desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 02:08AM

‘ఆదర్శం’ ఆగమాగం

(ఆంధ్రజ్యోతి, నల్లగొండ)
జిల్లాలో ఆదర్శ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. నాణ్యమైన చదువులుంటాయని పిల్లల్ని చేర్పించిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలవుతున్నాయి. బోధన, వసతి సౌకర్యాలు సర్కారు బళ్లకంటే దారుణంగా ఉండటంతో నివ్వెరపోతున్నారు. ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్న యోచనతో చేర్పిస్తే ఉన్న చదువు చట్టుబండలయ్యే పరిస్థితి ఏర్పడేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన పట్టింపు లేకపోవడంతో వేలాది నిరుపేద విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడేలా ఉంది.
బోధన డొల్ల
ఆదర్శ పాఠశాలల్లో బోధన నాణ్యత ఎలా ఉందో పరీక్షించేందుకు కలెక్టర్‌ టి.చిరంజీవులు ఇటీవల ఓ బృందాన్ని పంపారు. అక్కడికెళ్లిన అధికారులు బోధన నాణ్యతను చూసి అవాక్కయ్యారు. పర్ఫెక్ట్‌, బ్యూటిఫుల్‌ వంటి పదాలకు సైతం విద్యార్థులు స్పెల్లింగ్‌లు చెప్పలేని పరిస్థితి. ఉపాధ్యాయులతో పాఠం చెప్పించి పరీక్షించగా నాణ్యత ఏంటో బయటపడింది. ఆంగ్ల మాధ్యమంలో పాఠం చెప్పాల్సివుండగా పుస్తకాన్ని ఆంగ్లంలో చదువుతూ(అదీ తప్పుల తడకగా) తెలుగులో బోధిస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో సగానికి సగం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలావుంటే నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను ఇప్పటి వరకు కేటాయించలేదు. పూర్తి స్థాయి ప్రిన్సిపాళ్ల నియామకం జరగలేదు. ఉన్న ఉపాధ్యాయుల్లో సీనియర్లకే ప్రిన్సిపాల్‌ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాఠశాల లెక్కలు ఏ విధంగా రాయాలో వారికి తెలియని పరిస్థితి. ఆదర్శంగా ఉండాల్సిన నిర్వహణకుగాను ఎవరికి తోచిన రీతిలో వారు లెక్కలు రాసేస్తున్నారు. ప్రిన్సిపాళ్లు పాఠశాలలోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలుండగా అత్యధికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. ఉన్న వారిలో పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌ నుంచి వచ్చి వెళ్తున్నారు.
అతీగతీలేని సౌకర్యాలు
విద్యార్థులందరికీ హాస్టల్‌ వసతి సౌకర్యం కల్పించాల్సివుండగా ఇప్పటి వరకు దాని ఊసే లేకుండా పోయింది. కేవలం వంద మంది విద్యార్థినులకు మాత్రమే వసతి అని అధికారులు చెబుతున్నారు. అంటే ఏ ప్రాతిపదికన వారికి వసతి కేటాయిస్తారు, మిగిలిన విద్యార్థినుల పరిస్థితి ఏమిటనేదానిపై స్పష్టత లేదు. ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకే ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం ఉంది. మిగిలిన విద్యార్థులు బస్‌ పాస్‌కు డబ్బులు చెల్లించాల్సివస్తోంది. దీంతో విసిగిన తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించుకున్నా పోయేది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికంతటికీ ఒకటే పాఠశాల, కొన్ని చోట్ల రెండు మండలాలకు ఒకే పాఠశాల ఉండటంతో రవాణా సౌకర్యాలు సరిగా లేక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాంలు కూడా అందలేదు. జెండా వందనం సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు పంచేందుకు బడ్జెట్‌ కేటాయించలేదంటే ఈ పాఠశాలల ఆలనా పాలనా ఏ రీతిలో ఉందో తెలిసిపోతుంది. మధ్యాహ్న భోజన సమయంలో దొడ్డు రకం బియ్యాన్నే వండి వారుస్తుండటంతో ఊళ్లో ఉన్న సర్కారు బడికి మోడల్‌ స్కూలుకు తేడా లేకుండా పోయింది.
ప్రత్యేక శ్రద్ధతోనే పరిష్కారం
వివిధ ప్రాంతాలు, పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియం గాడిలో పడాలంటే రైటింగ్‌, రీడింగ్‌ స్కిల్స్‌ పెంచేందుకు బ్రిడ్జి స్కూల్‌ వ్యవస్థను వెనువెంటనే ఏర్పాటు చేయాల్సివుంది. పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ప్రిన్సిపాల్‌, బోధనా సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన, బోధనా నైపుణ్యం పెంచుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిపుణులు చెబుతున్నారు. హాస్టల్‌ వసతి, నాణ్యమైన భోజనం వంటివి కల్పిస్తేనే ఆదర్శ పాఠశాలలకు అర్థం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పాఠశాలలన్నింటికీ ప్రహరీ, రక్షణ ఏర్పాట్లు చేయాల్సివుంది. జిల్లాలోని 33 మోడల్‌ పాఠశాలల్లో సుమారు 16 వేల మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొనకపోతే ఈ వ్యవస్థ మనుగడకే ముప్పు ఏర్పడనుంది.