Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 12 2016 @ 12:40PM

ఆ ఇద్దరినీ కలపడం కోసం ‘బృందావనం’లో ఎన్టీఆర్‌లా మారిన చంద్రబాబు !

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సోమిరెడ్డి, ఆనం కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఎందుకొచ్చింది?... ఏడు దశబ్ధాలపాటు ఆ వైరం ఎందుకు కొనసాగింది?... ఇప్పుడెందుకు కలిసి పనిచేస్తున్నారు?.. టి.డి.పి శ్రేణులు ఏమంటున్నాయి?.. జనం ఏమని ముచ్చటించుకుంటున్నారు?
 
రాజకీయాలు బహు ఆసక్తికరం.. అందులోనూ పొలిటికల్‌ ఫ్యామిలీల రాజకీయాలు మరీనూ! ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లానే తీసుకోండి.. అక్కడ ఆనం, సోమిరెడ్డి కుటుంబాలు రాజకీయాలను శాసిస్తున్నాయి.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఈ రెండు కుటుంబాలు ఒకట్రెండు సందర్భాలు మినహాయిస్తే పూర్తి స్థాయిలో కలిసి పనిచేసిన దాఖలాలు లేనేలేవు. పవర్‌లో ఒకరుంటే ప్రతిపక్షంలో మరొకరుడు ఉండేవారు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమనేవారు.. దాదాపు ఏడు దశాబ్దాలు.. ఆ రెండు కుటుంబాల మధ్య వైరం అలాగే కొనసాగింది.. ఇప్పుడు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది..
 
మాజీ మంత్రి ఏ.సి.సుబ్బారెడ్డి కాలంలో ఆయన, ఆయన కుటుంబసభ్యులు ఒక గ్రూపుగా ఉండేవారు. వారికి వ్యతిరేకంగా మరో గ్రూపు ఉండేది.. అప్పట్లో ఆనం గ్రూపు...యాంటీ ఆనం గ్రూపు రాజకీయాలలో బలంగా పనిచేసేవి.. ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో ఆనం గ్రూపా..? యాంటీ ఆనం గ్రూపా అని చర్చించుకుంటూ ఉంటారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌ తండ్రి రాజగోపాల్‌ రెడ్డి.. యాంటీ ఆనం గ్రూపులో కీలకంగా ఉండేవారు. వారి కుటుంబసభ్యులందరూ ఆనమోళ్లకు వ్యతిరేకమే! సోమిరెడ్డి కుటుంబమే కాదు.. బెజవాడ పాపిరెడ్డి.. డీసీ కొండయ్య వంటి వారంతా యాంటీ ఆనం గ్రూపులో ఉండేవారు.
 
తదనంతర కాలంలోనూ ఆనం, సోమిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం అలాగే కొనసాగుతూ వచ్చింది. నగరంలో సోమిరెడ్డి కుటుంబానికి చెందిన శ్రీనివాసమహల్‌లో సాయంత్రం ఆరు దాటితే చాలు ఆనం వ్యతిరేకులంతా అక్కడకు చేరేవారు. జిల్లా రాజకీయాలపై అక్కడే పెద్ద ఎత్తున చర్చలు సాగుతూ ఉండేవి. అలీపురంలో వార్డుమెంబర్‌గా పోటీ చేసిన సోమిరెడ్డి రాజమోహన్‌రెడ్డిని ఓడగొట్టేందుకు ఆనం కుటుంబం అనేక వ్యూహాలు పన్నింది.. రాజకీయంగా ఎదగకుండా ఎంత చేయాలో అంతా చేసింది.. ఎంత వరకు అణగదొక్కాలో అంతవరకూ అణగదొక్కింది.. అయినా సరే రాజమోహన్‌ రెడ్డి నిరాశ చెందలేదు.. ఈ సమయంలోనే జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసే అవకాశం రాజమోహన్‌రెడ్డికి లభించింది. ఆయన ఆ పదవిలో కొనసాగుతున్న తరుణంలోనే కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీలిపోయింది.. ఇందిరా కాంగ్రెస్‌, రెడ్డి కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో దిగాయి.. జనతా పార్టీ తుపానులా విరుచుకుపడే సూచనలు కనిపించాయి. ఆ క్రమంలో ఆనం వెంకటరెడ్డి....ఆనం సంజీవరెడ్డిలు రాజమోహన్‌ రెడ్డి దగ్గరకు వెళ్లి టికెట్లను అడిగారు. ఎంతటి రాజకీయ వైరమున్నా వారిద్దరికి నెల్లూరు, సర్వేపల్లి టికెట్లు ఇచ్చారాయన. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో రాజమోహన్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఎన్టీఆర్‌ ఆహ్వానాన్ని రాజమోహన్‌ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు.
 
సెంట్రల్‌ బ్యాంకు ఎన్నికలప్పుడు అయితే అయిదేళ్ల పాటు ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధమే జరిగింది. ఆనమోళ్లు పాతిక ఎకరాల పొలం అమ్మితే... సోమిరెడ్డి కుటుంబం 30 ఎకరాల పొలం అమ్మింది.. ఈ డబ్బుతో రాజకీయాలు చేస్తూ పై చేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా అప్పట్లో యాంటీ ఆనం గ్రూపువైపే ఉండేవారు. రాజమోహన్‌ రెడ్డితో ఆయనకు మంచి రాజకీయ అనుబంధం ఉండేది. అప్పట్నుంచి నాయుడుగారికి సోమిరెడ్డి ఫ్యామిలీ అంటే అభిమానం. మొన్నటి సాధారణ ఎన్నికల్లో సోమిరెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. సోమిరెడ్డి నా బిడ్డలాంటి వాడు... ఆశీర్వదించండంటూ ఓట్లు అభ్యర్థించారాయన. మళ్లీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి అదే రోజు జిల్లా అధ్యక్ష పదవి చేపట్టారు. అదే రోజు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరి డీసీసీ అధ్యక్ష సీటులో కూర్చున్నారు.
 
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనమోళ్లపై సోమిరెడ్డి విరుచుకుపడేవారు. చిన్నపాటి తప్పు చేసినా ఎత్తి చూపేవారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉండేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు... సోమిరెడ్డి మంత్రి పదవిలో కొనసాగుతున్న సమయంలో ఆనమోళ్ల హడావుడి కూడా అదే రేంజ్‌లో ఉండేది. నిన్నమొన్నటి వరకు పాము ముంగీసల్లా ఉండేది వీరి రాజకీయ వ్యవహారశైలి.. ఇటీవల ఆనం బ్రదర్స్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నెల్లూరుకి వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అవసరాలకి... భారీ యంత్రాలు తరలిస్తున్న వాహనాలకి పచ్చజెండా ఊపారు.
 
ఆ కార్యక్రమంలో... ఇదిగో... ఇలా... రాజకీయ శత్రువులు.. ఆనం వివేకా... సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు భుజాలపై చేతులేసుకుని కనిపించారు. అంతే కాదు.. వివేకాని మాట్లాడమంటే.. సోమిరెడ్డి అన్న ముందు మాట్లాడతారన్నారు. నీరు తాగడం తప్పా.. సాగుచేయడం చేతకాదని వివేకా అంటే... తాగడమంటే మద్యం అనుకునేరు.. వివేకాకి మద్యం తాగే అలవాటు లేదంటూ సోమిరెడ్డి ఛలోక్తులు విసిరారు. ఇలా... ఉప్పునిప్పులా ఉండే రాజకీయ శత్రువులు... సడన్‌గా మంచి మిత్రులుగా మెలగడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయినా రాజకీయాలలో ఇవన్నీ కామనే కదా! రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి తెలిసిందే కదా! ఏదైతేనేం... ఏడు దశాబ్దాల రాజకీయ వైరానికి ఇప్పుడు ముగింపు వచ్చింది..