desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 04:11AM

మాఫీ తక్షణావసరం

  • విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి 
  •  ఈసారి వానల్లేకపోతే 1972 పునరావృతం 
న్యూఢిల్లీ, మే 5: ‘‘దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో వరుసగా మూడేళ్లుగా రైతులు కరువు దెబ్బకు కుదేలయ్యారు. అప్పుల ఊబి నుంచి బయట పడేయడానికి ఆ పది రాష్ట్రాల్లోని రైతులకు రుణ మాఫీ పథకాన్ని అమలు చేయాలి. ఖరీఫ్‌ సీజన్లో రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలి’’ అని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయని తెలిపాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఇస్తున్న లక్ష రూపాయల పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచాలని, కుటుంబానికి పింఛను కూడా అందించాలని డిమాండ్‌ చేశాయి. వివిధ రాష్ట్రాల్లో కరువు, మంచినీటి సంక్షోభం పరిస్థితులపై గురువారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ మాట్లాడుతూ, వరుసగా మూడేళ్లపాటు కరువు కారణంగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, 1972 తర్వాత ఇదే తీవ్రమైన కరువు అని తెలిపారు. ‘‘రైతు రుణాలను కేంద్రం మాఫీ చేయడం తక్షణావసరం. గత మూడేళ్లుగా కరువు నెలకొంది. అందువల్ల, రుణాల రీషెడ్యూలుతో ఉపయోగం లేదు. అలాగే, ఖరీఫ్‌ సీజన్లో ఎరువులు, విత్తనాలను ఉచితంగా లేదా తక్కువ ధరకు అందించాలి’’ అని కోరారు. ‘‘పరిస్థితి దారుణంగా ఉంది. కరువు కాస్తా క్షామం దిశగా పయనిస్తోంది. ఒకవేళ కేంద్రం ముందస్తుగా స్పందించి ఉంటే, పరిస్థితి ఇంత తీవ్రమయ్యేది కాదు. రాబోయే రోజుల్లో వర్షాలు కురవకపోతే, 1972నాటి దుర్భిక్ష పరిస్థితులు తప్పవు’’ అని చవాన్‌ హెచ్చరించారు. నీటి కొరత కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో థర్మల్‌ విద్యుత ప్లాంట్లను మూసివేసినట్లు కేంద్ర విద్యుత శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ గురువారం లోక్‌సభకు తెలిపారు. మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాలో పార్లి థర్మల్‌ విద్యుత స్టేషన్‌ వద్ద గల అన్ని యూనిట్లలోనూ విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లుగా ఆ రాష్ట్ర పవర్‌ జనరేషన్‌ కంపెనీ చెప్పిందని మంత్రి పేర్కొన్నారు. ఇతర అన్ని రాషా్ట్రల్లోనూ థర్మల్‌ విద్యుత ప్లాంట్ల పరిస్థితి ఇలాగే ఉందని వివరించారు.
 
నా ముందు అరిస్తే నీళ్లొస్తాయా?
సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్న కొందరు సభ్యులపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర నీటి కొరతపై గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో చర్చిస్తున్నప్పుడు... కొందరు సభ్యులు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. వారి తీరుపై స్పీకర్‌ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ‘‘మీరు నా ముందు అరిస్తే నీళ్లొస్తాయా? ఒకవేళ వస్తాయనుకుంటే అరుస్తూ ఉండండి’’ అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. కాగా కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ రాష్ట్రాల సీఎంలను మోదీ చర్చలకు ఆహ్వానించారు.