Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 04:26AM

ఇదేం పోటు

గంగాధరనెల్లూరు: ఫ్రిజ్‌, వాషింగ్‌మిషన్లూ లేవు. చిన్నపాటి పరిశ్రమలూ లేవు. పిండిమర తదితర మోటార్లు లేవు. అయినా సరే రూ.వేలల్లో విద్యుత్తు బిల్లులు రావడంతో జీడీనెల్లూరు మండలం ఆవలకొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని గృహ వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా అధికంగా సొమ్ము చెల్లించాలని రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఈ సబ్‌స్టేషన్‌ పరిధిలోని గడ్డంపల్లెకు చెందిన రెడ్డివాళ్ళ ప్రభుదాస్‌రెడ్డి(సర్వీస్‌ నెం:5111107001143) పేరిట ఈనెల 16న రూ.16,143, తూగుండ్రం దళితవాడకు చెందిన ఎ.జీవరత్నం(సర్వీస్‌ నెం.5111102001723)కు ఈనెల 11న రూ.13,162, మేనాటంపల్లెకు చెందిన అరవ గోవిందరెడ్డి(సర్వీస్‌ నెం. 5111107001569)కి ఈనెల 15న రూ.6,772 చెల్లించాలంటూ విద్యుత్తు బిల్లులందాయి. దీంతోపాటు దాదాపు యాభై మందికి పైగా ఇదే తరహాలో వచ్చాయి. సాధారణంగా రూ.300లోపు బిల్లులు వస్తుండగా, ఒక్కసారిగా రూ.వేలల్లో రావడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే పెద్ద మొత్తంలో బిల్లులు రావడం వెనుక సాంకేతిక కారణాలా లేక ఏవైనా సమస్యలా అన్నది తేలాల్సి ఉంది. ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏఈ రాజా మాట్లాడుతూ విద్యుత్‌ బిల్లులు అధికంగా రావడంపై తమకు ఫిర్యాదులందాయన్నారు. దీనిపై సిబ్బంది ద్వారా విచారణ చేయిస్తున్నామనీ, త్వరలో అందరికీ న్యాయం చేస్తామని వివరించారు.