Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 16 2014 @ 02:39AM

ఏపీయే హీరో
ఆంధ్రాకే ద్విచక్ర వాహన ప్రాజెక్ట్‌
అనుకున్నది సాధించా!


వంద రోజుల్లో ఒక్కటైనా తేవాలనుకున్నా
‘హీరో’ రాకతో శ్రమ ఫలించింది
టొయోటా కూడా వచ్చే చాన్సుంది
కేబినెట్‌ భేటీలో చంద్రబాబు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి భారీ పరిశ్రమను సాధించింది. దక్షిణాదిలో తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఊగిసలాడిన ‘హీరో’ సంస్థ చివరికి ఆంధ్రప్రదేశ్‌నే ఎంచుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. ‘హీరో’ ద్విచక్ర వాహన సంస్థకు చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌ సమీపంలో 600 ఎకరాలు కేటాయించనున్నారు. మంగళవారం ఈ సంస్థ ప్రతినిధులు
హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ విషయాన్ని బాబు సోమవారం జరిగిన కేబినెట్‌ భేటీలో తెలిపారు. ‘ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో కొత్త రాషా్ట్రనికి ఒక్క భారీ పరిశ్రమనైనా తేవాలని అనుకున్నాను. తీసుకురాగలిగాను’ అంటూ ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. హీరో మోటార్స్‌ తన కర్మాగారాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని కేబినెట్‌ సమావేశంలో ప్రకటిస్తూ... చంద్రబాబు ఈ వ్యాఖ్య చేసినట్లు తెలిసింది. ‘‘రాష్ట్రానికి ఆటోమొబైల్‌ పరిశ్రమ తేవాలని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గట్టిగా ప్రయత్నించాను. ఫోక్స్‌వ్యాగన్‌ కార్ల ఫ్యాక్టరీ వచ్చినట్లే వచ్చి కాంగ్రెస్‌ నేతల నిర్వాకంతో పోయింది. ఇప్పుడు హీరో కోసం నా స్థాయిలో చాలా ప్రయత్నాలు చేశాను. ఢిల్లీలో ఆ కంపెనీ చైర్మన్‌ నివాసానికి వెళ్లి మాట్లాడాను. రాష్ట్రంలో ప్లాంట్‌ ఏర్పాటుకు మన మీద నమ్మకంతో అంగీకరించారు. మంగళవారం ఇక్కడికి వస్తున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని శ్రీసిటీ సెజ్‌ సమీపంలో హీరో ప్లాంట్‌ ఏర్పాటవుతుంది. వారు కోరినట్లుగా ఆరు వందల ఎకరాలు ఇస్తున్నాం. ఆ కంపెనీ వల్ల ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా మరో మూడువేల మందికి ఉపాధి లభిస్తుంది’’ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సైకిళ్ల తయారీ కర్మాగారం కూడా పెట్టాలని వారిని కోరానని, పరిశీలిస్తామని చెప్పారని తెలిపారు. టొయోటా కార్ల ఫ్యాక్టరీ కోసం కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. హీరో కంపెనీకి నూరు శాతం వ్యాట్‌ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎస్టీ వాటాను రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ కల్లం తెలిపారు. అయితే... విభజన తర్వాత వస్తున్న మొట్టమొదటి పరిశ్రమ కోసం దేనినైనా భరించడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి వారి దగ్గర నుంచి కూడా రాయితీ తెచ్చుకొందామని సీఎం చెప్పారు. హీరో మోటార్స్‌కు ఇస్తున్న రాయితీలను యథాతథంగా ఇతర పరిశ్రమలకు వర్తింపచేసే అవకాశం లేదని చెప్పారు. శ్రీసిటీ సెజ్‌లో తెలుగువారికి ఎక్కువగా ఉద్యోగాలు రావడంలేదని ఒక మంత్రి పేర్కొన్నారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... రాష్ట్రం పరిధిలో పెడుతున్న పరిశ్రమల్లో ఎక్కువ ఇక్కడివారికే రావాలని అన్నారు. ‘‘వృత్తి నైపుణ్యం పెంచడానికి పెడుతున్న కార్పొరేషన్‌లో శ్రీసిటీ యాజమాన్యాన్ని కూడా సభ్యునిగా పెట్టండి. అవసరమైన శిక్షణ ఇక్కడివారికి ఇచ్చి మన వారికే ఉద్యోగాలు వచ్చేలా చూడండి’’ అని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాల నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు రాయలసీమ, ఉత్తర కోస్తాలోనే భూములు కోరుతున్నారని, దీనివల్ల సమస్యలు వస్తున్నాయని కొందరు అధికారులు సమావేశంలో చెప్పారు. అవే రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగిలిన ఆరు జిల్లాలకు ఇవ్వడం సాధ్యపడుతుందా అన్నది పరిశీలించాలని బాబు సూచించారు. ఏకగవాక్ష విధానంలోనూ అనుమతులకు ఆలస్యమవుతోందని, అన్ని అర్హతలు ఉన్నవారు నేరుగా పరిశ్రమలు స్థాపించుకొనే సౌలభ్యం ఇవ్వాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. దీనిపై కూడా పరిశీలన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కనెక్టివిటీపై బీఎస్‌ఎన్‌ఎల్‌,
ఎయిర్‌టెల్‌కు ఆదేశాలు

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌, ప్రైవేట్‌ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ అధికారులను సోమవారంమంత్రివర్గ సమావేశానికి పిలిపించారు. ఈ సమావేశంలో సీఎం వారికి సూటి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని 8 వేల విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాపై ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తోంది. కానీ, అందులో రెండు వేల ఫీడర్ల నుంచి సమాచారం రావడం లేదు. వాటికి కనెక్టివిటీ లేకపోవడమే దీనికి కారణం. విద్యుత్‌ శాఖ చాలాకాలం నుంచి టెలికం సంస్థలను కోరుతున్నా అవి పట్టించుకోవడం లేదని అధికారులు సీఎంకి ఫిర్యాదు చేశారు.
దీనితో ఆ కంపెనీల అధికారులను నేరుగా మంత్రివర్గ సమావేశానికే పిలిపించారు. ఆ కంపెనీల అధికారులు చెప్పిన సంజాయిషీలను చంద్రబాబు వినలేదు. ‘‘మంగళవారం కేంద్ర మంత్రి కూడా వస్తున్నారు. మేం అన్ని ఇళ్లకు 24 గంటల కరెంటు ఇవ్వాలని అనుకొంటున్నాం. ఈ పథకం కేంద్రానిది. మీరు కనెక్టివిటీ ఇవ్వకపోతే కరెంటు ఎంత సరఫరా చేశామో మాకూ, కేంద్రానికి కూడా తెలియదు. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావాలి. లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని బ్లాక్‌లిస్ట్‌ చేయాల్సి వస్తుంది’’ అని ఆయన వారిని గట్టిగా చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో ఒక డీఎస్పీ ప్రమేయం ఉన్నట్లు వచ్చిన వార్తలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఏ స్థాయి అధికారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు.