Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 02:45AM

గతంలో జరగలేదుగా!


- మేం నిర్ణయం తీసుకోలేదు
- గత ప్రభుత్వాల నిర్ణయాల్లో
మంచిని స్వీకరిస్తాం
- ‘సెప్టెంబర్‌ 17’పై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సంస్థానం..భారత యూనియన్‌లో అంతర్భాగమైన సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహించిన చరిత్ర లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘‘గతంలో అలా జరగలేదుగా’’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అయినా, ఈ అంశంపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు, గత ప్రభుత్వాల నిర్ణయాల్లో మంచి ఉంటే స్వీకరిస్తామంటూ..పరోక్షంగా ‘సెప్టెంబర్‌ 17’పై సర్కారు స్వరం వినిపించారు. అయితే, పార్టీ పరంగా గత సంప్రదాయాన్నే (విలీన దినంగా నిర్వహించారు) కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బుధవారం వేర్వేరు రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో జరగనున్న ‘వేడుక’లపై తెలంగాణ అంతటా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ స్వాతంత్య్ర దినంగా జరపాలి!
రోశయ్య భేషజాలకు పోరాదు
చంద్రబాబుని ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోలేదు

‘‘ప్రపంచంలో 600 కోట్ల జనాభా ఉంటే, స్వాతంత్య్ర దినం జరుపుకోలేని ప్రాంతం తెలంగాణ ఒక్కటే. రోశయ్య గారు( అప్పటి సీఎం) పెద్ద మనిషి. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, భేషజాలకు పోకుండా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా తెలంగాణ స్వాతంత్య్ర దినంగా జరపాలి. ఇదే డిమాండ్‌ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినప్పటికీ, ఆయన అంగీకరించలేదు’’
(2010, ఆగస్టు 19న తెలంగాణ భవన్‌లో వరంగల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా..)
ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్యశ్రీ
సెప్టెంబర్‌ 17ను అధికారికంగా జరపాలి
దమ్ముంటే టీ కాంగ్రెస్‌ నేతలు
రోశయ్య మెడలు వంచాలి
మనం చరిత్ర మరిచి
ఆంధ్రాకు బానిసగా ఉండాలా?

‘‘కాంగ్రెస్‌ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు చిలక పలుకులు పలకటం కాదు. వారికి దమ్ముంటే సీఎం రోశయ్య మెడలు వంచి అధికారికంగా సెప్టెంబర్‌ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా జరిపించటానికి ఒప్పించాలి. లేకపోతే వాళ్లు రాజీనామా చేయాలి. వారంతా రాజీనామా చేస్తే రోశయ్య ప్రభుత్వం ఉంటుందా? వారు తెలంగాణ కోసం పనిచేయరు. అలాగని రాజీనామాలూ చేయరు. మేం మాత్రం అధికారికంగా సెప్టెంబర్‌ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా జరిపించాలనే డిమాండ్‌తో ఆందోళన చేయబోతున్నాం. ప్రభుత్వం మెడలు వంచి అధికారికంగా సెప్టెంబర్‌ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా ప్రకటింపజేసుకుంటాం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి మర్చిపోయి.. ఆంధ్రాకు బానిసగా బతకాలా ?’’
(2010, ఆగస్టు 20న తెలంగాణ భవన్‌లో టీడీపీకి చెందిన కరీంనగర్‌ జిల్లా కోహెడ జట్పీటీసీ సభ్యుడు కర్ర శ్రీహరి, పలువురు ఆ పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మెదక్‌, నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా..)
పక్కనే ఉన్న బళ్లారిలో
స్వాతంత్య్ర దినం జరపటం లేదా?
జేసీకి ఎంత పొగరు

‘‘రాష్ట్రంలో ఒక్కసారే స్వాతంత్య్ర దినోత్సవం చేస్తారు.. ఎన్నిసార్లు చెప్తారు’ అంటూ మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి నిర్లక్ష్యంగా వెళ్లారు. ఆయనకెంత పొగరు? ఇది దుర్మార్గం కాకపోతే, ఆయన సొంత జిల్లా అనంతపురం పక్కనే ఉన్న బళ్లారిలో స్వాతంత్య్ర దినం జరపటంలేదా? తెలంగాణ విషయంలో జేసీకి ఎందుకింత అహంకారం? తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు దమ్ముంటే, పౌరుషం ఉంటే, రోశయ్య మెడలు వంచి సెప్టెంబర్‌ 17ను అధికారికంగా తెలంగాణ స్వాతంత్య్ర దినంగా జరిపించండి. తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలో ప్రజలకు తెలుసు. సెప్టెంబర్‌ 17పై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనకు దిగుతాం’’
(2010, ఆగస్టు 23న తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్‌ ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా..)