Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 02:03AM

చెంత కృష్ణమ్మ ఉన్నా...

కూతవేటు దూరంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల కుడి కాల్వ, అమరచింత ఎత్తిపోతల పథకాలు మండల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయినా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఆత్మకూర్‌ మండలంలోని చెరువుల పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకుల ముందుచూపు కొరవడడంతో పాటు మండలంలో, కొత్త నీటి పథకాల ప్రవేశంతో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన చెరువులను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పూడిక పేరుకుపోయి చెరువుల్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉండడం లేదు. వర్షాభావ సమయంలో చెరువులను నింపే మార్గం లేకపోవడంతో పంటలకు సాగు నీరు అందడం లేదు. ఇక చేసేది లేక రైతన్న వలస బాట పడ్తున్నాడు.
అమరచింత పెద్దచెరువు
ఈ చెరువును 200 ఏళ్ల క్రితం అమ్మాపూర్‌ సంస్థానాధీశులు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆయకట్టు 650 ఎకరాలు. ఈ చెరువు పూర్తి స్థాయిలో నిండితే... పామిరెడ్డిపల్లి, కొంకన్‌వానిపల్లి, పిన్నంచర్ల గ్రామాలకు సాగు నీరందడమే గాక, మరో ఐదు గ్రామాల పరిధిలోని వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పెరుగుతుంది. అయితే వర్షాభావం కారణంగా కొన్నేళ్లుగా చెరువు నిండడం లేదు. చెరువుకు ఓ పక్క అమరచింత ఎత్తిపోతల పథకం, మరోపక్క భూత్పూర్‌ రిజర్వాయర్‌ కాల్వ ఉన్నా నీరందని పరిస్థితి. దీంతో కేవలం వర్షాధారం ఆధారంగా 400 ఎకరాల్లోపే పంటలు పండుతున్నాయి. అమరచింత ఎత్తిపోతల పథకం, భూత్పూర్‌ రిజర్వాయర్‌ కాల్వ ద్వారా ఈ చెరువును నింపడంతో పాటు మినీ రిజర్వాయర్‌గా మారిస్తే ఇక్కడి రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం చెరువులో పిచ్చి మొక్కలు పెరగడమే గాకుండా అలుగు ప్రాంతం కంపచెట్లతో మూసుకు పోయింది.
ఆత్మకూర్‌ పరమేశ్వర స్వామి చెరువు
370 ఎకరాల ఆయకట్టు గల ఈ చెరువు నీళ్లు లేక వెలవెలబోతోంది. అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా కాల్వను ఏర్పాటు చేయగా పూర్తిస్థాయిలో నీళ్లు చేరడంలేదు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడంతో అలుగు ప్రాంతం, కట్ట దెబ్బతిన్నాయి. ప్రధానంగా కొత్తకోట, మహబూబ్‌నగర్‌, కురుమూర్తి జాతర, సీసీకుంట, హైదరాబాద్‌ నుంచి బస్సులు, భారీ వాహనాలు ఈ చెరువుకట్టపై నుంచి గద్వాల, ఆత్మకూర్‌ మండలాలకు రాకపోకలు సాగిస్తుండడంతో కట్ట ప్రమాదపుటంచుకు చేరుకుంది. చెరువు మనుగడే ప్రశ్నార్థకమైంది. అధికారులు, పాలకులు ముందస్తు చర్యల్లో భాగంగా కట్టకు అనువుగా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి. అదే సమయంలో అమరచింత ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే నీటితో పూర్తి స్థాయిలో ఈ చెరువు నిండేలా చర్యలు తీసుకోవాలి.
ఆరేపల్లి గ్రామ చెరువులు
150ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చెరువుల కింద మొత్తం 378 ఎకరాల ఆయకట్టు ఉంది. సంస్థానాధీశుల కాలంలో అమరచింత, అమ్మాపూర్‌, తిప్పడంపల్లి చెరువులు నీటితో కళకళలాడేవి. ఈ చెరువులు పూర్తి స్థాయిలో నిండితే రెండు పంటలకు సాగునీరు అందేది. పాలకులు, అధికారులు చెరువుల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం తగ్గిపోయింది. ఆయకట్టు సాగు పడిపోయింది. ఇక కృష్ణానది తీరాన ఉన్న వీరరాఘవపురం, రేచింతల, కత్తెపల్లి గ్రామాల నుంచి వాహనాలు నిత్యం ఈ చెరువు కట్టలపై నుంచే కొనసాగుతున్నాయి. దీంతో కట్టలకు బీటలు వారే ప్రమాదముందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
మూలమల్ల చెరువు
మూలమల్ల గ్రామ శివారులోని పెద్దచెరువు, ఊరచెరువులను కలిపి మూలమల్ల చెరువుగా స్థానికులు పిలుస్తారు. ఈ చెరువు ఒక్కసారి నిండితే నల్లచెరువు, కొత్తచెరువు, నల్లకుంట, దాసుమాస్‌ కుంట, వెంకట్‌రెడ్డి కుంట, సాయికుంటకు పుష్కలంగా నీరు చేరుతుంది. ఈ చెరువు, కుంటల కింద దాదాపు 250ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ చెరువులను పట్టించుకునే వారు లేకపోవడంతో పూడిక పేరుకుపోయి, పిచ్చి మొక్కలు మొలిచాయి. ఆయకట్టు సామర్థ్యం తగ్గింది.
నందిమళ్ల పెద్ద చెరువు
ఈ చెరువు సమీపంలో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా గుట్టను రాళ్లుగా మారుస్తున్నారు. అదే సమయంలో భూమి అడుగులోను రాళ్ల తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో సమీపంలోని నందిమళ్ల పెద్ద చెరువు మనుగడ ప్రశ్నార్థకమైంది. పక్కనే కృష్ణానది, జూరాల ఎడమ కాల్వ ఉన్నా చెరువును నింపుకోలేని పరిస్థితి. క్వారీ త్వకాలతో చెరువు కట్టకు పగుళ్లు రాగా, చుట్టుపక్కల బోర్లలో నీరు అడుగంటి పోయింది. చెరువులో పిచ్చిమొక్కలు పెరగ్గా కాల్వలు ధ్వంసమయ్యాయి.


చెరువు సమీపంలో
బ్లాస్టింగ్‌లను ఆపాలి
నందిమళ్ల చెరువు సమీపంలోని క్వారీ వద్ద చేపడుతున్న బ్లాస్టింగ్‌లను ఆపాలి. బ్లాస్టింగ్‌తో చెరువుకట్టకు ఇప్పటికే పగుళ్లు ఏర్పడ్డాయి. కాల్వలు ధ్వంసమయ్యాయి. బ్లాస్టింగ్‌లతో చెరువుతో పాటు సమీప ప్రాంతాల్లోని పొల్లాల్లో రాళ్లు పడుతున్నాయి. దీంతో సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. చెరువుకు మరమ్మతులు చేపట్టి జూరాల ఎడమ కాల్వ ద్వారా నీటిని నింపాలి.
- కురుమూర్తి, రైతు, నందిమళ్ల

అమరచింత చెరువును
మినీ రిజర్వాయర్‌గా మార్చాలి..
అమరచింత పెద్దచెరువును అమరచింత ఎత్తిపోతల పథకం, భూత్పూర్‌ రిజర్వాయర్‌ కాల్వద్వారా నీటితో చెరువును నింపి మినీ రిజర్వాయర్‌గా మార్చాలి. ఆయకట్టు కిందనున్న 650ఎకరాలను సాగులోకి తీసుకువచ్చి సమీపంలోని కుంటలు నిండేలా చర్యలు తీసుకోవాలి. చెరువులోని పిచ్చిమొక్కలు, జమ్ము, పూడికను తక్షణమే తొలగించాలి.
- శ్రీనివాస్‌రెడ్డి, రైతు, అమరచింత

చెరువుకట్టకు ఆనుకోని
బ్రిడ్జీని నిర్మించాలి...
ఆత్మకూర్‌ పరమేశ్వర స్వామి చెరువుకట్టను రోడ్డుగా వినియోగిస్తుండడంతో చెరువు మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. కట్టకు ఆనుకోని వాహనాల రాకకోసం బ్రిడ్జిని నిర్మిస్తే చెరువు కట్టను కాపాడుకోవచ్చు. చెరువును అమరచింత ఎత్తిపోతల కాల్వనుంచి పూర్తిస్థాయిలో నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలి.
- వెంకట్‌ నర్సింహరావు, రైతు,
ఎంపీటీసీ, ఆత్మకూర్‌థడ్ఫటర+