Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 04:19AM

పశుమాంస విక్రయాలపై దాడులు

పొందూరు: గోవధ నిషేధమన్న ప్రభుత్వం ఆ విధంగా చర్యలు చేపట్టడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. దీంతో గోవధ యథేచ్ఛగా జరుగుతుంది. పొందూరు మండలం రాపాక సమీపంలో సాయిబుల కాలనీలో పశుమాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విషయం తెలుసుకున్న స్వామి శ్రీనివాసనంద ఆధ్వర్యంలోని స్వాభిమాన్‌ ట్రస్టు సభ్యులు, చిరుదివ్వె స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆదివారం ఉదయం దాడులు నిర్వహించారు. ఆటోలో తీసుకువస్తున్న పశుమాంసాన్ని వారు పోలీసుల సమక్షంలో పట్టుకున్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో పశుమాంసం విక్రయించే దుకాణం వద్ద స్వామిజీతోపాటు సుమారు పదిమంది యువకులు దాడిచేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఆటోలో సుమారు మూడు వందల కేజీల మాంసాన్ని విక్రయించేందుకు విక్రయదారులు తీసుకువచ్చారు. ఈ సమయంలో దాడి చేసి ఆటోను పట్టుకోవడమే కాకుండా ఎస్‌ఐకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈలోపు విక్రయదారులకు స్వామిజీకి వాగ్వాదం చోటుచేసుకుంది. పవిత్రమైన గోమాతను వధించి విక్రయాలు ఎలా సాగిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతుల మేరకే శ్రీకాకుళంలో వేసిన మాంసాన్ని ఇక్కడ విక్రయిస్తున్నామే తప్ప.. ఈ ప్రాంతంలో పశువులను వధించడం లేదని విక్రయదారులు తెలిపారు. ఏది ఏమైనా పశువులను వధించి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో చిరుదివ్వె సంస్థ అధ్యక్షుడు డి.హరికృష్ణ, గోవింద, సుమారు పది మంది సభ్యులు పాల్గొన్నారు. పశుమాంసంతో ఉన్న ఆటోను, విక్రయదారులను పోలీసు స్టేషన్‌కు తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు.