desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 04:00AM

ఓరుగల్లు అరిగోస!

  •  రబీలో సగం కూడా లేని వరి విస్తీర్ణం 
  •  వేసిన దాంట్లోనూ 20 శాతం ఎండిన వైనం 
  • అయోమయ పరిస్థితుల్లో కౌలు రైతు 
  •  ఎంత లోతేసినా.. చుక్క నీరు కరువు 
  •  65 బోర్లు వేసి నష్టపోయిన ఒగ్గుకళాకారుడు 
ఓరుగల్లు.. కాకతీయుల రాజధాని! ఒకప్పుడు కరువు విలయతాండవం చేసిన చోట.. చెరువుల్ని తవ్వించి పైర్లకు పచ్చని జీవం పోశారు కాకతీ చక్రవర్తులు! ఆ తర్వాత పచ్చని పంటలతో విలసిల్లిన ఓరుగల్లు.. ఇప్పుడు అరిగోస పెడుతోంది! ఆ నాటి పరిస్థితులను తలపిస్తోంది! వర్షాభావ పరిస్థితులతో పం ట విస్తీర్ణం భారీగా పడిపోయిందనుకుంటే.. ఉన్న కొద్ది విస్తీర్ణంలోని పంటలను కాలం కానికాలంలో కురుస్తున్న వర్షాలు ముం చేస్తున్నాయి! ఫలితంగా రైతును కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి!
వరి ‘దిగు’బడి నిరాశే..
వరంగల్‌ జిల్లాలో ప్రధాన పంటలు పత్తి, వరి. కానీ, తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది ఆశించినంత దిగుబడి రాలేదు. ఖర్చులు పెరిగాయి. దిగుబడులు పడిపోయాయి. రైతు కు అప్పులే మిగిలాయి. బోర్ల కింద వ్యవసాయం అయితే చెప్పనక్కర్లేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎంత లోతు వేసినా చుక్క నీరు రాని పరిస్థితి. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,45,000 హెక్టార్లు. రబీలో అయితే సుమారు 75,127 హెక్టార్లలో వరిని పండిస్తారు. కానీ, ఈ ఏడాది రబీ వరి విస్తీర్ణం 49,315 మాత్రమే. ఇక, చెరువులు ఎండి, బోర్లు వట్టిబోయి ఆ విస్తీర్ణంలోనూ 20 శాతం పంట ఎండింది. అంటే సాగు భారీగా తగ్గిపోయిందన్నమాటే! ప్రధాన జలాశయాలైన రామప్ప, లఖ్నవరం, పాఖాల కిందే రైతు లు అధికంగా వరిని సాగు చేస్తారు. కానీ, ఈ సారి ఆ ప్రధాన జలాశయాల్లో నీరు లేక రైతులు అరిగోస పడుతున్నారు. ఓ వైపు కరువు.. మరోవైపు అకాల వర్షాలు.. తోడై మామిడిని నేల రాల్చాయి. తెగుళ్లు పట్టి ఉన్న పంట కూడా నాశనమైంది.
వరంగల్‌, ఆంధ్రజ్యోతి 

ఎంత లోతేసినా చుక్క నీరు రాదే...

నీళ్ల కోసం రైతులు ఎన్నో తిప్పలు..తంటాలు పడుతున్నారు. ఒక్కో రైతు ఏకంగా 25 దాకా బోర్లు వేసి బోరుమంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఒగ్గుకళాకారుడు డాక్టర్‌ చుక్క సత్తయ్య.. మూడు ద శాబ్దాల్లో పురస్కారాల ద్వారా వచ్చిన డబ్బునం తా బోర్లపైనే ఖర్చు చేశారు. అయితే.. ఆయన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. ప్రస్తుతం ఉన్న మూడు నాలుగు బోర్లు కూడా కరువుకు ఎండిపోయాయని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురం గ్రామానికి చెందిన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామ పంచాయతీ పరిధిలోని గిద్దెబండ తండాకు చెందిన ధీరావత్‌ శివలాల్‌ అనే గిరిజన రైతు ఆరు ఎకరాల్లో మూడేళ్లలో 25 బోర్లు వేశాడు. అందుకు అతడికి అయిన ఖర్చు ఆరు లక్షలకుపైమాటే! నాలుగు బోర్లలో కాసిన్ని నీళ్లు పడినా.. అవీ ఇప్పుడు వట్టిబోయాయని శివలాల్‌ చెప్పాడు. వారం క్రితం 300 అడుగుల లోతులో వేసిన రెండు బోర్లలోనూ చుక్క నీరు పడలేదన్నాడు. పశువులకూ నీరు లేక వాటిని అమ్మేశానన్నాడు. మరోవైపు నాలుగైదు ఎకరాలున్న రైతులు కూడా కరువు నేపథ్యంలో కుటుంబ పోషణకు కూలీ పనులకు వెళుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులను ఇళ్లలోనే వదిలేసి ఖమ్మం, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు పొట్ట చేతబట్టుకుని వలస పోతున్నారు. సాగునీటి కటకట మాటెలా ఉన్నా.. కనీసం తాగునీరు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. గ్రాసం లేక పశువులను, గొర్రెలను, మేకలనూ తెగనమ్ముకుంటున్నారు.
 
 
బోర్లు వేసి..వేసి సుడిపడ్డా..
మూడు దశాబ్దాలుగా నా 20 ఎకరాల్లో 65 బోర్లు వేశాను. 9 బావులు తవ్వించాను. కానీ, ప్రస్తుతం చాలినన్ని నీళ్లు మాత్రం లేవు. రెండు బోర్లు మాత్రమే అన్నో..ఇన్నో నీళ్లు పోస్తున్నాయి. వాటిలో కూడా ఈ ఏడాది పశువుల తాగునీటికి మాత్రమే అందుతున్నా యి. దేశదేశాలు తిరిగి.. ఒగ్గుకథలు చెప్పంగ వచ్చిన డబ్బులన్నింటిని పైసపైస పోగుచేసి కూడబెట్టి బోర్లల్ల పారబోయాల్సి వచ్చింది. 30 ఏండ్ల నుంచి లక్షలకు లక్షలను బోర్లపాల్జేసిన. గా డబ్బు బోర్లకు ఖర్చు చేయకపోతే అప్పట్ల హైద్రాబాద్‌ల పెద్ద కాంప్లెక్సే వచ్చేది.
- డాక్టర్‌ చుక్క సత్తయ్య, ప్రఖ్యాత ఒగ్గుకథ కళాకారుడు 
 
 
లక్నవరం ఎండింది
గోవిందరావుపేట, మే 5 : ప్రకృతి అందాల తీరం లక్నవరం సరస్సు అడుగంటిపోయింది. వరంగల్‌ జిల్లా గోవిందరావుపేట మండల ప్రజలచే అన్నపూర్ణగా కొలువబడుతున్న కాకతీయులు నిర్మించిన ఈ సరస్సు కుంటను తలపిస్తోంది. సెంటర్‌ఆఫ్‌ ఎట్రాక్షన అయిన ఊయల వంతెన వెలవెలబోతోంది. 10 రోజుల క్రితం మంత్రి ప్రారంభించిన కాటేజీలు కళ తప్పాయి. సరస్సు నీటిలో రయ్‌.. మంటూ దూసుకువెళ్లే బోట్లు ఒడ్డుకుపడ్డ చేపల్లా పడిఉన్నాయి. అధునాత కాటేజీలు, రెస్టారెంట్‌.. ఎటు చూసినా ఆహ్లాదాన్ని పంచే లక్నవరం సరస్సు అడుగు తేలింది. గేదెలు మేతకు వస్తున్నాయి. ఆ ప్రాంతమంతా మైదానాన్ని తలపిస్తోంది. ఎంతో ఆతృతతో ఇక్కడకు వచ్చిన పర్యాటకులు ఈ దయనీయ దృశ్యాన్ని చూసి ఉసూరుమంటున్నారు. సరస్సులోని దీవిలో రూ.40లక్షలు వెచ్చించి అధునాతన సౌకర్యాలతో నిర్మించిన కాటేజీలను ఏప్రిల్‌ 23వ తేదీన రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి అజ్మీరా చందూలాల్‌, టీఎ్‌సటీడీసీ చైర్మన పేర్వారం రాములు, ఎమ్డీ క్రిస్టియానా, కలెక్టర్‌ వాకాటి కరుణ ప్రారంభించారు. సరస్సు నీటిలో బోటింగ్‌ చేస్తూ కాటేజీలుండే దీవికి చేరుకోవడం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన 10 రోజుల వ్యవధిలోనే సరస్సు నీటిమ ట్టం ఊహించని విధంగా తగ్గిపోయింది. దీంతో కాటేజీలను ఉపయోగించుకునేందుకు పర్యాటకులు ముందుకు రావడం లేదు.

కరువు ప్రయాణం
మహబూబాబాద్‌: తెలంగాణలో ఉపాధిలేక ముంబైకి వలస వెళ్లే వాళ్లు ఎక్కువే! అదే కరువును తట్టుకోలేక మహారాష్ట్రనుంచి తెలంగాణకు వలస వస్తున్నారు ఉపాధి కోసం వరంగల్‌ జిల్లాకు చేరారు. తునికి (బీడీ)ఆకు సేకరణ సీజనగా పిలుచుకునే మే ఆరంభం నుంచి చివరాంకం వరకు శ్రామికులకు ఉపాధి ఇస్తుంది. ఈ పని కాలంలో అడవి బిడ్డలు ఒక్కొక్కరు నెల పేరు మీద రూ.10 వేలకు తగ్గకుండా సంపాదిస్తారు. ఇప్పుడు ఇదే ఉపాధి పనుల కోసం మహారాష్ట్ర కూలీలు తెలంగాణకు వలస బాట పట్టారు.