desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 09:51AM

హోదా ప్రకటించకపోతే జీవీఎంసీ ఎన్నికల్లో ఒంటరిపోరుకు టీడీపీ సిద్ధం

  • హోదా, రైల్వేజోన్‌ ప్రకటించకపోతే జీవీఎంసీ ఎన్నికల్లో ఒంటరిపోరుకు టీడీపీ సిద్ధం
  • బీజేపీతో జట్టు కడితే నష్టం తప్పదని నేతల ఆందోళన
  • టీడీపీ నేతలే భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారంటున్న కమలనాధులు
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రుల ప్రకటన నేపథ్యంలో మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక మిత్రపక్షమైన బీజేపీతో పొత్తు కొనసాగిస్తుందా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు వంటి డిమాండ్ల సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధానితో చర్చించడం ద్వారా మిత్రధర్మం పాటించాలని బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర సూచించగా, విభజన సమయంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని తాము కోరుతున్నామని, హోదా పదేళ్లు ఇవ్వాలని బీజేపీ డిమాండ్‌ చేసిన విషయాన్ని మరిచిపోయారా? అంటూ టీడీపీ నేత ఎస్‌ఏ రెహమాన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందా? ఎవరిదారివారు చూసుకుంటారా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
 
                 గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నగర పరిధిలోని ఎంపీ సీటుతోపాటు ఉత్తర నియోజకవర్గం సీటును బీజేపీకి కేటాయించగా మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీచేశారు. అన్నింటా టీడీపీ, బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. అనంతరం కేంద్ర కేబినెట్‌లో టీడీపీ చేరగా, రాష్ట్రకేబిపుట్‌లో బీజేపీ చేరింది. రెండేళ్లుగా రెండు పార్టీల మధ్య పరస్పర అవగాహన కొనసాగుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ డిమాండ్‌లు ఊపందుకున్నాయి. వీటిని నెరవేర్చడంతో కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, నిలదీసి అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యంచూస్తోందంటూ వైసీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గ్రేటర్‌కు ఎన్నికలు జరిగితే బీజేపీతో స్నేహం వున్నందున ఆ ప్రభావం తమపార్టీపై పడి, తమ అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు.
 
                దీంతో బీజేపీతో పొత్తు తెంచుకుని ఎన్నికలకు వెళ్లడ మే ఉత్తమమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కొనసాగించినట్టయితే విపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే హోదా ఇచ్చేదిలేదని కేంద్రమంత్రులు స్పష్టంచేస్తుండడం టీడీపీ నేతలకు మరింత ఇబ్బందికరంగా తయారైంది. కేంద్రమంత్రివర్గం నుంచి బయటకు వస్తే కేంద్రంపై ఒత్తిడి పెరిగి హోదా ఇచ్చేందుకు అవకాశం వుంటుందని ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలను పెంచుతున్నాయి. ఇది ప్రజల్లోకి వెళ్లినపుడు టీడీపీ నేతలకు తలనొప్పిగా మారుతోంది.
 
హోదా ప్రకటన చేయకపోతే ఒంటరిపోరే
కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌పై ప్రకటన చేయకపోతే గ్రేటర్‌ ఎన్నికలకు ఒంటరిగానే బరిలోకి దిగాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకైనా సిద్ధపడుతున్నారు. రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే దీనిని ప్రచారాస్త్రంగా చేసుకుని వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళతారని, ఇది వారికి కలిసివస్తోందని భావిస్తున్నారు. విభజన హామీల సాధనకు ఇప్పటికైనా నోరువిప్పకపోతే ప్రజల్లో పార్టీ దెబ్బతింటుందని గుర్తించిన టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే హోదా, రైల్వేజోన్‌ను ప్రకటించాల్సిందేనంటూ బహిరంగంగా కేంద్రంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. గ్రేటర్‌ఎన్నికలనాటికి దీనిపై ఒక స్పష్టత రాకపోతే బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగానే బరిలోకి దిగితే మేయర్‌ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని అలాకాకుండా పొత్తుకొనసాగించితే ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
 
టీడీపీ నేతలే రెచ్చగొడుతున్నారు
విభజన చట్టంలో ఏముందో తమ పార్టీ నేతలు, కేంద్రమంత్రులు స్పష్టంగా చెబుతున్నా వినకుండా హోదా, రైల్వేజోన్‌ అంటూ టీడీపీ నేతలే ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఎంతవరకు సబబని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు ఉనికి కోసం ఏదైనా పోరాటం చేస్తాయి, ఆయా అంశాల్లో వాస్తవ, అవాస్తవాలను వివరించాల్సిన బాధ్యత మిత్రపక్షమైన టీడీపీపై కూడా వుంది. అలా చేయకుండా ప్రభుత్వంలో వున్నవారే పోరాటం చేస్తామనడం దారుణమని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో పొత్తు వున్నందున జీవీఎంసీ ఎన్నికల్లో కూడా అదే కొనసాగుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొంటున్నారు. ఒకవేళ విడిగా పోటీ చేయాలనుకుంటే అది టీడీపీ నేతల ఇష్టంపై ఆధారపడి వుంటుందని ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు.