఎదురుదాడిలో ఇద్దరు ముష్కరులు హతం
శ్రీనగర్‌, జూన్‌ 25: కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లు వెళుతున్న బస్సుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు మరణించారు. మరో 22 మంది గాయాల పాలయ్యారు. గాయాలైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. భద్రతా సిబ్బంది తేరుకుని ఎదురుదాడి చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఈ దాడిలో మరో ఇద్దరు ఉగ్రవాదులూ పాల్గొని ఉండవచ్చని భద్రతాధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరు కూడా శ్రీనగర్‌కు కారులో పారిపోయారని సమాచారం. కాగా, తొలుత దాడిలో ఐదుగురు జవాన్లే మరణించారని నిర్ధారించినా.. ఎదురుకాల్పుల అనంతరం బస్సులో మరో ముగ్గురు జవాన్ల మృతదేహాలనూ అధికారులు గుర్తించారు. శ్రీనగర్‌లో శిక్షణా కార్యక్రమాన్ని ముగించుకుని జమ్మూకు తిరిగి వస్తుండగా.. శ్రీనగర్‌కు 14 కిలోమీటర్ల దూరంలోగల పాంపోర్‌లోని ఫ్రెస్ట్‌బల్‌ వద్ద ఉగ్రవాదులు దొంగ దెబ్బ కొట్టారు. దాడికి పాల్పడిన ప్రాంతంలో ఓ భారీ మూల మలుపు ఉండడం, అక్కడ వాహనాలు కచ్చితంగా స్లోగా వెళ్లడం వంటి కారణాలతో ఉగ్రవాదులు దాడికి ఆ ప్రాంతాన్నే ఎంచుకుని ఉంటారని అధికారులు అంటున్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నళిన్‌ ప్రభాత చెప్పారు. సంఘటన స్థలాన్ని ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్ర పరిశీలించారు. దాడి ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిగ్ర్భాంతి చెందారు. మరణించిన జవాన్ల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. 3 వారాల్లో బలగాలపై ముష్కరులు దాడులకు తెగబడడం ఇది రెండో సారి. కాగా బారాముల్లాలో జరిగిన ఎనకౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. యూరిసెక్టార్‌లోని లాచిపొరా ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి.