Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 19:40PM

లోకాయుక్త వస్తే తొలుత జైలుకెళ్లేది జయే : ప్రకాశ్ జవదేకర్‌

చెన్నై : రాష్ట్రంలో లోకాయుక్త ఏర్పాటు చేస్తే తొలుతగా జైలుకెళ్లేది అన్నాడీఎంకే అధినేత్రి జయలలితేనని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ అన్నారు. శుక్రవారం చెన్నైలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అన్నాడీఎంకే ప్రభుత్వం 2011లో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలేవీ అమలు చేయలేదని ఆరోపించారు. కుటుంబానికి 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ను సరఫరా చేస్తామన్న హామీని బుట్టదాఖలు చేసి, లీటర్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ను రూ.10లకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. తీవ్రమైన విద్యుత్ కొరత కలిగిన తమిళనాట ఉచితంగా విద్యుత్ను ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చానంటూ గొప్పలు చెప్పుకుంటున్న జయ ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్ల కోసం వేచి ఉన్న 15 లక్షల మంది రైతులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

మోదీ ప్రభుత్వం అమలు చేసిన క్లీన్ ఇండియా పథకాన్ని కాపీగొట్టి పారిశుద్ధ్య గ్రామాలను ఏర్పాటు చేస్తానంటూ అన్నాడీఎంకే మేనిఫెస్టోలో ప్రకటించారని ప్రకాశ్ జవదేకర్‌ అన్నారు. రాష్ట్రంలో 2.50 లక్షల గ్రామాలకు వైఫై, బ్రాండ్‌బ్యాండ్‌ ఇస్తామని కేంద్రం ప్రకటించినా అన్నాడీఎంకే ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా అడ్డుకుందన్నారు. అయితే జయ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత ఇంటర్నెట్‌ ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. విండ్‌మిల్లు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పథకాలపై ఇంకా సంతకాలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో లోకాయుక్తా తీసుకువస్తానంటూ పైపైకి చెబుతున్నా, దానిని నెలకొల్పితే తొలుత జయలలితే జైలుకు వెళ్ళాల్సి ఉంటుందని అన్నారు. ఈ కారణంగా జయ ఎట్టి పరిస్థితుల్లోనూ లోకాయుక్తను ఏర్పాటు చేయరని, అన్నాడీఎంకే ఉచితాల పట్ల జనం మళ్లీ మోసపోయే స్థితిలో లేరని ప్రకాశ్ జవదేవకర్‌ అన్నారు.