Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 01:43AM

కేంద్రం దృష్టికి కుక్కునూరు ఘటన

 ఏపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: హరీశ్‌
 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి
 అభివృద్ధికి సహకరించండి: శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌

తూప్రాన్‌/ఖమ్మం కల్చరల్‌/మెదక్‌, సెప్టెంబర్‌ 19: ఖమ్మం జిల్లా కుక్కునూరులో ప్రొటోకాల్‌పై ప్రశ్నించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై జరిగిన దాడిని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. శుక్రవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంపు మండలాలపై సమావేశం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు చెప్పకపోవడం, అడిగితే దాడులు చేయడాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యేపై దాడి చేయడం, పిడిగుద్దులు గుద్దడం అమానుషమన్నారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో బలవంతంగా కలుపుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి గిరిజనులపై ఉన్న ప్రేమ ఇదేనా, సీమాంధ్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా చేస్తుందా? జవాబు చెప్పాలన్నారు. గిరిజన ఎమ్మెల్యేపై జరిగిన దాడిని చంద్రబాబునాయుడు సమర్ధిస్తున్నారా? లేకుంటే ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఖమ్మంలో శుక్రవారం రోటరీక్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో రూ. 80 లక్షల విలువైన స్కూల్‌ బల్లల వితరణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం ఒక్క ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదని ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా అవసరమన్నారు. 25వేల పాఠశాలల్లో మూత్రశాలలు లేవని, 5వేల పాఠశాలల్లో మంచినీటి వసతి లేదని, 10వేల పాఠశాలల్లో కరెంటు సౌకర్యాలు లేవని గుర్తించామన్నారు. సిబ్బంది కొరత 70 శాతంకు పైగా పాఠశాలల్లో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ డా. ఇలంబరిది కుంచితపాదం, ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కవిత, రోటరీక్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులుపాల్గొన్నారు. మూడునెలల పసిగుడ్డు ప్రభుత్వానికి అన్నిపార్టీలు అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని పార్టీల సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుందని పేర్కొన్నారు. శాసన మండలి సమావేశంలో చర్చకు రాబోయే అన్ని విషయాలపై అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. చర్చలు ప్రజలకు మార్గదర్శకాలుగా ఉపయోగపడేటట్లు ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లిఖార్జున్‌గౌడ్‌ పాల్గొన్నారు