desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 8 2016 @ 23:23PM

పాత వాహనాలపై గురి పెట్టండి

  • మారుతి సుజుకీ చైర్మన్‌ భార్గవ
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో పెద్ద డీజిల్‌ కార్లు, ఎస్‌యువిలను సుప్రీంకోర్టు నిషేధించడం పట్ల మారుతి సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌సి భార్గవ ఆందోళన వ్యక్తం చేస్తూ.. కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యం అయితే పాత వాహనాలను నిషేధించడం అవసరమని, కాలుష్య నిబంధనలను పాటిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీయని కార్లను కూడా ఆ కోవలో చేర్చడం ఏ మాత్రం సమంజసంకాదని అన్నారు. సిఐఐ సదస్సుకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో మొత్తం ఆరు లక్షల వరకు డీజిల్‌ కార్లున్నాయని, వాటిలో రెండు లక్షలు భారత స్టేజ్‌ 1 కాలుష్య నియంత్రణ నిబంధనల నాటికన్నా ముందు కాలం నాటివని, అవి వెదజల్లే కాలుష్యం 12 లక్షల కొత్త కార్లు వదిలే కాలుష్యంతో సమానమని ఆయన చెప్పారు. బిఎస్‌4 ప్రమాణాలతో వస్తున్న కొత్త కార్లతో పోల్చితే పాత కార్లు ఆరు రెట్లు అదనపు కాలుష్యం వెదజల్లుతాయని ఆయన అన్నారు.
కానీ సుప్రీంకోర్టు నిషేధం వల్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో తయారైన కొత్త తరం డీజిల్‌ కార్లు కూడా ఢిల్లీ రోడ్లపైకి రాలేని పరిస్థితి ఉండగా భారీ కాలుష్యాన్ని వెదజల్లే పాతకార్లు మాత్రం యేధేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయని భార్గవ చెప్పారు. వాస్తవానికి సుప్రీంకోర్టు నిషేధం ఉత్తర్వులు తమపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా కార్ల పరిశ్రమలో ప్రధాన వాటాదారుగా తాము ఆ నిషేధం పట్ల ఆందోళన చెందుతున్నట్టు ఆయన తెలిపారు. పాలసీలో దీర్ఘకాలిక స్థిరత్వం ఉండాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ కోరుతున్నట్టు ఆయన చెప్పారు. తరచుగా విధానాల్లో మార్పుల వల్ల మొత్తం పరిశ్రమ ప్రతికూల పవనాలు ఎదుర్కొని తయారీ రంగం దెబ్బ తింటుంది ఆయన హెచ్చరించారు. 2000 సిసి ఆ పైబడిన సామర్థ్యం గల డీజిల్‌ కార్లపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం అమలును ఏప్రిల్‌ 30 వరకు పొడిగించిన నేపథ్యంలో భార్గవ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.