Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 02:47AM

ఐక్య పోరాటాలతోనే చేనేత సమస్యలకు పరిష్కారం


పెడన : చేనేత పరిశ్రమకు చెందిన వారంతా సంఘటితమై ఐక్య పోరాటాలు చేసినప్పుడే చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు అన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెడనలోని పోలవరపుపేట కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రస్థాయి చేనేత సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన రామాంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత పరిశ్రమ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోందని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత రుణాలను మాఫీ చేస్తామని, సహకార సంఘాలను బలోపేతం చేస్తామని, వీవర్స్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి 50 శాతం సబ్సిడీపై నూలు సరఫరా చేస్తామని హామీలు ఇచ్చిందని అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఆ హామీలు ఏమీ నెరవేరలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని ఆయన విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించి పవర్‌లూమ్‌ యజమానులు చేనేతకు రిజర్వు చేసిన 11 రకాల వస్త్రాలను కూడా ఉత్పత్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 100 రోజుల తెలుగుదేశం పాలనలో జరిగిన 4 కేబినెట్‌ సమావేశాలలో చేనేత ఊసే లేదన్నారు. చట్ట సభలలో చేనేత గురించి మాట్లాడే వారే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ రాష్ట్రకార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ చేనేత క్లస్టర్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. 11 రకాల చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో అక్టోబరు 2న మండల కేంద్రాలలో గాంధీ విగ్రహాల ఎదుట దీక్షలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. సంఘ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సజ్జా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆప్కో కొనుగోళ్ళు నిలిపి వేయడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత సహకార సంఘాలలో కోట్లాది రూపాయల వస్త్ర నిల్వలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వం రూ.100 కోట్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసి ఆప్కోతో సంఘాల్లోని వస్త్రాలను కొనుగోలు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ఈ సదస్సులో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కట్టా హేమ సుందరరావు, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేషయ్య, కార్యవర్గ సభ్యుడు పిచ్చుక ఆదిశేషు, జిల్లా కార్యదర్శి పంచల నరసింహారావు, ఆప్కో డైరెక్టర్‌ ఎం నరసింహారావు, కెడిసిసి బ్యాంక్‌ డైరెక్టర్‌ పేరిశెట్టి మధుసూదనరావు, జిల్లా సహకార సంఘాల సమాఖ్య కన్వీనర్‌ బళ్ళ గంగాధరరావు ప్రసంగించారు. జి3,4,ది4,ఈ్ణజీణాఞచ్తి,ు5ూ