desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 22:32PM

కార్టూన్‌ మ్యూజియం

కార్టూన్‌.. అనగానే ఓ వ్యంగ్య చిత్రమో, హాస్య చిత్రమో ఊహాల్లోకి వస్తుంది. కితకితలు పెడుతూనే కీలక విషయాలెన్నో చెప్పేలా ఆ చిత్రాలు ఉంటాయి. ఈ కార్టూన్‌ చిత్రాలకు లండన్‌లో ఓ మ్యూజియం ఉంది. అలరించే హాస్య చిత్రాలకు తోడు, ఎన్నెన్నో కామిక్స్‌ పుస్తకాలకు నిలయమైన ఈ మ్యూజియం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

నిన్నటి తరమైన, ఆధునికతను అందిపుచ్చుకున్న నేటి తరమైనా కార్టూన్‌ చిత్రాలను చూడటానికి ఇష్టపడతారు. వాటిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తుంటారు. అంతటితో ఊరుకోకుండా ఆ చిత్రాల స్ఫూర్తితో స్కెచ్‌ చేతపట్టి స్నేహితుల వ్యంగ్య చిత్రాలు గీస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. మరి బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి ఇప్పటివరకు బోలెడు వ్యంగ్య, హాస్య కార్టూన్‌ చిత్రాలు చూడాలంటే లండన్‌లోని ది కార్టూన్‌ మ్యూజియానికి వెళ్లాల్సిందే. 1988 తరానికి చెందిన కొంతమంది కార్టూనిస్టులు, కార్టూన్‌ ప్రియులు కలిసి ‘ది కార్టూన్‌ ఆర్ట్‌ ట్రస్ట్‌’ను ప్రారంభించారు. అపూరూపమైన, అరుదైన, అద్వితీయమైన కార్టూన్‌ చిత్రాలను కలెక్ట్‌ చేయడంతో పాటు వాటిని భద్రపరచడానికి ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అలా వారు కలెక్ట్‌ చేసిన కార్టూన్‌ చిత్రాలతో 2006లో కార్టూన్‌ మ్యూజియాన్ని లండన్‌లో ప్రారంభించారు. బ్రిటీష్‌ కార్టూనిస్టులకు చెందిన కార్టూన్లే ఎక్కువగా ఇందులోఉన్నాయి. ప్రపంచంలోనే మొదటి కార్టూన్‌ మ్యూజియం కూడా ఇదే కావడం విశేషం.
 
నవ్వులే నవ్వులు
ఈ మ్యూజియంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. వీటితో పాటు కార్టూన్‌ బొమ్మలు, కామిక్స్‌, క్యారికేచర్లు, యానిమేషన్‌ కోసం గీసిన బొమ్మలు ఇలా వేటికవే ఆకట్టుకుంటాయి. దినపత్రిక, మ్యాగజైన్‌, వివిధ పుస్తకాల్లోని బోలెడు వ్యంగ్య, హాస్య చిత్రాలను ఇక్కడ చూడవచ్చు. ఎంతోమంది కార్టూనిస్టులు గీసిన 1700 కార్టూన్లు(ఒరిజనల్‌) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
 
ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన కొన్ని వ్యంగ్య చిత్రాలను భారీ పరిమాణంలో తయారుచేసి ఇందులో ప్రదర్శనకు పెట్టారు.
 
గ్రంథాలయం
కామిక్‌, వ్యంగ్య, హాస్య పుస్తకాలతో కూడిన ఓ గ్రంథాలయం మ్యూజియం సొంతం. కార్టూన్ల చరిత్రతో పాటు, కార్టూన్‌ చిత్ర కళలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వాటిని గీసే విధానం, సమాజంపై వాటి ప్రభావం వంటి అంశాలపై ఎన్నో పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. దాదాపు ఆరు వేలకు పైగా పుస్తకాలున్నాయి.
 
క్యాట్‌ అవార్డ్స్‌
ఉత్తమ కార్టూనిస్టుకు ప్రతి సంవత్సరం మ్యూజియం తరుపున క్యాట్‌ అవార్డునిచ్చి సత్కరిస్తారు. జోక్‌, పాకెట్‌, పొలిటికల్‌, క్యారికేచర్‌ కార్టూనిస్‌ విభాగాల వారిగా అవార్డులిస్తారు. కార్టూనిస్టుగా ఎనలేని సేవలు చేసిన ఒకరికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారంతో గౌరవిస్తారు. ప్రతి సంవత్సరం చిన్నారుల కోసం ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహిస్తారు. ప్రముఖ కార్టూని్‌స్టలు కార్టూన్‌ గీయడంలో చిన్నారులకు మెలకువలు నేర్పిస్తారు.

కార్టూన్‌ కాన్వాస్‌
కార్టూన్లు కూడా చిత్రకళలో భాగమే. వీటిని గీసే వారిని కార్టూనిస్టులుగా పిలుస్తుంటారు. వార్తా పత్రిక, టీవీ, చలనచిత్రం, యానిమేషన్‌ రంగాల్లో కార్టూన్లను చూస్తుంటాం. ఈ కార్టూన్లు భలే తమాషాగా ఉంటాయి. కొన్ని రకాల కార్టూన్లు నవ్వు తెప్పించేలా ఉంటాయి. మరికొన్నేమో వ్యంగ్య రూపకంగా ఉంటుంటాయి. ఒకప్పుడు హాస్య కథలను సూచించడానికి వీటిని ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం అనేక రంగాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. కార్టూన్లకు జోడించే చిన్న చిన్న వ్యాఖ్యలు భలేగా ఉంటాయి.