Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 03:57AM

మట్కా , పేకాట కేంద్రాలపై ఉక్కుపాదం

వరంగల్‌ క్రైం : మట్కా, పేకాట కేంద్రాల నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ శర్మ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం రాష్ట్రంలోని జిల్లా ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో అర్బన్‌ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, అర్బన్‌ పోలీస్‌ అధికారులు టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సమావేశంలో డీజీపీ వరంగల్‌ అర్బన్‌ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిపై అర్బన్‌ ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడే దిశగా అర్బన్‌ పరిధిలో చేపడుతున్న చర్యలను అర్బన్‌ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు డీజీపీకి వివరించారు.
టెలీ కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు వెంటనే స్పందించాలని, రాబోయే బతుకమ్మ, దసరా, బక్రీద్‌ పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గోవధ నిషేధ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చర్య లు తీసుకోవాలని వధశాలలకు ఆవులను అక్రమంగా తరలించే వాహనాలను గుర్తించేందుకు పోలీస్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.
మధ్య తరగతి కుటుంబాల ప్రజల ఆర్థిక సమస్యలకు కారణమవుతూ కుటుంబాలను వీధిపాలుచేస్తున్న మట్కా జూదాన్ని నిరోధించడంలో అధికారులు శ్రద్ధ వహించాలని డీజీపీ తెలిపారు. చట్ట వ్యతిరేకంగా మట్కా, జూదం నిర్వహించే కేంద్రాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. నివాస ప్రాంతాలలో నిర్వహించే పేకాట కేంద్రాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెదలుతూ ప్రజల అభిమానాన్ని చూరగొనాలని డీజీపీ వివరించారు.
సమావేశం అనంతరం డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ వెంకటేశ్వర్‌రావు అర్బన్‌ పోలీసులతో మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టంపై పోలీస్‌ సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్నారు. వరంగల్‌ అర్బన్‌ పరిధిలోని స్టే.ఘన్‌పూర్‌, మామునూరు, ఆత్మకూరు, హసన్‌పర్తి, ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌ల సరిహద్దులలో వాహనాలను తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అర్బన్‌ అదనపు ఎస్పీ యాదయ్య, ఓఎస్డీ నాగరాజు, స్పెషల్‌ బ్రాంచ్‌, వరంగల్‌, హన్మకొండ, కాజీపేట, మామునూరు, ట్రాఫిక్‌, క్రైం, డీఎస్పీలు జనార్దన్‌, హిమవతి, దక్షిణమూర్తి, రాజిరెడ్డి, సురేష్‌కుమార్‌, ప్రభాకర్‌, రాజ మహేంద్రనాయక్‌, కమ్యూనికేషన్స్‌ ఎస్సై ప్రవీన్‌ పాల్గొన్నారు.