Sep 16 2014 @ 22:43PM

గుణపాఠం

మంగళవారం నాడు వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు కొందరికి ఆశావహంగాను, మరికొందరికి దిగ్ర్భాంతికరంగానూ ఉన్నప్పటికీ, అందరికీ మాత్రం విస్మయాన్ని కలిగించాయి. నరేంద్రమోదీ, ములాయం సింగ్‌ యాదవ్‌, కె.చంద్రశేఖర్‌ రావు ఖాళీ చేసిన పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వారి వారి పార్టీలకే అనుకూల ఫలితాలు లభించాయి. వివిధ కారణాల వల్ల తొమ్మిది రాషా్ట్రలలోని 32 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయి. నాలుగు నెలల కిందట అద్భుతమైన జనాదరణతో కేంద్రంలో అధికారానికి వచ్చిన భారతీయ జనతాపార్టీ 24 సిట్టింగ్‌ స్థానాలకు గాను కేవలం పదమూడింటిలో మాత్రమే గెలుపొందింది. ఉత్తరప్రదేశ్‌ను దాదాపుగా తుడిచిపెట్టిన బీజేపీ, ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన పది అసెంబ్లీ స్థానాలలో ఏడింటిలో ఓడిపోయింది. మిత్రపక్షం అప్నాదళ్‌కు చెందిన ఒక స్థానంతో పాటు, మొత్తం పదకొండూ బీజేపీ కూటమివే. ఇటీవలనే అనూహ్యమైన ఫలితాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్‌లో కూడా ఉప ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎన్నికలు జరిగిన బీజేపీ స్థానాలు నాలుగింటిలో మూడింటిని కాంగ్రెస్‌ గెలుచుకుంది. గుజరాత్‌లో ఎన్నికలు జరిగిన తొమ్మిది స్థానాలలో కాంగ్రెస్‌ మూడింటిని గెలుచుకోగా, ఆరు విజయాలతో తక్కిన చోట్ల కంటె కాస్త మెరుగైన ఫలితాలను బీజేపీ సాధించింది. పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారిగా ఒక స్థానం గెలుచుకోవడం ఒక్కటే మొత్తం మీద బీజేపీకి చెప్పుకోదగ్గ విజయం.
ఘనవిజయంతో అట్టహాసంగా అధికారం చేపట్టిన బీజేపీకి ఏమయింది? దేశాన్నంతా చుట్టబెట్టి, స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా కాంగ్రెసేతర పక్షానికి అధికస్థానాలు సాధించగలిగిన నరేంద్ర మోదీ ఇంద్రజాలం ఏమయింది? కొత్త పాలన, కొత్త వాగ్దానాలు, కొత్త విదేశాంగం, కొత్త ఆర్థికం- ఇవన్నీ ఏమయినాయి? ఎందుకు బీజేపీకి ఉప ఎన్నికలలో వరుస అపజయాలు సిద్ధిస్తున్నాయి. బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికలలో లాలూ-నితీశ్‌ పొత్తు బీజేపీ విజయోత్సాహం మీద తొలిసారిగా నీళ్లుచల్లగా, ప్రస్తుత ఉప ఎన్నికలు పెద్ద దెబ్బతీసి, ప్రమాద హెచ్చరికలు చేస్తున్నాయి. నాలుగు పదుల లోక్‌సభ స్థానాలతో కుంగిపోయిన కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు కాసింత ఊపిరి పోస్తున్నాయి, కూడగట్టుకోగలిగితే కొత్త బలాన్ని ఇస్తున్నాయి. వచ్చే నెలలో మహారాష్ట్రలో, హర్యానా అసెంబ్లీల ఎన్నికలలో గౌరవప్రదమైన పోటీ ఇవ్వగలిగే శక్తిని ఇస్తున్నాయి. కాంగ్రెస్‌ కోలుకోవడం తరువాతి మాట, బీజేపీకి, మోదీకి ఇంత త్వరగా పతనం ఎట్లా మొదలయింది? 2014 ఎన్నికలలో కనిపించిందంతా గాలిబుడగ సంచలనమేనా?
సంవత్సరంపాటు కష్టపడి, పద్ధతి ప్రకారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన నరేంద్రమోదీ ప్రతిభాసామర్థ్యాలను ఎవరూ కాదనలేరు. అతని తోడుగా ఉంటూ విజయవ్యూహాన్ని రచిం చిన అమిత్‌ షా చాణక్యాన్ని కూడా ఎవరూ నిరాకరించలేరు. కానీ, మీడియా పెద్దగొంతు పెట్టుకుని చేసిన అనుకూల ప్రచారం వల్ల - 2014 సార్వత్రిక ఎన్నికలను శాసీ్త్రయంగా విశ్లేషణ చేసే పని కూడా జరగలేదు. ఆ ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్ని? ముప్పై శాతం మాత్రమే. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సమయానికి బీజేపీ మూడు పెద్ద రాషా్ట్రలలో మాత్రమే సొంతంగా అధికారంలో ఉన్నది. మోదీ ప్రచారం కానీ, షా వ్యూహం కానీ ఎన్నికల ఫలితాలను చాకచక్యంగా రాబట్టడమే తప్ప, నిజంగా వారి పార్టీకి పునాది బలాన్ని సమకూర్చడం కాదు. పార్టీ విజయానికి తన దోహదం కారణంగా అధ్యక్షపదవిని కూడా పొందిన అమిత్‌ షా మంత్రం ప్రభావం మరి ఇప్పుడేమయింది? ముజఫర్‌నగర్‌ సంఘటనలు యూపీలో ఎన్నికల గణితాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చినట్టు చెబుతారు. ఈ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు అటువంటి ఫలితాలనే ఇచ్చి ఉండాలి. కానీ, ఇవ్వలేదు. బీహార్‌లో మాదిరిగా బీజేపీ యేతర పార్టీలన్నీ యూపీలో ఒకటి కాలేదు. కాకపోతే, ఉప ఎన్నికల పోటీ నుంచి బీఎస్‌పీ దూరంగా ఉన్నది. లౌకికవాద ఓట్లన్నీ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులకే పడినందువల్ల అక్కడ విజయం సాధ్యమయింది. బీహార్‌ తరువాత యూపీ అందిస్తున్న ఈ సందేశాన్ని కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు గమనిస్తున్నాయా? ద్వేషభాషను, ప్రచారాన్ని ప్రజలు సహించబోరన్న నమ్మకం వారికి కలుగుతున్నదా? రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీయేతర పక్షాలు అనుసరించే వ్యూహంలో వారికి జ్ఞానోదయం అయిందో లేదో తెలుస్తుంది.
ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి నరేంద్రమోదీ పెద్దమనిషిగా, సాత్వికునిలా వ్యవహరిస్తున్నారు. ప్రశంసనీయమైన ప్రసంగాలు చేస్తున్నారు. పన్నెండేళ్ల కిందట తీవ్ర మయిన ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఈయనేనా అనిపించేలా ప్రవర్తిస్తున్నారు. అయితే, ఆయన వ్యవహారసరళిలో కనిపిస్తున్న పరిణతి, బీజేపీకి చెందిన కొన్ని శ్రేణులలో కనిపించడం లేదు. మతపరమైన విభజనకు దారితీసే కార్యాచరణను వారు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీలురు, లౌకికవాదులు భయభ్రాంతులయ్యేలా కూడా కొందరి వైఖరి ఉంటున్నది. ఇటువంటి ధోరణులకు భారతదేశంలో స్థానం లేదు. ప్రజలు కృత్రిమమైన, కల్పితమైన విభజన ధోరణులను సహించరు. నరేంద్రమోదీపై ఆశలు పెట్టుకున్నవారు సైతం వారి సామాజికార్థిక జీవనప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశతోనే ఓటువేశారు తప్ప, మతం కోసం నెత్తురు ధారపోయడానికో, లవ్‌జిహాద్‌ల చర్చ చేయడానికో కాదు. భారతీయ జనతాపార్టీలోని పెద్దలు, రాజనీతిజ్ఞులు ఈ పద్ధతులను ప్రశంసించరు. అటువంటి విజ్ఞులు ఇప్పుడు దురదృష్టవశాత్తూ అప్రధానులై పోయారు. పార్టీ నాయకత్వ శ్రేణిలో సమతుల్యత, అనుభవజ్ఞత లోపించింది.
ఈ ఉప ఎన్నికలు కేంద్రంలోని అధికారపార్టీకి హెచ్చరిక పంపాయి. దానిని గమనించి సరిదిద్దుకుంటే, దారితప్పిన వారి గమనం మళ్లీ వేగం పుంజుకుంటుంది. లేకపోతే, ఈ అవరోహణ కొనసాగుతుంది.