Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 03:26AM

సర్పంచులూ.. చందాలివ్వండి!

  • రాష్ట్ర అవతరణ దినోత్సవాల పేరిట వసూలు
  • రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన వ్యవహారం
ధారూరు: రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు ప్రతి జిల్లాకూ నిధులు కేటాయించినా.. కొందరు అధికారులు మాత్రం ప్రజాప్రతినిధుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ధారూరు మండలంలో ఇది చోటుచేసుకుంది. సంబురాల నిర్వహణ కోసం సర్పంచ్‌లు అందరూ రూ.1000 చొప్పున చందా ఇవ్వాల్సిందిగా మండల పరిషత అధికారులు నిర్ణయించారు. దీనిపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గ్రామపంచాయ తీ పరిధిలో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొనేందుకుగాను 3 వేల చొప్పున పంచాయతీ నిధుల నుంచి వాడుకోవాల్సిందిగా ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసిందని వారు చెబుతున్నారు. కానీ మండల పరిషత్‌ అధికారులు సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.1000 ఇవ్వాల్సిందిగా చెప్పారని సర్పంచ్‌లు వాపోయారు. ఈ డబ్బును గ్రామ కార్యదర్శుల ద్వారా వసూలు చేస్తున్నారని తెలిపారు. రూ.3 వేలు గ్రామపంచాయతీ పరిధిలో ఉత్సవాలకే సరిపోవని, అందులోనుంచే తమను 1000 చందా అడగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో సబితను వివరణ కోరగా.. తాము విరాళాలు అడగలేదన్నారు. వారే ఇస్తామన్నారని, అయినా ఇంతవరకూ ఎవరూ ఇవ్వలేదన్నారు. ధారూరు సొసైటీ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి మాత్రం 10 వేలు విరాళం ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం సంబరాల కోసం సాధారణ నిధుల నుంచి 3 వేలు వాడుకోవాల ని చెప్పిందని, మరి భోజనాలు, బహుమతులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆమె ఎదురు ప్రశ్నించారు.