Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 02:26AM

ఈ చులకన చెల్లదు!

తెలుగువాళ్లంటే ఢిల్లీకి ఎందుకింత చులకన? ఏమిటీ నిర్లక్ష్యం? ఉమ్మడిమద్రాసు రాష్ట్రంగా వున్నప్పుడు, హైదరాబాద్‌ సంస్థానం నడిచినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం హైదరాబాదులు ఏర్పడినప్పుడు సమైక్యంగా మారినప్పుడు విభజన ఉద్యమాలు సాగినప్పుడు రెండు రాష్ర్టాలైన తర్వాతా - ఎప్పుడైనా సరే- ఎవరున్నా సరే- తెలుగువారిని ఎందుకింత చిన్నచూపు చూస్తారు? ఇక్కడ తమ ఆటలు సాగవనా? లేక ఎలాగైనా సాగిపోతుందనా?
 
               ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర మంత్రులు ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు కుండలు బద్దలు కొట్టి - కుండలు కాదు, గుండెలు బద్దలు కొట్టి చేసిన ప్రకటనల తర్వాత తలెత్తుతున్న ప్రశ్న ఇది. మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న కోర్కెపై వంద విన్యాసాలు చేసి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత గాని ఒప్పుకోలేదు. తెలంగాణలో నిజాం నిరంకుశత్వంపై ప్రజలు పోరాడినప్పుడు నెత్తురుటేర్లలో ముంచిన తర్వాత నిజాంకు రాజప్రముఖ్‌ హోదా కట్టబెట్టిన తర్వాత మాత్రమే సంక్రమణ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత రెండు విభజన ఉద్యమాలు వాటి వెనక రాజకీయాలు పార్టీల విన్యాసాలు అదంతా వేరే చరిత్ర. ఎన్టీఆర్‌ను కుట్రతో కూలదోసి మట్టి కరిచారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో 2009 డిసెంబర్‌ 9న రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కూడా అయిదేళ్ల పాటు అయోమయం కొనసాగించి ఆ పైన అత్యున్నత సభలోనూ అరాచకం సృష్టించి అయిందనిపించారు. అదంతా చరిత్ర.
               ఆ ఘట్టంలో అప్పటి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంగా వున్న అప్పటి ప్రధాన ప్రతిపక్షం కలసికట్టుగా ఇచ్చిన మాట ఏపీకి ప్రత్యేక హోదా. అప్పటికే లోక్‌సభలో ఓటింగు పూర్తయి రాజ్యసభకు వచ్చేసింది. అక్కడ నోరు మెదపని బీజేపీ రాజ్యసభలో ఏపీకి కొన్ని రక్షణలు కోరింది. వెంకయ్య నాయుడు పదేపదే లేచి మాట్లాడారు. ఏపీకి అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మన్మోహన్‌ అంటుంటే కాదు పదేళ్లు ఇప్పించండని వెంటపడ్డారు. ఎన్నికల ప్రచారంలోనూ హోదా సాధించిన యోధుడు ఏపీకి ఏకైక దిక్కుగా నిలిచిన వెంకయ్యనాయుడేనని హోరెత్తించారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు, జనసేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌ త్రయం ఓట్లు అభ్యర్థించడం కోసం జరిపిన సభల్లోనూ అదే వరస. మేము వస్తేనే అభివృద్ది అని వూదరగొట్టారు. నమ్మిన ప్రజలు విజయం చేకూర్చారు. రెండేళ్లకు పైగా గడిచింది. అనుకున్న హోదా రావడం లేదని ఎప్పుడో అర్థమై పోయింది.
 
               బీజేపీ చోటాల నుంచి బడా నేతాల వరకూ ఆ ప్రసక్తే లేదని అనధికారికంగా చెబుతూనే వున్నారు. ప్రత్యేక హోదా సంజీవని వంటిదేమీ కాదని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కారు. ప్రత్యేక హోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీ ఏ విధంగా ఎక్కువ లాభమో పోలికలు వేసి చూపించారు. అయితే కశ్మీర్‌, బీహార్‌ వంటి చోట్ల భారీ ప్యాకేజీలు ప్రకటించిన ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనలో మట్టి నీళ్ల సంప్రోక్షణతో సరిపెట్టారు. హళ్లికి హళ్లి సున్నకు సున్నగా హోదా ప్యాకేజీ కూడా మిథ్యేనని ఆ విధంగా మొహం మీదే చెప్పినా అంతులేని ఆశాభావాన్ని ఆశ్రయిద్దామన్నారు. అందరం కలసి అడుగుదాం వత్తిడి చేద్దాం రాజకీయంగా పోరాడదాం వంటి ఆలోచనలే చేసింది లేదు. కేంద్రంలో తెలుగుదేశం, రాష్ట్రంలో బీజేపీ అధికారం పంచుకుంటున్నందువల్ల ఉమ్మడి తంతుగా మారిపోయింది. ‘తరలింది తనకు తానే ఆకాశం...’ అంటూ బాక్సాఫీసును బద్దలుకొట్టిన పవర్‌ స్టార్‌ వాస్తవంలో సామాన్య ప్రజలపాటిగానైనా ప్రశ్నించకపోగా ట్వీట్లఫీట్లతో సరిపెట్టారు. హోదా తేలేదని తెలుగుదేశంపై దాడి చేయడం తప్ప కేంద్ర బీజేపీని పెద్దగా విమర్శించలేని పరిస్థితి జగన్‌ది. కాంగ్రెస్‌ కదిలితే మీరేకదా బాధ్యులు అని ఎదురుదాడి. కమ్యూనిస్టులు హెచ్చరించినా తర్వాత ఉద్యమించినా పట్టించుకోనట్టు నటించే పాత ఎత్తుగడలే. ఇదంతా రాష్ర్టాభివృద్ధికి ఆటంకం అని ప్రచారదాడి.
 
         ప్రణాళికా సంఘం గతంలో ఇచ్చేది గనక ఇప్పుడా సంఘమే లేదు గనక ప్రక్రియ కూడా వుండదన్నట్టు మాట్లాడుతూ రాజకీయ రాజ్యాంగ బాధ్యతలను ఘోరంగా విస్మరించిన బాధ్యతా రాహిత్యం కేంద్రానిది. రాష్ట్రం బీజేపీ నేతలైతే ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని సవాళ్లు చేస్తారు గాని ఆ మాట కేంద్రం అధికారికంగా చెప్పదు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అధికారికంగా లెక్కలతో సహా సమాధానం చెప్పకపోగా కొంతవరకూ సాయం చేశారని మెచ్చుకుంటుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాజమండ్రి వచ్చి నానా ఖాతాలు విడుదల కాని మొత్తాలు కలిపి లక్షన్నర కోట్లకు పైగా ఇచ్చినట్టు చెప్పిపోతారు. ఏతావాతా ఇది బీజేపీ టీడీపీల రాజకీయ వ్యూహాల సమస్య తప్ప రాష్ట్ర కేంద్రాల రాజ్యాంగ చర్చ కాకుండా పోయింది. పైన వున్నది బీజేపీ గనక వారిదే ప్రధాన బాధ్యత. వెంటబడి పోరాడి రాబట్టవలసిన టీడీపీది తర్వాత అంతే బాధ్యత. వ్యక్తిగతంగా చెప్పాలంటే వెంకయ్య నాయుడుది మొదటి బాధ్యత, చంద్రబాబు నాయుడిది తర్వాతి బాధ్యత. ఈ ఇద్దరి పరస్పర కీర్తనల జోరు తప్ప ప్రత్యేక హోదా ప్యాకేజీ ఏదీ తీసుకురాలేదన్నది నిజం. ప్లీజ్‌ మేకిట్‌ టెన్‌ ఇయర్స్‌ అంటూ ఆ రోజున అదేపనిగా నాటకీయంగా మన్మోహన్‌ను అభ్యర్థించిన వెంకయ్యనాయుడుకు ఇప్పటి అభ్యర్థనలు వినిపించడం లేదు. ఎందుకంటే హోదా రాకపోవచ్చన్న పల్లవి విజయవాడలో మొదలుపెట్టిందే ఆయన. కాంగ్రెస్‌ చట్టంలో పొందుపర్చలేదు గనక మేము ఇవ్వలేకపోయామని చెప్పడం బీజేపీ రాజకీయ అస్తిత్వానికే అవమానం.
 
               ఢిల్లీలో పెద్దన్నగా చక్రం తిప్పుతూ ముచ్చటగా మూడు భాషల్లో వాగ్బాణలు సంధించే వెంకయ్య నాయుడు యావద్దేశం సాక్షిగా తాను అడిగింది చెప్పింది అమలు చేయించుకోలేకపోయాక అధికారాన్ని పట్టుకుని వేళ్లాడ్డమెందుకు? ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికామాటలాడి నెట్టుకురావడం నేతలకు గౌరవమా? అందరినీ కలుపుకొని అడగాల్సిన అధినేత చంద్రబాబు నాయుడే పదే పదే ఘర్షణ వద్దని వెనక్కులాగుతుంటే ఇక గట్టిగా పోరాడాల్సిందెవరు? ఇంత జరిగాక కేంద్రంలో తెలుగుదేశం కొనసాగుతుందంటే లోపాయికారి అవగాహన వుందనే అనుమానాలు రావడం తప్పా? 
 
            దేశమంతా ఓడిపోయిన ఇందిరాగాంధీకి మొత్తం సీట్లన్నీ కట్టబెట్టినా, లౌకిక సూత్రాన్ని త్యజించి 1998లో చంద్రబాబు వాజ్‌పేయి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినా, ఇటీవలి ఎన్నికల్లో మోదీని మోసినా, కేసీఆర్‌ కూడా బీజేపీ పట్ల సుతిమెత్తగా వుంటున్నా ప్రజలకు వొరుగుతున్నది పూజ్యం. రాజ్యాంగ బద్దంగా రావలసింది పట్టిపట్టి ఇవ్వడం తప్ప విభజన నేపథ్యంలో ఆదుకున్నది లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా ఏపీ రెవెన్యూలోటు కూడా తప్పక భర్తీ చేయాలని ఎక్కడా లేదని కొండంత అసత్యమాడేశారంటే ఏం చెప్పాలి? ఈ పరిస్థితుల్లో అఖిలపక్షం ద్వారా, నిఖిల ప్రజానీకాన్ని కదిలించడం ద్వారా న్యాయమైన కోర్కెను తెలుగుదేశం ప్రభుత్వం ఎలుగెత్తి చాటుతుందా లేక మొక్కుబడి మాటలతో వెళ్లబుచ్చుతుందా?
తెలుగువాళ్ల పట్ల కేంద్రం అలక్ష్యానికి మూలాలు ఇక్కడే వున్నాయనిపిస్తుంది.
 
               జాతీయంగా చక్రం తిప్పిన గొప్పలు ఎలా వున్నా గత నలభై ఏళ్లలో చూస్తే నిన్నటి ఏపీకి గాని ఇప్పటి ఏపీ తెలంగాణలకు గాని కేంద్రం వల్ల ప్రత్యేకంగా ఒరిగింది నాస్తి. ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడని మొన్న శాతకర్ణి సభలో కేసీఆర్‌ ఆకాశానికెత్తారు. నిజానికి ఇక్కడ యాభైలలోనే కమ్యూనిస్టులు కాంగ్రె్‌సను సవాలు చేశారు. కాంగ్రెస్‌ బీజేపీయేతర ప్రత్యామ్నాయాలు ఇక్కడ రావడానికి అదే పునాది. ఎన్టీఆర్‌ను అక్రమంగా తొలగించినప్పుడు కూడా తెలుగు ప్రజలు కొత్త చరిత్ర రాశారు. ఇప్పుడైనా అంతే. రాజకీయంగా తమకు పెద్ద లాభం లేదు గనక చులకన చేస్తే ఇప్పుడైనా బీజేపీకి తప్పక పాఠం నేర్పిస్తారు. నేతల అనైక్యత వ్యక్తిగత సంకుచితత్వం కారణంగానే కేంద్రం అంతగా చెలగాటమాడగలిగింది. విభజన తర్వాత రెండు చిన్నవైన రాష్ర్టాలను గతంకన్నా మెరుగ్గా చూసే అవకాశం లేదు. అందుకు ఒక్కుమ్మడిగా పోరాడి సాధించుకోవడమే మార్గం. రాష్ర్టాలుగా విడిపోయినా నిరర్థక వివాదాలు పెంచుకునే బదులు కేంద్రం ఏకపక్ష పోకడలపై ఏకోన్ముఖంగా పోరాడమే నిజమైన విరుగుడు.
  • తెలకపల్లి రవి