Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 03:41AM

ఎక్కువ నిధులు


మర్పల్లి : ఏ గ్రామాల్లో అధికంగా ఇంటి, నీటి పన్నులు వసూలు చేస్తే ఆ గ్రామానికి అత్యధికంగా ప్రభుత్వం నిధులు అందుతాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ సభలో 23 అంశాలపై సభ్యులు, అధికారులు చర్చించారు. వ్యవసాయ సమీక్షలో వ్యవసాయాధికారులు సంవత్సరం క్రితం తీసుకున్న రుణాలపై వడ్డీ పడకుండా వెంటనే రీ షెడ్యూల్‌ చేసుకోవాలని సభ్యులకు సూచించారు. పశు పోషణ సమీక్ష జరుగుతుండగా పశువైద్యాధికారి ప్రసంగిస్తుంటే సభ్యులు వెంటనే లేచి మండలంలో ఏ గ్రామంలో కూడా వైద్యులు సక్రమంగా పనిచేయడం లేదని, ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారో తమకు తెలియడం లేదన్నారు. విద్య అంశంపై సమీక్ష జరుగుతుండగా సమావేశానికి మండల విద్యాధికారి హాజరు కాక పోవడంతో ఎమ్మెల్యే సంజీవరావు మండిపడ్డారు. మర్పల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సరైన ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదని ఒక్కొక్క ఉపాధ్యాయునితో పాఠశాల కొనసాగుతుందని సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా విద్యాధికారితో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సభ్యులకు హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య సమీక్ష నిర్వహిస్తుండగా సంబంధిత మండల వైద్యాధికారి గ్రామ సర్పంచులకు సమాచారం ఇవ్వకుండానే వంతుల వారిగా గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నారని గ్రామాల్లో వింత జ్వరాల భారిన పడిన సంబంధిత వైద్యాధికారులు స్పందించడం లేదని, ఇంత వరకు బ్లీచింగ్‌ పౌండర్‌ సరఫరా కాలేదని సభ్యులు వైద్యాధికారిపై మండిపడ్డారు. ఉపాధి హామీ కింద గత రెండు సంవత్సరాల క్రితం కల్కోడ గ్రామంలో 250 మంది కూలీలకు కూలీ డబ్బులు రాలేవని అధికారులను ఎప్పుడు ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆ గ్రామ సర్పంచ్‌ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లగా మండలంలో 18 గ్రామ పంచాయతీలలో రూ. 16 లక్షల వరకు కూలీ డబ్బులు గత ఏడాది కింద చెల్లించలేదని ఈ విషయం జిల్లా కలెక్టర్‌, పీడీ దృష్టికి తీసుకెళ్లిన నేటికి కూలీ డబ్బులు మంజూరు కాలేవని ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది జిల్లా చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న సకాలంలో బిల్లులు అందడం లేవని సభ్యులు అధికారులపై మండి పడడంతో ఇందిరమ్మ పథకంకింద మరుగుదొడ్లు నిర్మించకున్న బిల్లులు మంజూరయ్యాయని అలాంటి వారికి బిల్లులు ఇచ్చి నిజమైన లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వడం లేదని సభ్యులు పేర్కొన్నారు. ఆధార్‌కార్డు లింక్‌ చేసినప్పటికీ నిజమైన లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు రద్దవుతున్నాయని ప్రతి గ్రామంలో సుమారుగా 10 నుంచి 50 మంది వరకు లబ్ధిదారులు ఉంటారని సభ్యులు చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే ప్రజా ప్రతినిధులకు, అధికారులు సహకరించాలని, కొత్త రాష్ట్రం ఏర్పడడంతో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లో నిధుల కొరత ఉండడం వల్ల గ్రామాల్లో నిధులు మంజూరు కావడం లేదని అన్నారు. పంచాయతీ సెక్ర టరీలు, సర్పంచులు తక్షణం ఇంటిపన్ను, నీటి పన్ను వసూలు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక చాలా అస్తవ్యస్తంగా ఉందని, సరైన పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు లేక విద్యార్థులు పశువుల పాకలో చదివినట్లు అనిపిస్తుందన్నారు. జిల్లాలో అధికంగా రైతులు వర్షధార పంటలపై ఆధారపడి ఉన్నారని, అతివృష్టి , అనావృష్టితో పంటలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కొత్త కొత్త పథకాలు అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లోమంచినీటి సరఫరాకు ప్రతి ఇంటికి 24 గంటలు మంచినీటి అందించే సరికొత్త పథకాన్ని ప్రవేశ పెట్టబోతున్నారని ఆమె అన్నారు. అనంతరం ఆమె మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ సుమిత్రమ్మ, జడ్‌పీటీసీ శోభారాణి, జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ ప్రభాకర్‌ గుప్తా, ఎంపీడీవో దత్తాత్రేయరాజు. తహసీల్దార్‌ షాయేదాబేగం, ఎంపీటీసీలు ఫసియోద్దీన్‌, శేఖర్‌యాదవ్‌, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.