Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 08:48AM

దాసరి, మోహన్‌బాబు తెలుగు పరిశ్రమ దిగ్గజాలు

దాసరినారాయణరావు, మోహన్‌బాబు తెలుగు పరిశ్రమ దిగ్గజాలని, అయితే గురుశిష్యులు ఇద్దరూ ఎవరికి వారే సాటి అని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, ఎంపీ శతృఘ్నసిన్హా అన్నారు. సలాం టు తెలంగాణ.. ప్రణామ్‌ టు ఆంధ్రప్రదేశ్‌.. అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన సిన్హా తియ్యటి తెలుగు భాష, గ్రేట్‌ నటుడు ఎన్టీఆర్‌ మాట్లాడిన భాష తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను సొంత రాష్ట్రాలుగా భావిస్తానన్నారు. గురువారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి-శృతిలయ స్వర్ణకంకణాన్ని ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శతృఘ్నసిన్హా తెలుగు భాష, రాష్ట్రాలపై తనకున్న ఆప్యాయతను పంచుకున్నారు. దాసరి, మోహన్‌బాబు తనకు అత్యంత ఆప్తులన్నారు. వీరద్దరూ ఇక్కడ పుట్టడం తెలుగు పరిశ్రమకు గర్వకారణం అన్నారు. రజనీకాంత్‌, అమ్రీష్‌పురి, మోహన్‌బాబు, చిరంజీవి తామంతా ఒక్క చెట్టు పక్షులమన్నారు. దర్శకరత్న దాసరి మాట్లాడుతూ కృతజ్ఞత అనేపదానికి నిలువెత్తు ఉదాహరణ మోహన్‌బాబు అన్నారు. ఎంతోమందికి నటులుగా, దర్శకులుగా అవకాశాలు ఇచ్చానని, అయితే అందరూ ఇంతగా తనను అభిమానించలేదన్నారు. ద్రోణాచార్యుడికి అర్జునిడిలా తనకు మోహన్‌బాబు అన్నారు. ఏపీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ హీరో, విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అందరి మెప్పును పొందిన విలక్షణ నటుడు మోహన్‌బాబు అన్నారు. విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలు గొప్పవని, సినీ పరిశ్రమ అనగానే గుర్తొచ్చే పేరు దాసరి అని అన్నారు.
 
మోహన్‌బాబు మాట్లాడుతూ నటుడిగా జన్మను ప్రసాదించిన తండ్రి దాసరి అన్నారు. ఒక జత చెప్పులు, రెండు జతలబట్టలతో ఉన్న నన్ను ఈస్థాయికి తీసుకొచ్చిన ఘనత దాసరిదేనన్నారు. రాయలసీమ వాడివి నీకు భాష రాదన్నవారు చాలామంది ఉన్నారని, ఎన్టీఆర్‌ తర్వాత డైలాగు చెప్పాలంటే మోహన్‌బాబే అనే స్థాయికి తీసుకొచ్చారని అన్నారు. గురువు దాసరిని కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే గౌరవిస్తానన్నారు. దాసరి పేరుతో స్వర్ణకంకణం అందుకోవడం పూర్వజన్మసుకృతం అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహించాలన్నారు. సభాధ్యక్షుడిగా వ్యవహరించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ దాసరి గొప్ప దర్శకుడు అయితే మోహన్‌బాబు అద్భుత నటుడు అని అన్నారు.
 
నటుడు ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ మోహన్‌బాబు గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి అన్నారు. మోహన్‌బాబు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ప్రకటించడం కాదు వచ్చేయాలి, వచ్చి గెలవాలి, గెలిచి సేవ చేయాలి.. అంటూ గంభీరంగా మాట్లాడారు. ద్రోణాచార్యుడు, అర్జునుడు... దాసరి, మోహన్‌బాబు అయితే తాను భీముడిని అని అన్నారు. కార్యక్రమంలో నటులు నరేష్‌, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, మంచు మనోజ్‌, మంచులక్ష్మి, జేబీ.రాజు, ఆమని తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఆమని ఆధ్వర్యంలోని గాయనీగాయకులు దాసరి, మోహన్‌బాబు చిత్రాల్లోని పాటలను పాడి హోరెత్తించారు.