Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 03:51AM

మాజీ మావోయిస్టు దారుణ హత్య

కల్వకుర్తి/ వెల్దండ: కల్వకుర్తి తాలూకా వెల్దండ మండలం అజిలాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు గునగంటి యాదయ్య అలియాస్‌ శ్యామ్‌(32) ఆదివారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. వెల్దండ మండల కేంద్రం సమీపంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యాదయ్యను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటికే మృతి చెందాడు. ప్రమాదంలో యాదయ్య భార్య కృష్ణమ్మ, పిల్లలు రాజేష్‌, క్రాంతి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... అజిలాపూర్‌కు చెందిన గునగంటి మల్లయ్య, ఎల్లమ్మ దంపతులకు యాదయ్య ఐదో సంతానం. అతను చిన్న వయస్సులోనే నక్సల్స్‌ ఉద్యమానికి ఆకర్షితుడై, అందులో చేరాడు. సుమారు దశాబ్దకాలం పాటు వివిధ దళాల్లో చురుకైన పాత్ర పోషించి, అప్పట్లో జిల్లా పోలీసులకు సవాల్‌గా మారాడు. అచ్చంపేట ఏరియా దళకమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2007లో అప్పటి పరిస్థితులను బట్టి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. జనజీవన స్రవంతిలో కలిశాడు. అనంతరం అప్పటికే దళంలో పరిచయమున్న తుర్కలపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మను వివాహమాడాడు. వీరికి ఇద్దరు సంతానం. యాదయ్య గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, కల్వకుర్తి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై స్వగ్రామం అజిలాపూర్‌ నుంచి కల్వకుర్తికి భార్య కృష్ణమ్మ, పిల్లలు రాజేష్‌, క్రాంతిలతో బయలుదేరాడు. వెల్దండ మండల కేంద్రం సమీపంలోని సబ్బుల కంపెనీ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని దుండగులు కారుతో యాదయ్య వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ఉన్న యాదయ్య, భార్య పిల్లలు కిందపడిపోయారు. కారులో వచ్చిన వారు యాదయ్యను హతమార్చడానికి వచ్చినట్లు పసిగట్టిన భార్య కృష్ణమ్మ భర్తను పారిపోమని హెచ్చరించింది. పరుగెత్తే క్రమంలో కింద పడిన యాదయ్యను దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా మెడ, తలపై నరికారు. అతను రక్తం మడుగులో అక్కడికక్కడే కుప్పకూలాడు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి యాదయ్యను ఓ ఆటోలో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు.
ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు
యాదయ్య మృతి చెందిన వార్త కల్వకుర్తి నియోజకవర్గంలో దావానంలా వ్యాపించింది. యాదయ్య బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద ముందు జాగ్రత్తగా ఎస్‌ఐ వీరబాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జనం తండోపతండాలుగా రావడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ గోవర్ధన్‌ హుటాహుటిన కల్వకుర్తికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యాదయ్య హత్యపై ఆయన భార్య కృష్ణమ్మతో వివరాలు సేకరించారు.
మిన్నంటిన రోదనలు
యాదయ్య మృతితో ఆస్పత్రి వద్ద ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భర్త చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించడంతో యాదయ్య భార్య కృష్ణమ్మ ఒక్కసారిగా కుప్పకూలింది. తల్లి ఎల్లమ్మ శోకసంద్రంలో మునిగిపోయింది.
పథకం ప్రకారమే హత్య
యాదయ్యను ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తన భర్తకు ప్రాణహాని ఉందని పోలీసులకు సమాచారమిచ్చినా అలసత్వం వహించారని, వారు పట్టించుకోకపోవడం వల్లే ప్రత్యర్థులుపొట్టన బెట్టుకున్నారని కృష్ణమ్మ ఆగ్రహంతో ఒక దశలో అక్కడున్న పోలీసులపై మండిపడింది. అజిలాపూర్‌కు చెందిన పది మంది ప్రత్యర్థులే కక్ష గట్టి యాదయ్యను హత మార్చారని, తాము వారిని వదిలేది లేదని ఆస్పత్రి వద్ద యాదయ్య భార్య కృష్ణమ్మ, తల్లి ఎల్లమ్మ, సోదరుడు జంగయ్య రోదిస్తూ వాపోయారు.
ఉలిక్కిపడ్డ అజిలాపూర్‌
ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం కలిగి, జిల్లాలోనే అన్నలకు ఖిల్లాగా మారిన అజిలాపూర్‌ మాజీ మావోయిస్టు యాదయ్య హత్యతో మరోమారు ఉలిక్కిపడింది. వివిధ దళాల్లో పని చేసిన గ్రామానికి చెందిన అనేక మంది యువకులు ఏడేనిమిదేళ్ల కిందట పోలీసుల ఎదుట లొంగిపోవడంతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గ్రామానికి మాజీ మావోయిస్టు కొప్పు అంజయ్యపై గ్రామానికి చెందిన కొందరు గతేడాది దాడి చేయబోయగా తప్పించుకున్నాడు. అప్పట్లో అది సంచలనం రేపింది. ఈ ఘటన గ్రామంలో రెండు వర్గాలకు చెందిన మాజీ మావోయిస్టుల మధ్య కక్షలకు ఆజ్యం పోస్తూ వస్తుంది. తాజాగా యాదయ్య హత్య ఉదంతం అజిలాపూర్‌లో మళ్లీ అలజడి రేపింది. ఇసుక అక్రమ రవాణా పంచాయితే ఇరువర్గాల మధ్య ఘర్షవాతావరణానికి, కక్షలకు కారణమైందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులూ ఆ కోణంలోనే జరిగిఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.ీఈఠీ.ాఅ