Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 23:04PM

అంతు చూస్తాం రండి..!.. అమెరికాకు ఐసీస్‌ హెచ్చరిక

బీరుట్‌/వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 18: ‘ఇరాక్‌కు అమెరికా బలగాలను పంపుతుందా? సరే.. పంపమనండి. వారి కోసమే మా బలగాలు ఎదురుచూస్తున్నాయి.’ అని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ సమరోత్సాహం ప్రదర్శిస్తోంది. ఇరాక్‌, సిరియాల్లో ఐసిస్‌ను ఎదుర్కోవడానికి ఇరాక్‌ బలగాలకు సహాయంగా గగనతల దాడులు చేస్తున్న అమెరికా... వాటిని మరింత విస్తృతపర్చి సమర్థవంతంగా నిర్వహించడంపై ప్రస్తుతం వ్యూహాన్ని ఖరారు చేసే పనిలో ఉంది. ఒకవేళ గగనతల దాడులు విఫలమైతే అమెరికా దళాలను ఇరాక్‌కు పంపే అవకాశముందని జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ మార్టిన్‌ డెంసే వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఐసిస్‌ ఈ విధంగా స్పందించింది. ఈ మేరకు తాజాగా 52 సెకన్ల నిడివి గల వీడియోను విడుదల చేసింది.
ట్యాంకుల పేల్చివేత, గాయపడ్డ అమెరికా సైనికులు ఈ వీడియోలో ఉన్నారు. ఇది కేవలం ఒక ట్రైలర్‌ మాత్రమేనని, ఒక భారీ వీడియోకు సన్నాహంగా ముందు దీన్ని విడుదల చేసినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇరాక్‌, సిరియాల్లో మరింత పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఐసిస్‌... ఇప్పుడు సిరియా స్కూళ్లపైన దృష్టి పెట్టింది. గణితం, సామాజిక శాస్ర్తాలను ఇకపై బోధించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు, ప్రజాస్వామ్య అంశాలను కూడా విద్యార్థులకు నేర్పరాదని పేర్కొంది. కాగా, ఇరాక్‌లో కేవలం స్థానిక బలగాలకు సహాయంగా మాత్రమే తాము వైమానిక దాడులు చేస్తాం తప్ప ప్రత్యక్షంగా యుద్ధానికి దిగబోమని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు. ఐసిస్‌ బెడదతో సతమతమవుతున్న ఇరాక్‌, సిరియాలకు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, బందీగా తీసుకున్న బ్రిటన్‌ పౌరుడిని విడుదల చేయాలని బ్రిటన్‌లోని వందకుపైగా ప్రముఖ ముస్లిం మత గురువులు, సంస్థలు ఐసిస్‌కు విజ్ఞప్తి చేశాయి.
ఒకవైపు సిరియాలో ఐసిస్‌కు వ్యతిరేకంగా అమెరికా వైమానిక దాడులు చేస్తుంటే... ఐసిస్‌ తరఫున పోరాడేందుకు సిరియా వెళ్తున్న అమెరికన్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. వివిధ దేశాల నుంచి సుమారు 15 వేల ఇప్పటికే సిరియా వెళ్లినట్లు ఒక అంచనా. కాగా, వీరిలో సుమారు వంద మంది వరకూ అమెరికన్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు, సిరియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న డజనుకుపైగా అమెరికన్లను ప్రభుత్వం అరెస్టు చేసింది.