Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 04:11AM

పంబలేరులో డ్రైవర్ల మృతదేహాలు


గూడూరు: విలువైన కాపర్‌ షీట్ల కోసం నిందితులు హత్య చేసిన ఇద్దరు లారీ డ్రైవర్ల మృతదేహాలను గూడూరు పంబలేరు వాగు నుంచి ఆదివారం పోలీసులు వెలికితీశారు. తమిళనాడు తూత్తుకుడి ప్రాంతంలోని సెరిలైగ్‌ కాపర్‌ కర్మాగారం నుంచి గుజరాత్‌లోని సిలస్వా ప్రాం తానికి 56 కాపర్‌షీట్లతో లారీ బయల్దేరింది. సరుకు విలువ 1.5 కోట్లు. అదే రాష్ట్రంలోని సేలం సమీపంలోని నమక్కల్‌ జిల్లా కావకర్‌పట్టి గ్రామానికి చెందిన శరవణన్‌, అతని అల్లుడు శ్రీకాంత్‌ లారీ డ్రైవర్లుగా ఉన్నారు. వీరి లారీ వెనుకే చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన శ్రీరాములు, శివకుమార్‌, రోహన్‌, జనార్థన్‌, మురళీ, భరత్‌ మరో లారీలో వెంబడించారు. స్థలగిరి వద్ద శ్రీరాములు, శివకుమార్‌, రోహన్‌ లారీకి అడ్డుగా తమ లారీని పెట్టి బలవంతంగా కాపర్‌ షీట్ల లారీలో ఎక్కారు. లారీ కొద్ది దూరం వెళ్లిన తరువాత శ్రీకాంత్‌, శరవణన్లను కొట్టి లారీని పలమనేరు వైపు మళ్లించారు. పలమనేరు వద్ద కాపర్‌ లారీ డ్రైవర్లను తమ లారీలోకి తీసుకెళ్లి కిరాతకంగా కొట్టి చం పారు. మృతదేహాలను పట్టాలు కప్పి శనివారం వేకువన పలమనేరు నుంచి రెండు లారీలూ నెల్లూరు వైపు బయల్దేరారు. ఆ మృతదేహాలను గూడూరు పంబలేరు వాగులో తోసేశారు.
హైవే తనిఖీల్లో దొరికిన నిందితులు
నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పోలీసులు హైవే తనిఖీల్లో దాబా హోటల్‌ వద్ద ఉన్న రెండు లారీలను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు పరారు కాగా శ్రీరాములు, శివకుమార్‌, రోహన్‌ పోలీసులకు చిక్కారు. ఈ నిందితులను వెంట పెట్టుకుని ఆదివారం రాత్రి పోలీసులు పంబలేరు వాగును పరిశీలించారు. రాత్రి కావడంతో మృతదేహాలు కనిపించలేదు. దీంతో వేకువన కృష్ణగిరి డీఎస్పీ పి.కె.రాజేంద్రన్‌, బుచ్చి సీఐ చంద్రమౌళి, గూడూరు రూరల్‌ సీఐ మధుసూదన్‌రావు, ఎస్‌ఐలు హనీఫ్‌, దశరథరామారావు ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వాగులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాగులో 10 మీటర్ల దూరంలో మృతదేహాలు వేర్వేరుగా లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రెండేళ్లనాటి ఘటన పునరావృత్తం
గూడూరు సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జి కింద పంబలేరు వాగు లో సరిగ్గా రెండేళ్ల కిందట (2012 జులై 14న) ఇదే తరహాలో గుర్తు తెలియని మృతదేహాలు రెండు లభ్యమయ్యాయి. గొంతు వద్ద వాచి ఉండటం, మృతదేహంపై గాయాలున్నాయి. వాటి ఆచూకీ నేటికీ తెలియరాలేదు.
పంబలేరు వాగును పరిశీలించిన కృష్ణగిరి ఎస్పీ
తమిళనాడు లారీ డ్రైవర్ల మృతదేహాలు వెలికితీసిన పంబలేరు వాగును ఆదివారం తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి ఎస్పీ కన్నమల పరిశీలించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. ఆయన వెంట పలువురు తమిళనాడు పోలీసు సిబ్బంది ఉన్నారు.