Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 02:59AM

మెడికల్‌ హబ్‌గా జిల్లా

తుమ్మలగుంట: జిల్లాను మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. దీనికిగాను పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను అభివృద్ధి చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన వైద్యం అందిస్తామన్నారు. తిరుపతిలోని రుయాస్పత్రి ఆవరణలోని చిన్నపిల్లల ఆస్పత్రి సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ఏపీలో అత్యాధునిక ఆస్పత్రులు లేకుండా పోయాయన్నారు. ఆ లోటును తీర్చడంకోసం తిరుపతి పరిసర ప్రాంతాల్లో మూడు వైద్య కళాశాలలను నెలకొల్పతామన్నారు. సీఎం చంద్రబాబు.. కేంద్రంతో తనకున్న పరిచయాలతో ఏపీకి రూ.1360 కోట్లు తీసుకొచ్చామన్నారు. వీటిలో అధిక మొత్తాన్ని జిల్లాకు కేటాయిస్తామన్నారు. అదేస్థాయిలో వైద్యులు, ఉద్యోగులూ బాధ్యతాయుతంగా పనిచేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. భగవంతుడితో సమానంగా పూజింపబడుతున్న వైద్యులు.. ఆ స్థానం నుంచి కిందకు దిగజారి పోకుండా రోగులకు ప్రేమానురాగాలతో వైద్య సేవలు అందించాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వాస్పత్రుల్లోని కొందరు వైద్యులు రోగులతో దురుసుగా ప్రవర్తిస్తూ, అవహేలనగా మాట్లాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారు ఇకనైనా మారాలన్నారు. సూపరింటెండెంట్లు, హెచ్‌వోడీలుగా పనిచేస్తున్న వైద్య నిపుణులు తమ హోదాలను డిగ్రీలుగా భావించి సొంత ఆస్పత్రులకు పరిమితం కావద్దని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ణీత వేళల ప్రకారం విధులు నిర్వర్తించాల్సిందేనని స్పష్టంచేశారు. సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని మంత్రి శ్రీనివాస్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రుల్లోని సమస్యలను జిల్లా వైద్యాధికారి దశరథయ్య, డీసీహెచ్‌ఎస్‌ సరళాదేవి మంత్రి దృష్టికి తెచ్చారు. పలు ప్రాథమిక, ఏరియా ఆస్పత్రుల్లో స్పెషలిస్టులు, గైనకాలజిస్టులు లేక కాన్పులకు ఇబ్బందిగా ఉందన్నారు. కొందరు ఎస్‌పీహెచ్‌ఎస్‌లు తమకు జిరాక్స్‌ మిషన్లు, ఫోన్‌ బిల్లులు, ఇతరత్రా పనులకు నిధులు రాకపోవడంతో ఇబ్బందుగా ఉందన్నారు. సకాలంలో ప్రసవ తల్లులకు సంబంధించిన డేటాను ఆన్‌లైన్‌లో అందించే అవకాశం లేకుండా పోతోందన్నారు. మరో 20 రోజుల్లో ఎక్కడా నిధులకు సంబంధించిన సమస్యలు రావని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు.
సిఫార్సులను సహించను
తనతో సఖ్యతగా ఉండే వాళ్లు కొందరు మంత్రితో చెప్పి పనులు చేయిస్తానని చెబితే నమ్మొద్దని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను సిఫార్సులు సహించనన్నారు. ‘రాజకీయంలో ఎంతోమందిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నా. ఇప్పుడు వారిని దూరంగా పెడితే మంత్రి కాగానే అహం పెరిగిందనుకుంటారు. అందుకనే అందరితో కలసిపోయి సరదాగా ఉంటున్నా. అలాగని ఎవరు చెప్పినా వినే వ్యక్తిని కాదు. సిఫార్సులపైన బదిలీలు, పదోన్నతులు ఇచ్చే అవకాశమే లేదు’ అని స్పష్టంచేశారు. జిల్లా వైద్యాధికారులుగా పోస్టింగ్‌ ఇచ్చే సమయంలో ఆరోగ్యపరంగా జిల్లాను ఎంత మేరకు అభివృద్ధి చేస్తారన్న హామీపత్రం తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
ప్రభుత్వాస్పత్రులకు ఆన్‌లైన్‌
ప్రభుత్వాస్పత్రుల్లో జనవరి నుంచి ఆన్‌లైన్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. తిరుపిలోని ఎస్వీ వైద్య కళాశాల ఆవరణలో శుక్రవారం ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్యం, భద్రతపై జరిగిన ఐదు జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖల అధికారుల వర్క్‌షాపులో మంత్రి మాట్లాడారు. తద్వారా ప్రభుత్వాస్పత్రులకు ఏయే మందులు.. ఎంత మేరకు కావాలనే వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపించే వీలుంటుందన్నారు. ఆ ఇండెంట్‌ ప్రకారం మందులనూ ప్రభుత్వం సకాలంలో

సరఫరా చేస్తుందన్నారు. ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచి.. దేవాలయాల్లా మార్చాలని సూచించారు. ఆ ఆస్పత్రికి వెళ్తే ఉన్న రోగం పోకనే కొత్త రోగం వస్తుందనే పేద రోగుల భావనను పోగొట్టాలన్నారు. ఆస్పత్రుల్లో బయోమెడికల్‌ వేస్ట్‌ నిర్వహణపై అవగాహన కల్పించడంతో పాటుగా రోగులకు అర్థమయ్యేలా తెలుగులో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో రోగులు, వారి సహాయకుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. దీనిపై ముందస్తుగా ప్రణాళిక తయారు చేసుకుని సమీప పోలీస్‌ స్టేషన్ల సహకారం తీసుకోవాలన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి భవన సదుపాయం కల్పిస్తామన్నారు. రోగికి సంబంధించిన సమాచారాన్ని వారికి అనౌన్స్‌మెంట్‌ ద్వారా తెలియపరిచే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ, భద్రత పరంగా ప్రభుత్వం అమలు చేయనున్న విధి, విదానాలను ఏపీహెచ్‌ఎంఐడీసీ ఎండీ రవిచంద్ర పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశాల్లో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు వెంకటరమణ, ఆదిత్య, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌, ఏపీహెచ్‌ఎంఐడీసీ ఎండీ రవిచంద్ర, ఆయుష్‌ విభాగ కమిషనరు వాసుకీ, ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, శానిటరీ కాంట్రాక్టర్లు, హెల్త్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.