Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 02:48AM

ప్రైవేటురంగంలో ఓబీసీలకు రిజర్వేషన్లు

  •  ఓబీసీ సమస్యలపై వీహెచ్‌ భారీ ధర్నా 
  •  హాజరైన శరద్‌ యాదవ్‌, ఎంపీలు 
న్యూఢిల్లీ, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు రంగంలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఓబీసీ సమస్యలపై గళమెత్తుతూ గురువారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వీహెచ్‌ భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు దాదాపు 200మంది విద్యార్థులు, ఓబీసీ నాయకులు ధర్నాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.... ఓబీసీలకు సక్రమంగా రిజర్వేషన్‌ అమలు కావడం లేదని ఆరోపించారు. న్యాయవ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ ఇవ్వాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ కల్పించడానికి చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 85శాతం మంది జనాభా ఉన్న ఓబీసీల సమస్యలు ప్రధానికి పట్టవా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ బీసీ అయ్యి ఉండి కూడా ఓబీసీలకు ఏమీ చేయడం లేదని ఆరోపించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలను సమీకరించి అన్ని రాషా్ట్రలకు ఉద్యమాన్ని విస్తరింపజేస్తామని హెచ్చరించారు. ధర్నాకు హాజరైన జేడీయూ నేత శరద్‌ యాదవ్‌... సరైన సమయంలో ఈ అంశంపై ఉద్యమాన్ని ప్రారంభించినందుకు వీహెచ్‌ను అభినందించారు. కాగా, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు డి.రాజా, నంది ఎల్లయ్య, అలీ అన్వర్‌ అన్సారీ, ఆస్క్‌ అలీ తక్‌, టి.దేవేందర్‌గౌడ్‌, కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్‌, బూర నర్సయ్యగౌడ్‌, వరప్రసాద్‌, ఎం.ఏ.ఖాన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కొప్పుల రాజు, ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ, ఏఐసీసీ మైనారిటీ సెల్‌ కుర్షిద్‌ అహ్మద్‌ సయీద్‌, ఖాజా ఫక్రుద్దిన్‌, టీపీసీసీ నేత సంతోష్‌ కుమార్‌, నిరంజన్‌ తదితరులు హాజరయ్యి వీహెచ్‌కు సంఘీభావం తెలిపారు. జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు.