Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 22:07PM

ఆయన అన్నట్టే మళ్లీ పుట్టారు! - ధర్మవరపు కృష్ణజ

‘‘సినిమాల ప్రస్తావన మా ఇంట్లో ఉండేది కాదు. షూటింగ్‌ ముచ్చట్లను మా వారు ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఇంట్లో సినిమా వాతావరణం కనిపించేది కాదు’’ అని అంటున్నారు ధర్మవరపు కృష్ణజ. ఽప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సతీమణి కృష్ణజ. శనివారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్భంగా కృష్ణజ ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విషయాలు..‘‘మాది గుంటూరు. కానీ నా చిన్నతనంలోనే మానాన్నగారు హైదరాబాద్‌లో స్థిరపడటంతో పుట్టిపెరిగిందంతా ఇక్కడే. పెళ్లికి ముందు ఆఫీస్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేసేదాన్ని. మా పెళ్లి కుదిరాక మానేశాను. మా పెళ్లినాటికే మావారు హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ విడుదలైంది. ఆ తర్వాత కూడా సినిమాల్లో వరుసగా పాత్రలు ధరిస్తూనే ఉండేవారు. సినిమా రంగం గురించి మేం ఎప్పుడూ ఆయనవద్ద అభద్రతా భావాన్ని వ్యక్తం చేయలేదు. సినిమాల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆయనా మాకెప్పుడూ చెప్పలేదు. అప్పుడప్పుడూ ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. ఆయనతో మేం చూసిన చివరి సినిమా రంగుల్లో విడుదలైన ‘మాయాబజార్‌’. ఆయన చేసిన సినిమాలన్నీ నేను టీవీల్లో చూసేదాన్ని.’’
ఎస్వీ రంగారావు అంటే ఇష్టం
‘‘మా వారు ఎప్పుడూ ఏదో ఒకటి చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేవారు. ఇంట్లో చిన్నపాటి లైబ్రరీ ఉంది. అప్‌డేట్‌గా ఉండటం ఆయనకిష్టం. పాత సినిమాలను చాలా ఆసక్తిగా చూసేవారు. అందులోనూ ఎస్వీరంగారావుగారి చిత్రాలను మరీ ఇష్టంగా చూసేవారు. ఆయన నటించిన సినిమాల్లో లెక్చరర్‌ పాత్రలన్నీ ఆయనకిష్టమే. లెక్చరర్‌గా తాను బాగా సూటవుతానని చెప్పేవారు. . సినిమాల్లో ఎంత సరదాగా ఉండేవారో ఇంట్లో అంతే సరదాగా ఉండేవారు. ఆయనుంటే అంతా సందడిగా ఉండేది. పిల్లల్ని సినిమాల్లోకి తీసుకురావాలనే ఆశలు ఆయనకు లేవు. పిల్లలకు కూడా సినిమాల్లోకి రావాలని లేదు. వాళ్లను ఉన్నత స్థానాల్లో చూడాలనుకునేవారు. ఆయన కోరుకున్నట్టే పెద్దబ్బాయి రోహన్‌ సందీప్‌ కన్‌స్ట్రక్షన్‌ రంగంలో మంచి స్థాయిలో ఉన్నాడు. చిన్నబ్బాయి రవిబ్రహ్మతేజ బి.కామ్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. తనకు నచ్చిన కెరీర్‌ను ఎంపిక చేసుకుని వృద్ధిలోకి రమ్మని చెప్పాను.’’
కలిసి మెలిసి
‘‘ముద్దపప్పు, చింతకాయ పచ్చడి, గుత్తివంకాయ, దోసకాయ పచ్చడి, దోసకాయ పప్పు, కజ్జికాయలు, కారప్పూస, సున్నుండలు.. ఇలా కొన్ని వంటలను, పిండి వంటలను ఇష్టపడి తినేవారు. నేను పూజలు, వ్రతాలు తప్పక చేసుకునేదాన్ని. ఆయన దణ్ణం పెట్టుకునేవారు కానీ అదే పనిగా దేవుళ్లను కొలిచేవారు కాదు. ఆయనకు తీరని కోరికలు కూడా ఏమీ లేవు. జీవితాన్ని ప్రణాళిక బద్ధంగా గడిపారు.’’
ధీమాగా ఉండేవారు
‘‘ఆయనకి కేన్సర్‌ సోకిందని వైద్యులు చెప్పినప్పుడు కూడా అదేం చేయదనే ధీమాతోనే ఉన్నారు. మళ్లీ కోలుకుంటానని, ఎప్పటిలాగా చురుగ్గా ఉంటానని చెప్పేవారు. కానీ ఆఖరి స్టేజీలో ఆయనకే అర్థమైందేమో.. తప్పక మళ్లీ పుడతానని, మేం అందరం కలిసి మెలిసి ఉండాలని చెప్తుండేవారు. ఆయన అన్నట్టుగానే మా కుటుంబంలో మళ్లీ పుట్టారు. మా కోడలు జూన్‌ 8న మగపిల్లాడికి జన్మనిచ్చింది. బాబు చూడ్డానికి అచ్చం ఆయనలాగే ఉన్నాడు. మళ్లీ పుడతాననే ఆయన మాట నిజం చేసుకున్నారనిపించింది. మనవడికి పృథ్వివరసుబ్రహ్మణ్యం అని ఆయన పేరు కలిసొచ్చేలా నామకరణం చేశాం.’’
మనిషి ఉన్నప్పుడే
‘‘ఏదైనా మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. మనిషి దూరమైనప్పుడు ఇంకోలా ఉంటుంది. ఆయన లేని లోటును భరించే శక్తిని మాకు భగవంతుడు మనవడి రూపంలో ప్రసాదించాడు. ఆయన పోయిన కొత్తల్లో సినిమా వాళ్లు ఫోన్లు చేసి పలకరించేవారు. ఆ తర్వాత ఆ పలకరింపులు కూడా తక్కువయ్యాయి. సినిమాల్లో ఉన్నన్నాళ్లు ఆయన అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అందరితో కలిసి మెలిసి ఉండేవారు. ఇప్పటికీ ఆయనకు ఆ మంచి పేరు ఉంది. మాకు అది చాలు.