Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 04:10AM

ఉప్పల్‌లో మళ్లీ క్రికెట్‌ సందడి


చాంపియన్స్‌ లీగ్‌ టి-20కి పటిష్ట భద్రత
స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు
1200 మందితో బందోబస్తు
సెల్‌ఫోన్లు, కెమెరాలు, వాటర్‌ బాటిళ్లు అనుమతించరు
మ్యాచ్‌ జరిగే తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
ఉప్పల్‌ : ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో చాంపియన్స్‌ టీగ్‌ టి-20 క్రికెట్‌ మ్యాచ్‌లకు సైబరాబాద్‌ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 17, 21, 24, 29, అక్టోబర్‌ 2 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు భద్రతతో పాటు, ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు సైబరాబాద్‌ పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ గంగాధర్‌ తెలిపారు. ట్రాఫిక్‌ డీసీపీ అవినాష్‌ మహంతి, డీసీపీ కోటేశ్వర్‌రావుతో కలిసి శనివారం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో విలేకరులతో మాట్లాడారు. మ్యాచ్‌ నిర్వహణకు తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లను వెల్లడించారు. మ్యాచ్‌ నిర్వహణకు సుమారు 12 వందల మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నట్టు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేడియాన్ని అధీనంలోకి తీసుకున్నామని, స్టేడియం చుట్టూ ఉన్న 56 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించేలా స్టేడియంలో ఓ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈసారి ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేశామని చెప్పారు. మ్యాచ్‌ ముగిసే వరకు బాంబు డిస్పోజల్‌ టీమ్‌లు నిరంతరం స్టేడియాన్ని తనిఖీ చేస్తుంటాయని చెప్పారు. వీటికితోడు అక్టోపస్‌ పోలీసులు, క్విక్‌ రియాక్షన్‌ టీములు, సంఘవ్యతిరేక శక్తుల కార్యకలాపాలను పసిగట్టే ప్రత్యేక పోలీసు బృందాలు కూడా పనిచేస్తాయని ఆయన చెప్పారు. సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ చెన్నయ్య, ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ట్రాఫిక్‌ ఆంక్షలు...
ఫ మ్యాచ్‌లు జరిగే తేదీల్లో ఉప్పల్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటు ఉప్పల్‌ వైపు భారీ వాహనాలను పోలీసులు అనుమతించరు. వరంగల్‌, ఎల్బీనగర్‌ వైపు నుంచి హబ్సిగూడ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్‌ రింగురోడ్డు, చెంగిచెర్ల మీదుగా మల్లాపూర్‌, ఈసీఐఎల్‌ మీదుగా వెళ్ళాలి. నగరం నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ నుంచి మల్లాపూర్‌ బ్రిడ్జి, చెంగిచెర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.