desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 9 2016 @ 00:56AM

‘ఆంధ్రప్రదేశ్‌’ వల్లే విభజన

  • ఆదర్శ ప్రదేశ్‌గా మార్చాలి.. జగన్‌ పొలిటికల్‌ సూపర్‌ స్టార్‌
  • ‘ఎన్నికల నామ సంవత్సరం’కోసం ఎదురుచూపులు
  • వైసీపీ కార్యాలయంలో పంచాంగ పఠనం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘‘వైఎస్‌ జగన్‌ పొలిటికల్‌ సూపర్‌ స్టార్‌. కుట్రలు, కుతంత్రాలతో పెట్టిన అన్ని కేసుల నుంచి కడిగిన ముత్యంలా, 24 క్యారెట్‌ బంగారంలా బయటపడతారు. వైసీపీ భవిష్యత్‌ బ్రహ్మాండంగా ఉంటుంది. చల్లని గాలి వీచాలంటే ఫ్యాన్‌ అధికారంలోకి రావాల్సిందే’’ అని పంచాంగకర్త మారేపల్లి రామచంద్రశాసి్త్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పేరు వల్లే విభజన జరిగిందని.. ‘ఆదర్శప్రదేశ్‌’గా మార్చాలని సూచించారు. ఉగాది సందర్భంగా శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ పఠనం జరిగింది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఇతర నేతలు పాల్గొన్నా రు. 2019 ‘ఎన్నికల నామ సంవత్సరం’ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని సిద్ధాంతి పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజానాయకుడికి పట్టాభిషే కం చేస్తారని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలూ యువ నాయకత్వం కోరుకుంటున్నాయన్నారు. ‘‘కాలం బలీయమైంది. దానిని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ఏడాదికి శుక్రుడు రాజు. దుర్ముఖిలో మనుషులు స్వార్థంతో ఉంటా రు.
 
             పైన చిరునవ్వుతో ఒకటి మాట్లాడుతూ... లోపల ఇంకోటి చేస్తారు. పాడి పంటలు బాగున్నా.. అకాల వర్షాలతో నష్టం జరుగుతుంది. ధరలు పెరుగుతాయి. బుధుడు మంత్రి స్థానంలో మంచి సలహాలు ఇచ్చినా.. ఆచరణలో సాధ్యంకాదు’’ అని తెలిపారు. వైసీపీకి మంచి భవిష్యత్తు ఉందని సిద్ధాంతి చెప్పారు. ‘‘పార్టీపరంగా వైసీపీ బ్రహ్మాండం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయడంలో 100% విజయం సాధించింది. దుర్ముఖిలో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. ఓటు బ్యాంకు పెరిగింది’’ అని సిద్ధాంతి తెలిపారు. ‘‘పార్టీ ఎందుకు మారుతున్నారో ఆలోచించుకోవాలి. పార్టీ ఫిరాయించినవారంతా రాజకీయంగా వీఆర్‌ఎస్‌ తీసుకున్నట్లే. అధికార పార్టీని వారి మేనిఫె స్టో అనకొండలా చుట్టేస్తోంది’’ అని తెలిపారు. ‘‘హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఉండదని సైకిల్‌ జోరుగా సాగిపోతుందని అనుకున్నారు.
 
               కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ ఫార్ములా వన్‌ కారులా దూసుకుపోయాడు. తెలంగాణలో ఒక్కడిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోరాటం చేస్తున్నారు’’ అని తెలిపారు. రాష్ట్ర విభజనకు ‘ఆంధ్రప్రదేశ్‌’ అనే పేరే కారణమని సిద్ధాంతి రామచంద్ర శాసి్త్ర పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ పేరు వల్ల విభజన జరిగింది. మద్రాసు నుంచి విడిపోయాం. తెలంగాణ నుంచి విడిపోయాం. భవిష్యత్తులో రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం పేరును ఆదర్శప్రదేశ్‌గా మారిస్తే బాగుంటుంది’’ అని తెలిపారు. ‘వైసీపీ’ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన ‘మన పార్టీ’ అని చెప్పడం విశేషం. వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.