desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 1 2016 @ 01:54AM

రాజ్యసభ అభ్యర్థులు నలుగురూ ఏకగ్రీవం

  • రాజ్యసభ నాలుగో స్థానానికి పోటీ పెట్టని టీడీపీ
  • కోలాహలంగా ప్రభు, సుజనా, టీజీ నామినేషన్లు
  • విజయసాయిరెడ్డితోపాటు భార్య డమ్మీ నామినేషన్‌
  • సీఎం ఒప్పుకోనందుకే నాలుగో అభ్యర్థిపై వెనక్కి
 
హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నాలుగో సీటుకు పోటీ పెట్టే యోచనను టీడీపీ విరమించుకోవడంతో ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. టీడీపీ-బీజేపీ కూటమి తరపున మూడు సీట్లకు ముగ్గురు అభ్యర్ధులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో సీటుకు వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి ఇప్పటికే నామినేషన వేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన సతీమణితో కూడా నామినేషన వేయించారు. అది డమ్మీ నామినేషన మాత్రమేనని, నామినేషన్ల పరిశీలన తర్వాత ఉపసంహరించుకుంటారని వైసీపీ నేతలు ప్రకటించారు. కాగా.. టీడీపీ, బీజేపీ అభ్యర్ధుల నామినేషన కార్యక్రమం అసెంబ్లీలో కోలాహలంగా జరిగింది. బీజేపీ తరపున రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు, తెలుగుదేశం పార్టీ తరపున కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనాచౌదరి), మాజీ మంత్రి టీజీ వెంకటేశ నామినేషన్లు వేశారు.
 
ముగ్గురు అభ్యర్ధుల నామినేషన పత్రాలపై మొదటి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. సురేశ్‌ ప్రభుకు బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల శ్రీనివాస్‌ సంతకాలు చేశారు. సుజనా చౌదరికి మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు; టీజీ వెంకటేశకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి పల్లె రఘునాఽథరెడ్డి, మరి కొందరు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. సరిగ్గా 11 గంటలకు ప్రభు నామినేషన దాఖలు చేయగా... ఆ తర్వాత తమ తమ ముహూర్తాలను బట్టి సుజనాచౌదరి, టీజీ నామినేషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కెఇ కృష్ణమూర్తి, చిన రాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ప్రత్తిపాటి, కామినేని, మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కొల్లు రవీంద్ర, పౌరవిమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, కేశినేని నాని, రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకరరెడ్డి, రెండు రాష్ట్రాల టీడీపీ, బీజేపీ శాఖల అధ్యక్షులు కళా వెంకట్రావు, కంభంపాటి హరిబాబు, ఎల్‌.రమణ, కె.లక్ష్మణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, తెలంగాణ వర్కింగ్‌ అధ్యక్షుడు రేవంత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
నాలుగో అభ్యర్ధికి బాబు ఒప్పుకోలేదు...
నాలుగో అభ్యర్ధిని పోటీ పెట్టాలని తాము ఎంత గట్టిగా కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకోలేదని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, ఆదినారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులకు ఈ విషయం చెప్పారు. ‘నాలుగో అభ్యర్ధిని పెట్టాలని కోరడానికి మేమంతా ఆయన వద్దకు వెళ్లాం. మేం గెలిపించి తీసుకొస్తామని చె ప్పినా ఆయన వినలేదు. అటువంటి గెలుపు అవసరం లేదని, పోటీ అక్కర్లేదని చె ప్పారు. నిర్ణయం మాకు వదిలిపెడుతూనే తనకు మాత్రం పోటీ పెట్టడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఆయన ఇటువంటి వైఖరి తీసుకోవడం మాకు ఆశ్చర్యం కలిగించింది. జగన తన ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి తన ఆడిటర్‌ను ఎంపీగా పెట్టడం ఏమిటి? పార్టీకి, ఆయనకు ఏం సంబంధం? ఇక పార్టీలో పనిచేసే నాయకులు ఏం కావాలి’ అని నాగిరెడ్డి ప్రశ్నించారు. పోటీ పెట్టాలని తాను పదేపదే ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు ఒప్పుకోలేదని, ఆయన ఉదారంగా వదిలిపెట్టడం వల్ల జగన పార్టీకి ఒక సీటు దక్కిందని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

విజయసాయికి జగన్‌ అభినందనలు

నాలుగు స్థానాలకు గాను నలుగురు అభ్యర్థులే నామినేషన్లు వేయడంతో రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల విజయాన్ని రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు. టీడీపీ నాలుగో స్థానానికి పెట్టడం లేదని స్పష్టత ఇచ్చాక సాయిరెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా నిలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. విజయసాయి రాజ్యసభకు వెళ్లడం ఖాయం కావడంతో .. జగన ఆయనను అభినందించారు.